అద్దమూ మెరవాలిగా..!

డ్రస్సింగ్ టేబుల్, బాత్‌రూమ్, లివింగ్ రూమ్.. ఇలా పలు ప్రదేశాల్లో అమర్చిన అద్దాలపై దుమ్ము, ధూళి చేరడమే కాకుండా నీళ్ల చుక్కలు పడి మరకలుగా తయారవడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి మరకలు జిడ్డు లాగా అంటుకొని ఎంత శుభ్రం....

Published : 15 Mar 2024 20:07 IST

డ్రస్సింగ్ టేబుల్, బాత్‌రూమ్, లివింగ్ రూమ్.. ఇలా పలు ప్రదేశాల్లో అమర్చిన అద్దాలపై దుమ్ము, ధూళి చేరడమే కాకుండా నీళ్ల చుక్కలు పడి మరకలుగా తయారవడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి మరకలు జిడ్డు లాగా అంటుకొని ఎంత శుభ్రం చేసినా వదలవు. దీనివల్ల అద్దం ఎంత మంచి డిజైన్‌లో ఉన్నా.. దాని అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి అద్దంపై పడిన ఇలాంటి జిడ్డు మరకల్ని సులభంగా తొలగించి.. అద్దాన్ని తళతళా మెరిపించడానికి కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు మనకు అందుబాటులోనే ఉన్నాయి.

ఆవిర్లు పట్టకుండా..

వేడినీటితో స్నానం చేయడం పూర్తయిన తర్వాత బాత్‌రూమ్‌లోని అద్దంపై పొగమంచు లాంటి ఒక పొర పేరుకుపోవడం అప్పుడప్పుడూ మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా తరచూ జరగడం వల్ల దానిపై నీటి మరకలు పడి అవి మొండిగా మారిపోయే అవకాశం ఉంటుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే.. స్నానానికి ముందే ఆ అద్దంపై షేవింగ్ క్రీమ్‌ను సన్నటి పొరలా పూయాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిస్తే అప్పుడు దానిపై ఆవిర్లు, పొగమంచులా పేరుకుపోవడం.. వంటివి జరగకుండా, ఎలాంటి మరకలు పడకుండా జాగ్రత్తపడచ్చు. ఈ చిట్కాను కార్ల అద్దాలు, గ్లాస్ కిటికీలు.. వంటివి శుభ్రం చేయడానికి కూడా వాడచ్చు.

డిస్టిల్డ్ వాటర్..

ఇంట్లోని అద్దాన్ని శుభ్రం చేయడానికి చాలామంది సాధారణ నీటిని ఉపయోగిస్తుంటారు. అయితే దీనికి బదులు డిస్టిల్డ్ వాటర్‌ని ఉపయోగించడం మంచిది. ఈ నీటితో తుడవడం వల్ల అద్దంపై సన్నటి గీతలు, చారలు.. వంటివి పడే ఆస్కారం ఉండదు. పైగా అద్దంపై ఉండే సన్నటి దుమ్ము, ధూళి.. వంటివి కూడా తొలగిపోతాయి. తద్వారా అద్దానికి కొత్త మెరుపు వస్తుంది. దీన్ని నేరుగా ఉపయోగించడంతో పాటు ఇతర క్లీనింగ్ ఉత్పత్తుల్లో కూడా కలుపుకొని వాడుకోవచ్చు.

బేకింగ్ సోడాతో..

అద్దంపై పడిన జిడ్డు మరకల్ని తొలగించడానికి బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం స్పాంజి లేదా ఒక శుభ్రమైన గుడ్డను బేకింగ్ సోడాలో అద్ది దాంతో అద్దంపై రుద్దాలి. ఆ తర్వాత దానిపై కొన్ని నీళ్లు చల్లి మరో శుభ్రమైన గుడ్డతో మళ్లీ నెమ్మదిగా రుద్దాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న టవల్‌తో శుభ్రంగా తుడిచేయాలి. ఈ ప్రక్రియ వల్ల అద్దంపై ఉన్న మొండి మరకలన్నీ తొలగిపోయి అద్దం తళతళా మెరిసిపోతుంది.

తెల్లటి పేపర్‌తో..

తెల్లటి పేపర్లను ఉండలుగా చుట్టి, నీటితో తడిపి వీటితో అద్దంపై నెమ్మదిగా, గుండ్రంగా పై నుంచి కింది వరకు రుద్దుతూ రావాలి. ఫలితంగా అద్దంపై పడిన మరకలు సులభంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వెనిగర్, నీరు కలిపిన మిశ్రమాన్ని ముందుగా అద్దంపై స్ప్రే చేసి తర్వాత దాన్ని పేపర్‌తో శుభ్రం చేసినా సరిపోతుంది. అయితే ఈ క్రమంలో కొందరు న్యూస్ పేపర్‌ని వాడుతుంటారు. కానీ తడి వల్ల ఆ పేపర్ ఇంక్ అద్దానికి అంటుకొని మరిన్ని మరకలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

వెనిగర్‌తో కూడా!

మరకలు పడిన అద్దాన్ని మెరిపించడానికి వెనిగర్ కూడా ఉపయోగపడుతుంది. వెనిగర్, నీరు.. ఈ రెండింటినీ సమపాళ్లలో స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది మోతాదులో అద్దంపై స్ప్రే చేసి శుభ్రమైన టవల్‌తో మృదువుగా రుద్దాలి. ఫలితంగా మొండి మరకలు తొలగిపోయి అద్దం మిలమిలలాడుతుంది.

ఈ జాగ్రత్తలు కూడా!

అద్దంపై మరకల్ని తొలగించే క్రమంలో దానిపై చల్లే నీరు లేదంటే ఇతర మిశ్రమం మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. లేదంటే ఆ మిశ్రమం అద్దం పక్కలకు, చివర్లలో ఉన్న చెక్క, ఇతర మెటీరియల్ సందుల్లోకి ప్రవేశించచ్చు. కాబట్టి అవసరమైన మోతాదులోనే అద్దంపై మిశ్రమాన్ని స్ప్రే చేయడం మంచిది.

అద్దం మూలల్ని శుభ్రపరిచేటప్పుడు కాటన్ స్వాబ్స్, మృదువైన టూత్‌బ్రష్‌లను ఉపయోగిస్తే మరింత బాగా శుభ్రపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్