Published : 27/12/2022 20:35 IST

ఆ జ్ఞాపకాలు డిలీట్ చేసేయండి..!

ప్రాణానికి ప్రాణంగా కలిసి బతికిన, మన అనుకున్న వాళ్లే ఒక్కోసారి దూరమైపోతుంటారు.. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడం కష్టమే! బ్రేకప్.. ప్రేమికుల మధ్యే కాదు.. ఒక్కోసారి ప్రాణ స్నేహితుల మధ్యా సహజమే..! మరి ఇలాంటి పరిస్థితులలో ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి?

రియలైజ్‌ అవ్వాలి!

ఎంతసేపూ బాధపడుతూ కూర్చుంటే స్నేహబంధం విడిపోవడానికి అసలు కారణమేంటో గుర్తించలేం. కాబట్టి ఇద్దరూ విడిపోవడానికి తప్పు మీదా? లేదంటే మీ స్నేహితురాలిదా? అన్న విషయం ముందుగా తెలుసుకోవాలి. ఈక్రమంలో ఒకవేళ తప్పు మీవైపు ఉంటే.. వెళ్లి క్షమాపణ కోరి.. బంధాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఓ పద్ధతి! లేదు.. తప్పు తన వైపు ఉంది.. అయినా మీ నుంచి విడిపోదామనే కోరుకుంటే మాత్రం మీరు బతిమాలాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. ఇదే విషయాన్ని గ్రహించి.. ‘తప్పు తన వైపు పెట్టుకొని నన్నే దోషిని చేస్తున్నప్పుడు నేనెందుకు తన గురించి ఆలోచించాలి..?’ అని మీ మనసుకు చెప్పుకోండి. ఇలా అసలు విషయం గ్రహించిన మరుక్షణం నుంచి మీలో మార్పు మొదలవడం మీరు గుర్తించచ్చు. ఈ మార్పే మీ బాధను దూరం చేసి సంతోషాన్ని దగ్గర చేస్తుంది.

వాటిని డిలీట్‌ చేయండి!

ఎంత వద్దనుకున్నా ఒక్కోసారి చేదు జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడం సహజం. ఇలాంటప్పుడు చాలామంది చేసే పని.. ఆ జ్ఞాపకాల తాలూకు ఫొటోలు, వీడియోలు చూడడం, సందేశాలు చదవడం..! నిజానికి దీనివల్ల బాధ రెట్టింపవడం తప్ప మరే ప్రయోజనం లేదు. అందుకే వాటిని ఇంకా అట్టే పెట్టుకోకుండా మీ మనసు నుంచి తొలగించడం వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇలా మనసుకు బాధ కలిగినప్పుడు ఒంటరిగా ఉండకుండా మీ ఇంట్లో వాళ్లతో మీ బాధను పంచుకోవడం, వాళ్లతో కాస్త సమయం గడపడం వల్ల.. మరింత కుంగిపోకుండా జాగ్రత్తపడచ్చు.. తద్వారా ఆ బాధను త్వరగా మర్చిపోయే అవకాశాలూ ఎక్కువే!

ఇలా చేయచ్చు!

స్వీయ ప్రేమ ఎలాంటి బాధ నుంచైనా మనల్ని బయటపడేయగలదని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఒంటరిగా ఫీలవకుండా మనకంటూ కాస్త సమయం కేటాయించుకోవడం, నచ్చిన పనులపై దృష్టి పెట్టడం వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంటుంది.

మనసు బాగోలేనప్పుడు మనపై మనకే కోపమొస్తుంటుంది. అలాంటప్పుడు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలై మానసిక ప్రశాంతతను అందిస్తాయని ఓ అధ్యయనంలో రుజువైంది. అందుకే బ్రేకప్‌ బాధ నుంచి విముక్తి పొందాలంటే వ్యాయామం చక్కటి ఔషధం అంటున్నారు నిపుణులు.

ఫ్రెండ్‌షిప్‌లో ఒక్కసారి బ్రేకప్‌ అయినంత మాత్రాన ఇంకొకరితో స్నేహం చేయకూడదనుకోవడం పొరపాటు అంటున్నారు నిపుణులు. ఈక్రమంలో గత స్నేహంలో మీ తప్పులేవైనా ఉంటే సరిదిద్దుకొని, మరోసారి అవి పునరావృతం కాకుండా చూసుకోవడం మంచిదంటున్నారు. అలాగే పూర్వపు చేదు అనుభవాల గురించి మీ కొత్త స్నేహితులతో చెప్పడమూ తప్పు కాదు. నిజానికి ఈ పారదర్శకత ఇద్దరి మధ్య స్నేహాన్ని మరింత దగ్గర చేస్తుంది.. అలాగే మీ గురించి వారికి చెప్పకనే చెబుతుంది.

మరి, ఇన్ని చేసినా బ్రేకప్‌ బాధ నుంచి బయటపడలేకపోతున్నారా? సంతోషంగా ఉన్నప్పుడల్లా గత జ్ఞాపకాలు గుర్తొచ్చి మళ్లీ ఒత్తిడిలోకి కూరుకుపోతున్నారా? అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని