Year Ender 2022 : ‘వధువు’లుగా మెరిసిపోయారు!

సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు.. పెళ్లంటే మరింత హడావిడి చేస్తుంటారు. ఎంచుకునే దుస్తులు, ధరించే నగల విషయంలో సరికొత్త ట్రెండ్స్‌ని ఫాలో అవుతుంటారు. మరి, మనమే ఇలా ఆలోచిస్తే.. ఈ విషయంలో సెలబ్రిటీలు నాలుగాకులు ఎక్కువే చదువుతారని....

Published : 30 Dec 2022 21:25 IST

(Photos: Instagram)

సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు.. పెళ్లంటే మరింత హడావిడి చేస్తుంటారు. ఎంచుకునే దుస్తులు, ధరించే నగల విషయంలో సరికొత్త ట్రెండ్స్‌ని ఫాలో అవుతుంటారు. మరి, మనమే ఇలా ఆలోచిస్తే.. ఈ విషయంలో సెలబ్రిటీలు నాలుగాకులు ఎక్కువే చదువుతారని చెప్పాలి. దుస్తులు, ఆభరణాలు, మేకప్‌.. ఇలా ప్రతి విషయంలోనూ ‘నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’గా మెరిసిపోవాలనుకుంటారు. అలా ఈ ఏడాది తమ పెళ్లిలో ట్రెండీగా మెరిసిపోయిన కొందరు సెలబ్రిటీ వధువుల డ్రస్సింగ్‌ స్టైల్‌ గురించి తెలుసుకుందాం..!

హన్సిక ‘రాయల్‌’ లుక్‌!

తమ పెళ్లి కోసం చీరలకు బదులు లెహెంగాలను ఎంచుకొంటున్నారు కొందరు సెలబ్రిటీ వధువులు. ఇటీవలే తన ప్రియుడు సోహైల్‌తో ఏడడుగులు వేసిన హన్సిక కూడా ఇదే ట్రెండ్‌ని ఫాలో అయింది. దిల్లీకి చెందిన డిజైనర్‌ ద్వయం రింపుల్‌, హర్‌ప్రీత్‌ రూపొందించిన ఎరుపు రంగు భారీ లెహెంగాలో వధువుగా ముస్తాబైందీ మిల్కీ బ్యూటీ. రేషమ్‌ జర్దోసీ, కశ్మీరీ టిల్లా, నక్షి, సీక్విన్‌, పర్ల్‌.. వంటి విభిన్న డిజైనింగ్‌ స్టైల్స్‌తో ఈ లెహెంగాకు వన్నెలద్దారు డిజైనర్లు. ఇక భారీ జర్దోసీ బోర్డర్‌తో రూపొందించిన ఎరుపు రంగు దుపట్టా ఆమె లుక్‌నే హైలైట్‌ చేసిందని చెప్పచ్చు. ఇలా తన అటైర్‌కు జతగా భారీ డైమండ్‌ జ్యుయలరీతో రాయల్‌గా మెరిసిపోయిందీ ముంబయి బ్యూటీ.


చీరలో చక్కనమ్మలా..!

ఉన్నట్లుండి తన పెళ్లి ఫొటోలను పంచుకొని తన ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది నటి పూర్ణ (షామ్నా ఖాసిమ్‌). తన ఇష్టసఖుడు, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్‌ అసిఫ్‌ను వివాహమాడిన ఆమె.. తన పెళ్లిలో తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోయింది. ఆరెంజ్‌ కలర్‌ కాంజీవరం చీరను ధరించిన ఆమె.. దానికి పూర్తి కాంట్రాస్ట్‌గా ఉండేలా ఆకుపచ్చ రంగు భారీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను ధరించింది. ఇక ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ దుపట్టాతో తన వెడ్డింగ్‌ అటైర్‌ను పూర్తిచేసిన పూర్ణ.. ఆభరణాల విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా హెవీ జ్యుయలరీని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. ఇలా తన అటైర్‌ను మరింత హైలైట్‌ చేసేలా కాస్త హెవీ మేకప్‌తో తన లుక్‌ని పూర్తిచేసిందీ కుందనపు బొమ్మ.


