తొమ్మిదేళ్లకి క్యాన్సర్‌ని... ఆపై ప్రపంచాన్నీ గెలిచింది

తొమ్మిదేళ్ల వయసులో కాన్సర్‌ బారిన పడిందా అమ్మాయి. శస్త్రచికిత్సలు, కీమో థెరపీలతో  బయట పడగలిగింది కానీ ఆ వ్యాధి ఇచ్చిన కుంగుబాటుని జయించడానికి మాత్రం ఆమెకు కొంత సమయం పట్టింది. అయినా.

Updated : 26 Aug 2021 13:15 IST

తొమ్మిదేళ్ల వయసులో కాన్సర్‌ బారిన పడిందా అమ్మాయి. శస్త్రచికిత్సలు, కీమో థెరపీలతో  బయట పడగలిగింది కానీ ఆ వ్యాధి ఇచ్చిన కుంగుబాటుని జయించడానికి మాత్రం ఆమెకు కొంత సమయం పట్టింది. అయినా... ఆ అమ్మాయి సంకల్పం గొప్పది. సవాళ్లకు ఎదురెళ్లి శారీరక సామర్థ్యంపై పట్టు తెచ్చుకుంది. స్పోర్ట్‌ క్లైంబింగ్‌ పోటీల్లో మేటిగా ఎదిగింది. పతకాల పంట పండిస్తోంది జమ్మూకి చెందిన శివానీ చారక్‌.

‘ఆపదలు ఎదురొచ్చినప్పుడు... ఆత్మవిశ్వాసం కోల్పోకపోతే చాలు... అనుకున్నది చేయొచ్చు’ అంటోంది శివాని. ఆమెది జమ్మూలోని రాజౌరీ జిల్లా. తల్లి స్టాఫ్‌ నర్సు, నాన్న కాలేజీ లెక్చరర్‌. వారికి నలుగురు సంతానం. చిన్నది శివానీ. తొమ్మిదేళ్ల వరకూ హాయిగా గడిచిపోయింది జీవితం. తర్వాతే తెలిసింది ఆమెకు అండాశయ క్యాన్సర్‌ మొదటి దశలో ఉందని. డాక్టర్లు ఎడమ వైపున ఉన్న ఓవరీ తీసేయాలన్నారు. అది విన్న ఆ అమ్మానాన్నలు బాధను దిగమింగుకుని కూతురి ముందు మామూలుగా మాట్లాడేవారు. శివానీ కూడా పరిణితితో వారి బాధను అర్థం చేసుకుంది. బెడ్‌ చుట్టుపక్కల తనకంటే చిన్నవయసులోనే క్యాన్సర్‌తో పోరాడుతోన్న వారెందరో ఉన్నారని గమనించింది. వారితో ఆడేది, పాడేది... ఇలా ఎంతో గుండె నిబ్బరంతో క్యాన్సర్‌తో పోరాడింది. శస్త్రచికిత్స తర్వాత కీమోలు అవసరం అన్నారు. అందుకోసం తనని తరచూ జమ్మూ నుంచి చండీగఢ్‌ తీసుకెళ్లే వారు. మూడేళ్లు పలు సర్జరీలు, కీమోథెరపీలు చేసిన తర్వాత పూర్తిగా కోలుకుంది. క్యాన్సర్‌ను జయించినా, అంతకు ముందులా ఉత్సాహంగా ఉండేది కాదు. ఏవేవో ఆలోచనలతో ఎప్పుడూ ఆందోళనతో కనిపించేది. తన మనసు మార్చడానికి ఇంట్లో వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు.

మొదటి గెలుపు...

స్కూల్లో తిరిగి చేరింది. అంతకుముందే తైక్వాండోలో శిక్షణ తీసుకుంది. కానీ... ఈ సారి అటు వెళ్లాలనుకోలేదు. అప్పుడే పాఠశాలలో జరుగుతోన్న క్రీడా పోటీల గురించి తెలిసింది. అందులో వాల్‌ క్లైంబింగ్‌ (బౌల్డరింగ్‌) తనని ఆకర్షించింది. అప్పటికే వాళ్లక్క శిల్పకి అందులో ప్రవేశం ఉంది. మొదట ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అది చాలా కఠినమైన క్రీడ, నీ ఆరోగ్యం సహకరించదన్నారు. కానీ తను పట్టువదల్లేదు. దాంతో తండ్రి డాక్టర్‌ సలహా తీసుకుని శిక్షణలో చేర్చాడు. అంతా బాగానే ఉంది కానీ... కాసేపటికే నిస్సత్తువ ఆవరించేది. అయినా వదిలేద్దామనుకోలేదు. ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేది. ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టింది. నీ శరీరాన్ని కష్టపెట్టుకోకు అని ప్రేమతో అమ్మ చెబుతుంటే... కళ్లల్లో నీళ్లు తిరిగేవి. సాధించాలనే సంకల్పం ఆ బాధలన్నీ దాటేలా చేసింది. పాఠశాల స్థాయిలో తొలి ఈవెంట్‌లోనే రజత పతకం అందుకుంది. ఇదే విభాగంలో తన అక్క శిల్ప స్వర్ణం సాధించింది. సరైన వసతులు లేకపోయినా ఆటపై పట్టు సాధించిన వీరిద్దరూ.. టోర్నమెంట్లు, జిల్లా స్థాయి పోటీలు, జోన్‌ పోటీల్లో సత్తా చూపిస్తూ ర్యాంకుల్లో దూసుకుపోయారు. ప్రస్తుతం ఈ ఆటలో దేశంలోనే మొదటి ర్యాంకులో కొనసాగుతోంది శివానీ. క్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. క్లైంబింగ్‌ ప్రారంభించిన ఐదేళ్లలో ఎనిమిది స్వర్ణాలు, పది వెండి, రెండు కాంస్యాలతో మొత్తం 21 పతకాలు గెలుచుకుంది. ప్రపంచకప్‌, ఆసియాకప్‌, ఏషియన్‌ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు 2022లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు సిద్ధమవుతోంది. అలానే జమ్మూలోని సైనికులకోసం ప్రత్యేక శిక్షణా శిబిరాలనూ నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్