Guinness World Record: ఈ తల్లి గోళ్ల వెనకున్న కన్నీటి గాథ విన్నారా?

అందం కోసమో, ఫ్యాషన్‌ అనో గోళ్లు పొడవుగా పెంచుకునే వాళ్లను చూస్తుంటాం.. మరికొందరైతే రికార్డుల మీద రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా వీటిని బారుగా పెంచుతుంటారు. అయితే తాను గోళ్లు పెంచడానికి ఈ రెండూ కారణం కాదంటోంది అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన.....

Published : 06 Aug 2022 19:44 IST

అందం కోసమో, ఫ్యాషన్‌ అనో గోళ్లు పొడవుగా పెంచుకునే వాళ్లను చూస్తుంటాం.. మరికొందరైతే రికార్డుల మీద రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా వీటిని బారుగా పెంచుతుంటారు. అయితే తాను గోళ్లు పెంచడానికి ఈ రెండూ కారణం కాదంటోంది అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్‌. అయినా ‘ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతివేళ్ల గోళ్లు కలిగిన మహిళ’గా ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించింది. తన రెండు చేతుల వేళ్ల గోళ్ల పొడవు మొత్తం కలుపుకొంటే దాదాపు నాలుగంతస్తుల భవనంతో సమానమాట. మరి, అటు అందం కోసం కాకుండా, ఇటు రికార్డుల కోసం కాకుండా.. డయానా ఇంత పొడవుగా గోళ్లు ఎందుకు పెంచుతున్నట్లు?! దీని వెనకున్న అసలు కారణం తెలిస్తే మీ కళ్లూ చెమర్చక మానవు!

తల్లీకూతుళ్ల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే! ముఖ్యంగా చిన్నప్పుడు కూతురిని అందంగా రడీ చేయాలని తల్లి, పెద్దయ్యాక తల్లిని అలంకరించడంలో కూతురు పడే తాపత్రయంలోనే వాళ్ల ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. డయానాకు, తన కూతురు లతీషాకు ఉన్న అనుబంధం కూడా ఇలాంటిదే! తల్లి గోళ్లు కత్తిరించడం, ట్రిమ్‌ చేయడం, నెయిల్‌ పాలిష్‌ వేయడం, మ్యానిక్యూర్‌.. ఇలా గోళ్ల పోషణ మొత్తం లతీషాదే!

గోళ్లు కత్తిరించడం అదే ఆఖరు!

అయితే ఇలా ప్రాణానికి ప్రాణమైన తన కూతురు ఓ రోజు అనుకోకుండా డయానాకు శాశ్వతంగా దూరమైపోయింది. ఆస్తమా సమస్యతో రాత్రికి రాత్రి నిద్రలోనే తనువు చాలించింది. అయితే ఆ ముందు రోజు రాత్రి తన కూతురు ఆఖరిసారిగా తన గోళ్లు కత్తిరించిందని, తన జ్ఞాపకార్థమే అప్పట్నుంచి ఇప్పటిదాకా గోళ్లు కత్తిరించకుండా పెంచుతున్నానని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది డయానా.

‘అప్పుడు నేను స్టోర్‌లో షాపింగ్‌ చేస్తున్నా. నా చిన్న కూతురు ఫోన్‌ చేసి.. ‘అమ్మా, లతీషా అక్క నిద్రలో నుంచి లేవట్లేదు..’ అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. గబగబా ఇంటికెళ్లి చూసేసరికి తను మాకు శాశ్వతంగా దూరమైందన్న చేదు నిజం తెలిసింది. ఆస్తమా సమస్యతో నిద్రలోనే మరణించిందని తెలుసుకొని కన్నీరు మున్నీరుగా విలపించాం. ఆ రోజు నా జీవితంలోనే అత్యంత విషాదకరం! లతీషానే నా గోళ్ల పోషణ చూసుకునేది. గోళ్లు కత్తిరించడం దగ్గర్నుంచి.. పాలిష్‌ వేయడం దాకా.. ఎంతో శ్రద్ధగా చేసేది. తాను చనిపోయే ముందు రోజు రాత్రి కూడా తను నా గోళ్లు కత్తిరించింది. ఆ రాత్రి మేమిద్దరం ఎంతో సరదాగా గడిపాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం. కానీ తెల్లవారే సరికి ఇలా జరగడం తట్టుకోలేకపోయా.. పదేళ్లు డిప్రెషన్‌లోనే ఉండిపోయా.. ఆ రాత్రి నా కూతురు గోళ్లు కత్తిరించడం అదే ఆఖరుసారి..’ అంటూ తన గోళ్ల వెనకున్న కన్నీటి గాథను పంచుకుంది డయానా.

పిల్లలు చెప్పినా వినలేదు!