‘షరారా’తో అదుర్స్‌!

పదేళ్ల ప్రేమను ఈ ఏడాది పరిణయంగా మార్చుకున్నారు బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ రిచా చద్దా-అలీ ఫజల్‌. నిజానికి రెండేళ్ల క్రితమే రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్న వీరిద్దరూ.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో హల్దీ, సంగీత్‌, మెహెందీ.. వంటి ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో సంప్రదాయబద్ధంగా మెరిసిపోయిన ఈ జంట.. పెళ్లిలోనూ తమ అటైర్స్‌తో మెరుపులు మెరిపించింది. పెళ్లి కోసం ఐవరీ రంగు షరారా సెట్‌ని ఎంచుకుంది రిచా. దీనిపై చేత్తో రూపొందించిన ఎంబ్రాయిడరీ వర్క్‌ డ్రస్‌కి మరింత అందాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చాయి. ఇక తన అవుట్‌ఫిట్‌కి జతగా భారీ జ్యుయలరీని జతచేసి తన అందానికి హంగులద్దిందీ బాలీవుడ్‌ బేబ్‌.


ఏరి కోరి ఎంచుకొని..!

అటు తమ వ్యక్తిగత అభిరుచులతో పాటు ఇటు సంప్రదాయాలకూ సమ ప్రాధాన్యమిస్తూ పెళ్లి దుస్తుల్ని డిజైన్‌ చేయించుకుంటారు కొందరు. అందాల నటి నయనతార కూడా అదే చేసింది. తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో జూన్‌లో ఏడడుగులు నడిచిన ఈ చిన్నది.. తన పెళ్లి కోసం సంప్రదాయబద్ధమైన ఎరుపు రంగు చీరను ఎంచుకుంది. దీనిపై దేవాలయాల రూపాల్ని ఎంబ్రాయిడరీగా రూపొందించారు డిజైనర్లు మోనికా, కరిష్మా. ఇక దీనికి జతగా ఫుల్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ను ఎంచుకున్న నయన్‌.. దానిపైనా వంకీల రూపంలో లక్ష్మీ దేవి రూపాన్ని మోటివ్స్‌గా డిజైన్‌ చేయించుకుంది. ఇక చీరపై ఇద్దరి పేర్లను, ఏడడుగుల్లోని అంతరార్థాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకొని.. అటు ట్రెడిషనల్‌గా, ఇటు మోడ్రన్‌ బ్రైడ్‌గా మెరిసిపోయిందీ అందాల తార. ఇక తన అటైర్‌కు కాంట్రాస్ట్‌గా ఉండేలా పచ్చలతో రూపొందించిన ప్రత్యేక ఆభరణాల్ని ధరించి ఆకట్టుకుంది నయన్‌.


ఆలియా ‘ఐవరీ’ మెరుపులు!

తన ఇష్టసఖుడు రణ్‌బీర్‌ కపూర్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏడడుగులు వేసింది అందాల తార ఆలియా భట్‌. ప్రతి సందర్భంలోనూ తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లిలోనూ ఇదే సీన్‌ని రిపీట్‌ చేసింది. ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి రూపొందించిన ఐవరీ రంగు చీరను ఎంచుకున్న ఆలియా.. అదే రంగు టిష్యూ వెయిల్‌తో పెళ్లికూతురిగా ముస్తాబైంది. ఇలా తన అటైర్‌కు జతగా తాను ధరించిన బంగారు, వజ్రాభరణాలు తనను మరింత రాయల్‌గా కనిపించేలా చేశాయని చెప్పచ్చు. ఇలా తన డ్రస్సింగ్‌తోనూ కాదు.. తక్కువ మేకప్‌తో న్యాచురల్‌గానూ ఆకట్టుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ.

వీరితో పాటు నిక్కీ గల్రానీ, మౌనీ రాయ్‌, షిబానీ దండేకర్‌, కరిష్మా తానా.. వంటి ముద్దుగుమ్మలు కూడా తమ విభిన్న బ్రైడల్‌ అటైర్స్‌తో మెరుపులు మెరిపించారు.. ఫ్యాషన్‌ ప్రియుల్ని ఆకట్టుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని