Published : 28/01/2023 20:42 IST

అందుకే పెరట్లో ఈ ఔషధ మొక్కలు ఉండాల్సిందే..!

జలుబు, దగ్గు.. వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా పదే పదే మాత్రలు వాడడం చాలామందికి అలవాటు. అయితే దానివల్ల క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశముంది. అందుకే వాటికి బదులుగా ఔషధ గుణాలున్న కొన్ని మొక్కల్ని పెరట్లో పెంచుకొని ఉపయోగిస్తే సరి.

కొత్తిమీర

కొత్తిమీర మహిళల్లో రక్తహీనత, నెలసరి సమస్యలు ఎదురవకుండా చూస్తుంది. ఆర్థ్రైటిస్‌ బారిన పడకుండా కాపాడుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గించి ఊబకాయం సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ‘ఎ’, ‘సి’ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అలాగే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది నివారిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలున్న కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగిస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా!

తులసి

తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తులసి మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. ఫలితంగా మన చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుతుంది. ఇక దీనిలోని యాంటీఫంగల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీబయోటిక్‌ గుణాలు.. శ్వాస, చర్మ సంబంధిత అలర్జీలు మన దరి చేరకుండా కాపాడతాయి. ఈ మొక్క ఆరోగ్యపరంగానే కాదు.. అందాన్ని కాపాడటంలోనూ మనకు తోడ్పడుతుంది. అందుకే ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్నీ సంరక్షించుకోవచ్చు.

లావెండర్

అద్భుతమైన సువాసన వెదజల్లే లావెండర్‌లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసుని ఉల్లాసంగా మారుస్తాయి. లావెండర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. ఇవి కాలిన గాయాలను మాన్పుతాయి.

నిమ్మగడ్డి

నిమ్మగడ్డిని, దాన్నుంచి తయారయ్యే నూనెని ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలో కడుపునొప్పి, అధిక రక్తపోటు, ఫిట్స్‌, దగ్గు, వాంతులు, కీళ్లనొప్పులు, జ్వరం, జలుబు.. వంటి సమస్యల్ని తగ్గించే లక్షణాలున్నాయి. నిమ్మగడ్డి కొన్ని రకాల హానికారక క్రిములను నాశనం చేస్తుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాల్లో రుచి కోసం కూడా నిమ్మగడ్డిని ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్‌ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. దీంతో తయారుచేసే లెమన్‌గ్రాస్‌ టీ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని