నేను జాబ్‌లో ఎదగడం అతనికి నచ్చడం లేదు..!
నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. 8 ఏళ్లుగా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను. ఉద్యోగపరంగా ముందుకు వెళుతూ సంతోషంగా ఉన్నాను. అయితే నా భర్తకు నేను జాబ్‌లో ఎదగడం అస్సలు నచ్చడం లేదు. ఎప్పుడూ నా ఉద్యోగాన్ని తిడుతూ....
నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. 8 ఏళ్లుగా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను. ఉద్యోగపరంగా ముందుకు వెళుతూ సంతోషంగా ఉన్నాను. అయితే నా భర్తకు నేను జాబ్‌లో ఎదగడం అస్సలు నచ్చడం లేదు. ఎప్పుడూ నా ఉద్యోగాన్ని తిడుతూ విమర్శిస్తుంటారు. నేను ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాల్సి వచ్చినా, ఊళ్లు వెళ్లాల్సి వచ్చినా బాగా కోపం చూపిస్తున్నారు. నా జాబ్ గురించి నేను ఎవరితోనైనా చర్చించినా ఆయనకు నచ్చదు. ఆయన వల్ల మానసికంగా బాధపడుతున్నాను. తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీరు చదువుకుని నచ్చిన ఉద్యోగం చేస్తున్నారు. మీ కాళ్ల పైన మీరు నిలబడుతున్నారు. అది మీ హక్కు కూడా. ఇందులో ఎలాంటి తప్పూ లేదు. అలాగే మీరు ఉద్యోగం గురించి ఎలాంటి సమస్యలను ప్రస్తావించలేదు. అయినప్పటికీ మీరు చేస్తున్న ఉద్యోగం గురించి మీ భర్త ఎందుకు సంతోషంగా లేరో.. ఎందుకు విమర్శిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక మహిళగా మీరు బయటకు వెళ్లి స్వేచ్ఛగా ఉద్యోగం చేస్తూ, స్వతంత్రంగా బతకడం ఆయనకు నచ్చడం లేదా? ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లి ఇతరులతో సోషల్‌గా ఇంటరాక్ట్ అవ్వడం నచ్చడం లేదా? లేదంటే వేరే మగవారితో మాట్లాడడం వల్ల ఆయనకు మీ పైన ఏదైనా అనుమానం కలుగుతోందా..? వంటి విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఆయన్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీ ఉద్యోగం గురించి ఆయన ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆయన చెప్పే కారణాలు సహేతుకంగా ఉండి.. మీరు మార్చుకోవాల్సిన అంశాలేవైనా ఉన్నాయేమో కూడా పరిశీలించండి. అలాకాకుండా అసలు ఆయన ఆలోచనా విధానంలోనే సమస్య ఉన్నట్లయితే మానసిక వైద్య నిపుణులు దానికి తగిన పరిష్కారాన్ని సూచిస్తారు. కాబట్టి, ధైర్యంగా ఉండండి. మీ సమస్య తప్పకుండా పరిష్కారమవుతుంది. అంతేతప్ప ఈ ఒత్తిడితో తొందరపడి ఉద్యోగం మానేసే ప్రయత్నం మాత్రం చేయద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.