Published : 21/02/2023 19:12 IST

అక్కడ నలుపు మాయమిలా!

తరచూ ఎంత శుభ్రం చేసినా చంకల్లో నలుపుదనం ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. అలాగని దానివల్ల అంతగా సతమతమైపోవాల్సిన పని లేదు. ఆ నలుపుని తరిమికొట్టే ప్రత్యామ్నాయాలు మన ఇంట్లోనే ఉన్నాయి.

⚛ ఒక గిన్నెలో రెండు చెంచాల బ్రౌన్‌ షుగర్‌ లేదా మామూలు చక్కెర వేసి అందులో ఒక నిమ్మచెక్కను పిండి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని అండర్‌ ఆర్మ్స్‌కు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. అలా పూర్తిగా ఆరాక రెండు నిమిషాల పాటు నెమ్మదిగా రుద్ది ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి. చక్కెర మంచి స్క్రబ్‌లా పనిచేసి నలుపును తగ్గిస్తుంది. నిమ్మరసం అక్కడ పేరుకుపోయిన బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. చెమట వల్ల దుర్వాసన రాకుండా నివారిస్తుంది.

⚛ కీరా ముక్కలను సన్నగా కట్‌ చేసి నల్లగా ఉన్న ప్రాంతంలో ఐదు నిమిషాల పాటు రుద్దాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరి. తక్షణ ఫలితం రావాలంటే రోజూ స్నానానికి వెళ్లేముందు కీరా ముక్కలతో ఆ ప్రాంతంలో క్రమం తప్పకుండా రుద్దుకుంటే సరిపోతుంది.

⚛ కొన్ని నీళ్లలో బంగాళదుంప ముక్కలను వేసి ఒక రెండు నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలతో చంకల్లో నల్లగా ఉన్న ప్రాంతంలో రుద్దాలి. బంగాళదుంపలోని బ్లీచింగ్‌ ఏజెంట్స్‌ కారణంగా నలుపు తగ్గుముఖం పడుతుంది.

⚛ గుప్పెడు వేపాకులు తీసుకుని వాటిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చెంచా పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. వేప, పసుపు.. ఈ రెండింటిలో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల వల్ల చంకల్లో ఏర్పడిన బ్యాక్టీరియా పూర్తిగా తగ్గడమే కాకుండా నలుపుదనం కూడా తగ్గిపోతుంది.

⚛ ఒక గిన్నెలో రెండు స్పూన్ల తాజా పెరుగు, నారింజ తొక్కల పొడి వేసి బాగా కలిపి నల్లగా ఉన్న చోట అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుని అక్కడ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం తగ్గి ఆ ప్రాంతమంతా తెల్లగా మారుతుంది.

⚛ ఈ పద్ధతినీ ట్రై చేయచ్చు. నారింజ, బత్తాయి, కమలాఫలం పండ్ల తొక్కల్ని తీసి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పౌడర్‌గా చేసుకోవాలి. మీ చర్మతత్వాన్ని బట్టి ఇందులో తేనె, పాలు.. కలుపుకొని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. నలుపుదనం ఉన్న దగ్గర ఇది రాసుకుని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి.

⚛ మీ ఇంట్లో కలబంద మొక్క ఉందా? అయితే ఇంకేం, మీ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లో ఉన్నట్లే. కలబంద ముక్కను కోసి నలుపుగా ఉన్న ప్రాంతంలో రోజూ ఐదు నిమిషాల పాటు రుద్దితే సరి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల చంకల్లోని నలుపు చాలా తొందరగా తగ్గిపోతుంది.

⚛ కొద్దిగా శెనగపిండి తీసుకుని దానిలో చెంచా చొప్పున పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి ఆరనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని