ఆకుకూరలు పెంచుకోవడం సులువే!

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, ఈ కాలంలో వాటిని బయట కొని తినాలంటే భయం. మరేం చేయాలి అనుకోకుండా ఇంట్లోనే వాటిని పెంచేయండి. ఇందుకోసం పెద్దగా స్థలమూ అక్కర్లేదు.

Published : 13 Jun 2024 02:55 IST

ఇంటి తోట

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, ఈ కాలంలో వాటిని బయట కొని తినాలంటే భయం. మరేం చేయాలి అనుకోకుండా ఇంట్లోనే వాటిని పెంచేయండి. ఇందుకోసం పెద్దగా స్థలమూ అక్కర్లేదు. ఎంచక్కా వంటగది, బాల్కనీల్లో కుండీలు, ట్రేలు, టబ్‌లు...ఇలా వేటిలోనైనా నాటేయొచ్చు. ఇవి తక్కువ సమయంలోనే కోతకొచ్చేస్తాయి కూడా. మరి ఏమేం పెంచుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!

తోటకూర, బచ్చలికూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా... ఇలా చాలా ఆకుకూరలే మనకి తెలుసు. వీటిల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని విత్తనాలు చల్లేయండి. సంరక్షణకోసం కాస్త సమయం కేటాయిస్తే చాలు. 4, 5 వారాల్లో వంటల్లో వాడుకునేందుకు సిద్ధమైపోతాయి. మార్కెట్‌ ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మనకు నచ్చిన వంటకాలూ వండేసుకోవచ్చు.

నాణ్యమైన విత్తనాల ఎంపిక...

ఆకుకూరల పెంపకానికి కచ్చితంగా నాణ్యమైన రకాల్ని వాడుకోవాలి. దనియాలు బాగా నలిచి బద్దలుగా పగిలిన తర్వాత రోజంతా నానబెట్టి చల్లితే చప్పున మొలుస్తాయి. దీని లోపల చిన్న సైజులో విత్తనం ఉండడమే ఇందుకు కారణం. తోటకూర వంటి విత్తనాలు గసగసాల మాదిరిగా చాలా చిన్నగా ఉంటాయి. ఒక్కో ఆకుకూర విత్తనం ఒక్కోలా ఉంటుంది.

వీటిని ఒక రోజంతా నీటిలో నానబెట్టి నాటితే త్వరగా మొలకలు వస్తాయి. నాటుకునే మట్టిలో పశువుల ఎరువుతో పాటు కంపోస్ట్, కొద్దిగా ఇసుక కలిపి కుండీల్లో నింపాలి. ప్రతి పదిహేను రోజులకోసారి ఎన్‌పీకే సమగ్ర సేంద్రియ ఎరువుని అందిస్తే ఏపుగా పెరుగుతాయి. ఆకుకూరలకి ఎండ బొత్తిగా తగలకపోతే పెరుగుదల మందగిస్తుంది. వీటికి నీళ్లు రోజూ పోయాలి.

కుండీల్లోని అదనపు నీరు బయటికి వచ్చే దారిని ఏర్పాటు చేయాలి. లేదంటే తడి ఎక్కువై మొక్కలు కుళ్లిపోవడంతోపాటు చీడపీడలూ పట్టేస్తాయి. వీటిని నివారించడానికి 15 రోజులకోసారి పంచగవ్య, వేప నూనె వంటి వాటిని నీళ్లల్లో కలిపి పిచికారీ చేస్తే సమస్య దూరమవుతుంది. ఏ రెమ్మ మీద అయినా పురుగు, తెగులు కనిపించినా దాన్ని తుంచి దూరంగా పారేస్తే నిగనిగలాడే పచ్చటి ఆకుకూరలు వస్తాయి. దీంతో రసాయనాలు వాడని ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని మీరు సులువుగా తీసుకోవచ్చు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్