Published : 18/05/2022 16:32 IST

Netiquette: అమ్మాయిలూ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. దాంతో చాలామంది ఆన్‌లైన్‌లోనే మాట్లాడుకుంటున్నారు. ఇందుకోసం వాట్సప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. మన దేశంలో సగటున రోజుకి 2.36 గంటల సేపు సోషల్‌ మీడియాలోనే గడుపుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు కొన్ని రకాల ఇంటర్నెట్ మర్యాదలు (నెటికెట్) పాటించాలంటున్నారు నిపుణులు. ఫలితంగా పలు సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా...

భాషే ప్రధానం..

మనం మాట్లాడే విధానాన్ని బట్టే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంటారు. కాబట్టి, ఇతరులతో పద్ధతిగా మాట్లాడడం ఎంతో అవసరం. ఇదే, ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో ఇతరులతో చాట్‌ చేసేటప్పుడు మర్యాదపూర్వకమైన భాషను ఉపయోగించాలి. మెసేజ్‌ చేసేటప్పుడు పదాలన్నీ క్యాపిటల్ లెటర్స్‌లో ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతరులపై కోపం ప్రదర్శిస్తున్నారనే అర్థం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏదైనా పదాన్ని మెసేజ్‌ చేసేటప్పుడు మొదటి అక్షరం క్యాప్స్‌లో పెట్టాలి. లేదా, అన్ని అక్షరాలను లోయర్‌ కేస్‌లో పెట్టినా ఇబ్బంది లేదు. అలాగే ‘ప్లీజ్‌’, ‘థాంక్యూ’ వంటి పదాలను ఉపయోగిస్తుండాలి.

వారి ప్రైవసీని గౌరవించాలి...

ఈ రోజుల్లో చాలామంది మధ్య వచ్చే మనస్పర్థల్లో ఆన్‌లైన్‌ ప్రముఖ పాత్ర వహిస్తోంది. కాబట్టి, ఇందులో పోస్టులు పెట్టేటప్పుడు, చాట్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అనుమతి తీసుకోకుండానే వాట్సప్‌ గ్రూపుల్లో ఇతరులను జాయిన్‌ చేస్తుంటారు. మరికొంతమంది ఇతరుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇవన్నీ ఇతరుల ప్రైవసీని హరించే చర్యలే. కాబట్టి, ఇతరులకు సంబంధించిన ఏ సమాచారమైనా సరే సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచేటప్పుడు వారి అనుమతి తీసుకోవడం మంచిది.

సానుకూలమైన పోస్టులు...

చాలామంది తమకు తోచిన అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. మీరు పెట్టే పోస్టులు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో పెళ్లి, ఉద్యోగం వంటి విషయాలకు సంబంధించి కూడా మీ సోషల్‌ మీడియా ఖాతాల వైపు తొంగి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి, పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు ఇతరులను గౌరవించే విధంగా, పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇతరులు పెట్టే పోస్ట్‌లు షేర్‌ చేయాలనుకున్నప్పుడు కూడా చెక్‌ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అది మీరు సొంతంగా చేసే పోస్ట్‌ కానప్పటికీ పరోక్షంగా మీరు ఆ పోస్ట్‌ను సమర్థించినవారవుతారు.

అపరిచితులతో జాగ్రత్త...

ఆన్‌లైన్‌లో అపరిచితులకు కొదవ లేదు. ఆన్‌లైన్‌ ద్వారా పరిచయమైన అబ్బాయిలతో ప్రేమలో పడి మోసపోయిన అమ్మాయిల వార్తలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కాబట్టి, సామాజిక మాధ్యమాల్లో అపరిచితులకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ అలాంటివారితో మాట్లాడాల్సి వస్తే వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేటప్పుడు కానీ, యాక్సెప్ట్‌ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి.

ఆ పదాలు వద్దు..

చాలామంది సోషల్‌ మీడియాలో రకరకాల గ్రూపులను క్రియేట్‌ చేస్తుంటారు. మనలో చాలామంది ఏదో ఒక గ్రూపులో సభ్యులుగా ఉండడం చూస్తూనే ఉంటాం. కొంతమంది ఇలాంటి గ్రూపులో సున్నితమైన అంశాలపై గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. స్నేహితులు, బంధువులు, జీవిత భాగస్వామి.. ఇలా ఎవరితో మాట్లాడినా ఆన్‌లైన్‌లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఏదైనా హానికరమైన సమాచారం కనిపిస్తే రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

మీ ప్రైవసీ కూడా ముఖ్యమే...

ఆన్‌లైన్‌లో ప్రైవసీ చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో జరిగే అనేక నేరాలకు ఆన్‌లైన్‌ కేంద్రంగా ఉంటోంది. కాబట్టి, మీ సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. సోషల్‌ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. మీ లొకేషన్‌, మొబైల్‌ నంబర్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సాధ్యమైనంత వరకు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. అలాగే తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలి. ఆన్‌లైన్‌ నేరాలకు ఇలాంటి వెబ్‌సైట్లే అడ్డాగా మారుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి