4 వారాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం!

ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 80% మంది పని ఒత్తిడికి కుంగిపోతుంటే అందులో సగానికి పైగా ఒత్తిడిని జయించే మార్గాల కోసం అన్వేషిస్తున్నారట. ఈ మాటను స్వయంగా డాక్టర్లే....

Published : 10 Jun 2023 14:15 IST

ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 80% మంది పని ఒత్తిడికి కుంగిపోతుంటే అందులో సగానికి పైగా ఒత్తిడిని జయించే మార్గాల కోసం అన్వేషిస్తున్నారట. ఈ మాటను స్వయంగా డాక్టర్లే చెబుతున్నారు. ఈ మానసిక సమస్యను వెంటనే గ్రహించి సరైన పరిష్కారాన్ని కనుగొనకపోతే అది అల్జీమర్స్ (మతిమరుపు), ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీస్తుందని మానసిక వైద్యులు అంటున్నారు. మరి అటువంటి ఈ ఒత్తిడి భూతాన్ని ఎలా తరిమేయాలి ? అంటే.. నాలుగు వారాల పాటు ఇలా చేస్తే చాలంటున్నారు.


మొదటి వారం ఇలా చేయండి!

⚛ ఒత్తిడిని జయించడంలో మానసిక వైద్యులు సూచించిన మొదటి స్టెప్.. రాత్రి సమయంలో మీ ఫోన్లని పక్కన పెట్టేయడమే! గ్యాడ్జెట్ల నుంచి కొద్దిసేపైనా మనకి మనం కాస్త విరామాన్ని ప్రకటించుకోవడమే ఈ దశ ఉద్దేశం. అందుకే డిజిటల్ ప్రపంచానికి విరామాన్ని ప్రకటిస్తూ రాత్రి 8 నుండి ఉదయం లేచే వరకు ఫోన్, ఇతర గ్యాడ్జెట్లకు రెస్ట్ ఇవ్వమంటున్నారు వైద్యులు.

⚛ ఇక ఈ వారంలో చేయాల్సిన మరో పని.. ఓ లిస్ట్ తయారు చేసుకోవడం. ఏంటా లిస్టు అంటారా ? చిన్న చిన్న విషయాల్ని మార్చుకోవడం వల్ల మన జీవితంలో చాలా పెద్ద మార్పులొస్తాయని వైద్యులు అంటున్నారు. అందుకే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే ప్రతి పనినీ నోట్‌ చేసుకోమంటున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ఏ విషయంలో ఒత్తిడికి లోనవుతున్నారో తెలిసిపోతుందంటున్నారు.

⚛ ఇక చివరగా పాటించాల్సింది సుఖ నిద్ర. వివిధ రకాల సమస్యలు కేవలం మంచి నిద్ర వల్ల నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిద్ర విషయంలో మనల్ని మనం పసిపిల్లల్లా భావించుకొని స్ట్రిక్ట్‌గా వ్యవహరించాలంటున్నారు.


రెండో వారంలో ఇలా చేయాలి!

⚛ ఒత్తిడికి లోనయ్యే వారు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. చాలామంది ఊబకాయులుగా మారడానికి ఇదే కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకు బిర్యానీ, స్వీట్లు, ఇతరత్రా జంక్ ఫుడ్స్, బయట చిరుతిండ్ల జోలికి పోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

⚛ అలాగే ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ క్రమంలో కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవడం మర్చిపోవద్దు.


మూడో వారంలో ఆ రెండూ ముఖ్యం!

అటు రకరకాల గ్యాడ్జెట్స్‌ని పొదుపుగా వాడుతూ.. ఇటు భోజనంలో సరైన నియమాలను పాటిస్తూ మూడో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైన పని 'ధ్యానం'. అన్ని రోగాల్నీ నయం చేసే ఔషధం ఇది. దీన్ని ఎలా చేయాలంటే..!

⚛ ఎక్కడైనా ప్రశాంతంగా నిల్చుని లేక కూర్చుని నడుముని నిటారుగా ఉంచాలి.

⚛ గాలి పీలుస్తూ అయిదంకెలు లెక్కపెట్టాలి.

⚛ ఇప్పుడు పది సెకండ్ల పాటు ఊపిరిని నిలపాలి.

⚛ ఆ తర్వాత ఎనిమిదంకెలను లెక్కపెడుతూ గాలిని బయటకి వదలాలి.

⚛ ఇలా పలుమార్లు రిపీట్ చేయాలి.

ధ్యానంతో పాటు ఈ వారంలో నేర్చుకోవాల్సింది 'నో' చెప్పడం. తలకి మించిన భారం నెత్తినేసుకోవడం కూడా ఒత్తిడికి ఒక కారణమే. ఇష్టం లేకపోయినా మొహమాటంతో ఇతరులు చేయాల్సిన పనిని తమ భుజాలపై వేసుకుంటుంటారు చాలామంది. దీనివల్ల మీరు చేయాల్సిన ఇతర పనులపై ప్రభావం పడుతుంది. అప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒత్తిడి ప్రవేశిస్తుంది. అందుకే అటువంటి సందర్భాల్లో 'నో' చెప్పడం అలవాటు చేసుకోవాలంటున్నారు వైద్యులు.


నాలుగో వారం.. ఓపిగ్గా..!

ఇక నాలుగో వారం అంతా కూడా మీరెలా మానసికంగా వృద్ధి చెందుతున్నారన్న దానిపైనే దృష్టి పెట్టాలి. అవసరమైతే మీలో మీరు గమనించిన పాజిటివ్ విషయాలను నోట్ చేసుకోవాలి. అలాగే మీ తప్పులనూ గమనించగలగాలి. వాటిని సవరించుకునే మార్గాలను అన్వేషించాలి. ఇలా ఆలోచనలు ఆచరణలోకి మారి అలవాట్లుగా మారినప్పుడే మీపై మీరు విజయం సాధిస్తారు. మరి అలా చేస్తారు కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని