Globetrotter: అలుపెరగని ఈ బాటసారి.. 70 దేశాలు తిరిగింది..!

కుటుంబ బాధ్యతలు, ఆఫీసు పనుల్లో పడి చాలామంది మహిళలు తమ వ్యక్తిగత సమయాన్ని విస్మరిస్తుంటారు. ఎప్పుడో వీలు చిక్కితే అలా తీర్థ యాత్రలు, విహార యాత్రలకు వెళుతుంటారు. కానీ, 33 ఏళ్ల సిబు డి బెనెడిక్టిస్ అనే అమ్మాయి మాత్రం తన జీవితం ప్రపంచ పర్యటనకే అంకితం........

Published : 25 Jun 2022 12:16 IST

(Photos: Instagram)

కుటుంబ బాధ్యతలు, ఆఫీసు పనుల్లో పడి చాలామంది మహిళలు తమ వ్యక్తిగత సమయాన్ని విస్మరిస్తుంటారు. ఎప్పుడో వీలు చిక్కితే అలా తీర్థ యాత్రలు, విహార యాత్రలకు వెళుతుంటారు. కానీ, 33 ఏళ్ల సిబు డి బెనెడిక్టిస్ అనే అమ్మాయి మాత్రం తన జీవితం ప్రపంచ పర్యటనకే అంకితం అని చెబుతోంది. పదేహేడేళ్ల వయసులో పైచదువుల కోసం చైనా వెళ్లిన ఆమె.. ఇప్పటివరకు దాదాపు 70 దేశాల్లో పర్యటించింది. ‘ఆస్తులకంటే అనుభవాలే’ ముఖ్యమంటోన్న సిబు ఇల్లు, పెళ్లి, కుటుంబం.. వంటి ఝంఝాటాలేవీ లేకుండా సోలోగా ప్రపంచాన్ని చేట్టేస్తోంది. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటోంది. అలాగని ఆమె సంపన్నురాలు కాదు. కొన్ని రకాల చిట్కాలతో డబ్బు పోగు చేసుకుంటూ.. తక్కువ ఖర్చుతోనే ఆయా దేశాల్లో పర్యటిస్తోంది. ‘ప్రపంచమే నా ఇల్లు’ అంటూ ఆమె తన ప్రయాణ వివరాలు, ఖర్చుల గురించి ఇటీవలే సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. అవి కాస్తా నెట్టింటా వైరలవడంతో.. చాలామంది ఆమె గురించి, తాను చేస్తోన్న ప్రపంచ పర్యటన గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఆ విశేషాలే ఇవి!

చైనాలో మొదలై..

సిబు తల్లిదండ్రులది ప్రేమ వివాహం. ఒకరిది అమెరికా అయితే మరొకరిది కోస్టారికా. దాంతో సిబు బాల్యమంతా ఈ రెండు ప్రాంతాల్లోనే గడిచింది. హైస్కూల్‌ పూర్తైన తర్వాత గ్రాడ్యుయేషన్‌ చేయడం కోసం సిబుకు చైనా వెళ్లే అవకాశం వచ్చింది. అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు. సిబుది సంపన్న కుటుంబం కాదు. దాంతో రిటర్న్ టికెట్‌ లేకుండానే ఒంటరిగా చైనాలో అడుగు పెట్టిందామె. ఆ సమయంలో ఆమెకు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఆమె దగ్గర ఫోను లేదు.. మాట్లాడడానికి చైనా భాష రాదు. పోనీ.. ఇంగ్లిష్‌లోనైనా మేనేజ్‌ చేద్దామంటే.. అక్కడ ఇంగ్లిష్‌ మాట్లాడే వారూ తక్కువే! మరోవైపు.. సౌకర్యాలూ అంతంతమాత్రమే! ఇదిగో ఇలాంటి అనుభవాలే తనకు తానే స్వీయ అవకాశాలను సృష్టించుకునేలా చేశాయని చెబుతోంది సిబు. ‘ఆస్తుల కంటే అనుభవాలే’ ముఖ్యమని అనుకొని ప్రపంచమంతా చుట్టేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుందామె. ఈ క్రమంలో విమాన ప్రయాణం, వీసా పనులు, విదేశాల్లో ఉద్యోగం పొందడమెలా?.. వంటి విషయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది సిబు.

అది అపోహే...