లతీషా తన 16వ ఏట కన్ను మూసిన నాటి నుంచే గోళ్లు కత్తిరించడం మానేసింది డయానా. తన కూతురు జ్ఞాపకార్థం పాతికేళ్లుగా వాటిని పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో తన పిల్లలు కత్తిరించుకోమని చెప్పినా వినిపించుకోలేదంటోంది. ‘సుమారు పాతికేళ్లుగా నా చేతి వేళ్ల గోళ్లను పెంచుతున్నా. అప్పుడప్పుడూ నా పిల్లలు ‘అమ్మా.. గోళ్లు కత్తిరించుకో.. లేదంటే ఏ పని చేయడానికైనా ఇబ్బందవుతుంది..’ అని చెప్పేవారు. అప్పుడు నేను కోపంతో ‘మీ పని మీరు చూసుకోండి’ అని కసురుకునేదాన్ని. నిజానికి నేనెందుకు గోళ్లు కత్తిరించుకోవట్లేదో వాళ్లకు తెలియదు. అందుకే ఓ రోజు దీని వెనకున్న కారణం చెప్పా.. అప్పట్నుంచి వాళ్లు ఈ విషయంలో నన్ను కదపట్లేదు. ఇక ఇంత పొడవాటి గోళ్లతో పనులెలా? అని చాలామంది అడుగుతుంటారు. ఒక్క వంట తప్ప ఏ పనైనా చేయగలుగుతున్నా. చేత్తో కష్టంగా అనిపిస్తే కాళ్లతో ఆయా పనులు చేయడం అలవాటు చేసుకున్నా. కారు నడపడం అంటే నాకిష్టం. పొడవాటి గోళ్ల వల్ల అది సాధ్యపడలేదు. అందుకే దాన్నీ వదులుకున్నా. ఇక నాలుగైదేళ్లకోసారి గోళ్లకు నెయిల్‌ పాలిష్‌ వేయించుకుంటా. మొత్తం గోళ్లు పాలిష్‌ చేయాలంటే 15-20 బాటిళ్ల నెయిల్‌ పాలిష్‌ అవసరమవుతుంది. ఇందుకు నాలుగు రోజుల సమయమూ పడుతుంది..’ అంటూ నవ్వేస్తోంది డయానా.

నా కూతురు ఎక్కడున్నా గర్వపడుతుంది!

కోట్లు కుమ్మరించినా తన గోళ్లు కత్తిరించుకోనని తేల్చి చెబుతోంది డయానా. పాతికేళ్లుగా వాటిని పెంచుతోన్న ఆమె ఒక్కో గోరు పొడవు నాలుగడుగులకు పైమాటే! ఇలా ఆమె పది వేళ్లకున్న గోళ్ల మొత్తం పొడవు కలిపితే.. 42 అడుగుల 10.4 అంగుళాలున్నట్లు తేలింది. అంటే సుమారు నాలుగంతస్తుల భవంతి కంటే ఎక్కువే అన్నమాట! ఇందులోనూ కుడిచేతి బొటన వేలి గోరు ఎక్కువ పొడవుగా (4 అడుగుల 6.7 అంగుళాలు), ఎడమచేతి చిటికెన వేలి గోరు తక్కువ పొడవుగా (3 అడుగుల 7 అంగుళాలు) ఉన్నాయి. అయితే రికార్డు కోసం కావాలని పెంచకపోయినా డయానా గోళ్లు ఇటీవలే గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాయి. ‘ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతివేళ్ల గోళ్లు కలిగిన మహిళ’గా అరుదైన రికార్డు సృష్టించింది డయానా. అంతేకాదు.. ప్రస్తుతానికి ఈ రికార్డు తన పేరిటే ఉండనుంది కూడా! ఎందుకంటే.. ఇదివరకు ఈ రికార్డు సాధించిన లీ రెడ్‌మండ్‌ (28 అడుగుల 4 అంగుళాలు) 2009లో ఓ ప్రమాదం కారణంగా తన గోళ్లను పోగొట్టుకుంది.

‘నా గోళ్లంటే నాకు చాలా ఇష్టం. వీటిలోనే నా కూతురిని చూసుకుంటున్నా. గోళ్లు పెంచుతుంటే నా కూతురు నాతోనే ఉన్నట్లుగా.. తననే పెంచి పెద్ద చేస్తున్నట్లుగా అనుభూతి కలుగుతోంది. నాకొచ్చిన ఈ అరుదైన రికార్డు చూసి నా చిట్టితల్లి ఎక్కడున్నా సంతోషిస్తుంది.. గర్వపడుతుంది..’ అంటూ మురిసిపోతోందీ రికార్డ్‌ మామ్.

రికార్డు సంగతి ఎలా ఉన్నా.. డయానా గోళ్ల వెనకున్న విషాద గాథ తెలుసుకొని చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు. బిడ్డ కోసం తల్లి పడుతోన్న ఆరాటానికి జోహార్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్