విదేశాలు చుట్టి రావాలంటే బోలెడన్ని డబ్బులుండాలని చాలామంది అనుకుంటారు. కానీ అది సరైన నిర్ణయం కాదని అంటోంది సిబు. ‘స్మార్ట్‌గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ బడ్జెట్‌లో ప్రయాణాలు చేయచ్చు. కొన్ని సదుపాయలను ఉచితంగానే పొందచ్చు. కాకపోతే దీనికి కొంత రీసెర్చ్‌ చేయాలి’ అని చెబుతోంది. ఇందుకోసం సిబు పలు రకాల మొబైల్‌ యాప్స్‌ని ఉపయోగించుకుంటోందట. ‘ట్రస్టెడ్‌హౌజ్‌సిట్టర్స్‌’ వంటి యాప్స్‌ని వసతుల కోసం ఉపయోగించుకుంది. ఇందులో సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీరు వెళ్లే ప్రదేశంలో ఇంటి యజమానులు లేని సమయంలో వారి వస్తువులు వినియోగించుకోవడం లేదా పెట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం వారి ఇళ్లల్లో ఉండడానికి అనుమతినిస్తారట. కొన్నిసార్లు ఉచితంగానే వసతి సదుపాయం పొందే అవకాశం కూడా ఉంటుందట! ఇలా అవకాశం దొరికినప్పుడల్లా అక్కడి ప్రాంతాలను చూడడానికి వెళ్తుంటానని చెబుతోంది సిబు.

దుస్తుల విషయంలో కూడా సిబు పలు జాగ్రత్తలు తీసుకుంటుందట. ఈ క్రమంలో విహారయాత్రల్లో తనకు సౌకర్యంగా ఉండేలా, క్యాజువల్‌ వేర్‌కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తానంటోంది. అలాగే ఎప్పుడంటే అప్పుడు పర్యటనలకు వెళ్లేందుకు వీలుగా.. ఆమె లగేజ్‌ బ్యాగ్‌లో మూడు వారాలకు సరిపడా దుస్తులు-వస్తువులు ఉండేలా సర్ది పెట్టుకుంటుందట ఈ యంగ్‌ ట్రావెలర్‌.

మరి, డబ్బెలా?!

వెళ్లిన చోట వసతి సౌకర్యం సరే.. కానీ, అక్కడి చూడదగిన ప్రాంతాల్ని చుట్టేయడానికి డబ్బులెలా వస్తాయనేగా మీ సందేహం? ఇందుకోసం వర్క్‌అవే(WorkAway) వంటి యాప్స్‌ని ఉపయోగించుకుంటుందట సిబు. ఈ క్రమంలో పలు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తానంటోంది. ‘విదేశాలకు వెళ్లడానికి కొన్ని రకాల స్కాలర్‌షిప్‌లు చక్కగా ఉపయోగపడతాయి. వీటి ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు అక్కడి పర్యటక ప్రాంతాల్ని చుట్టేయచ్చు..’ అంటోంది సిబు. అలా ఇప్పటివరకు ఆమె ఎనిమిది రకాల స్కాలర్‌షిప్‌లతో 8 దేశాల్లో పర్యటించిందట! వీటికి తోడు పలు సంస్థలకు కంటెంట్‌ క్రియేషన్‌, బ్లాగ్‌ పోస్టులు రాస్తూ, బ్రాండ్‌ అంబాసిడర్‌ ప్రోగ్రామ్స్‌, అఫిలియేట్‌ పార్ట్‌నర్‌షిప్స్‌.. వంటివి చేస్తూ డబ్బులు సమకూర్చుకుంటోంది.

యాక్టివ్‌గా అప్‌-టు-డేట్‌..

సిబు తన వరల్డ్‌ టూర్‌లో భాగంగా ఇప్పటివరకు 70 దేశాల్లో వివిధ ప్రాంతాలను చుట్టేసింది. ఇందులో పోలండ్‌, యూకే, జర్మనీ, అమెరికా దేశాల్లో ఎక్కువ రోజులు గడిపింది. ఇక విహారయాత్రల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన అనుభవాల్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకోవడం ఈ సోలో ట్రావెలర్‌కు అలవాటు! ఈ క్రమంలో ప్రయాణాలపై మక్కువ ఉన్న వారికి పలు రకాల టిప్స్‌ను కూడా చెబుతుంటుంది. సిబు తన ప్రయాణ అనుభవాలను రంగరించి ‘హౌ టు ట్రావెల్‌  మోర్‌’ అనే పుస్తకాన్ని కూడా రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని