వారమంతా ఉద్యోగం.. వారాంతాల్లో వ్యాపారం!

ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మనకంటూ కొన్ని అభిరుచులుంటాయి. వాటిని నెరవేర్చుకోవాలని ఉన్నా.. వృత్తిఉద్యోగాల వల్ల వాటి కోసం కేటాయించేందుకు సమయమే దొరకదు. అందుకే వారాంతాల్లో తన ప్రవృత్తిపై దృష్టి పెడుతోంది గుజరాతీ అమ్మాయి ధృవి పంచాల్‌.

Published : 22 Sep 2023 12:09 IST

(Photos: Screengrab)

ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మనకంటూ కొన్ని అభిరుచులుంటాయి. వాటిని నెరవేర్చుకోవాలని ఉన్నా.. వృత్తిఉద్యోగాల వల్ల వాటి కోసం కేటాయించేందుకు సమయమే దొరకదు. అందుకే వారాంతాల్లో తన ప్రవృత్తిపై దృష్టి పెడుతోంది గుజరాతీ అమ్మాయి ధృవి పంచాల్‌. ఫార్మసీ ఉద్యోగి అయిన ఆమెకు వంట చేయడమంటే చాలా ఇష్టం. తన చేతి వంటకాలు నలుగురికీ వడ్డించడంలోనే సంతృప్తి ఉందంటోన్న ధృవి.. ఈ ఆలోచనతోనే పాస్తా చెఫ్‌గా అవతారమెత్తిందామె. వారమంతా ఉద్యోగంలో బిజీగా ఉండే ఆమె.. శని, ఆది వారాల్లో తన తపనను నెరవేర్చుకుంటూ బోలెడంత సంతృప్తిని పొందుతున్నానంటోంది. ఇలా ఆమె స్టోరీని ఇటీవలే ఓ ఫుడ్‌ బ్లాగర్‌ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.

ధృవిది అహ్మదాబాద్‌. బీఫార్మసీ పూర్తిచేసిన ఆమె.. ఓ ఫార్మసీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే ధృవి ఓ ఫుడ్‌ లవర్‌. నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదించడమే కాదు.. కొత్త వంటకాలు, అందులోనూ పాస్తాతో రుచికరమైన వంటకాలు తయారుచేయడంలో దిట్ట. ఇలా తనలో ఉన్న ఈ నైపుణ్యాలతోనే ఓ చిన్న పాస్తా స్టాల్‌ ప్రారంభించాలనుకుందామె.

ఫుడ్‌ బిజినెస్‌లోకి రావాలని..!

అయితే వారమంతా ఉద్యోగంతోనే సరిపోయేది ధృవికి! దీంతో తన అభిరుచిని ఇన్నాళ్లూ వాయిదా వేస్తూ వచ్చిందామె. అలాగని ఫుడ్‌ బిజినెస్‌లోకి రావడానికి ఉద్యోగం వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు.. పైగా తన మనసులోని కోరిక తన తల్లిదండ్రులతో చెప్తే ఏమంటారోనన్న సందిగ్ధం మరోవైపు! ‘అమ్మ గృహిణి.. నాన్న ఓ సంస్థలో పనిచేస్తున్నారు. ఫుడ్‌ స్టాల్‌ తెరుస్తానంటే అమ్మానాన్నలు ఏమంటారోనన్న సందిగ్ధంలో కొన్నాళ్లు నా అభిరుచిని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ వంట చేయడంపై నాకున్న మక్కువ, పాకశాస్త్రంలో నా నైపుణ్యాల్ని గుర్తించిన వారు.. నా మనసులోని కోరికను తెలుసుకొని ఫుడ్‌ స్టాల్‌ ప్రారంభించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో అటు ఉద్యోగం చేస్తూనే, ఇటు వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. ఈ రెండింటినీ సమన్వయం చేయాలంటే నా అభిరుచిపై దృష్టి పెట్టేందుకు వారాంతాలే సరైనవి అనిపించింది. అందుకే శని, ఆది వారాల్లో పాస్తా స్టాల్‌ నడుపుతున్నా..’ అంటోంది ధృవి.

ఆ సంతృప్తి చాలు!

యువత సంచారం ఎక్కువగా ఉండే అహ్మదాబాద్‌ యూనివర్సిటీకి సమీపంలోని ‘CEPT Khau Street’ అనే ప్రదేశాన్ని తన పాస్తా స్టాల్‌ ఏర్పాటుచేయడానికి ఎంచుకుంది ధృవి. ‘రోజూ సాయంత్రం అయ్యిందంటే ఇక్కడ పదుల సంఖ్యలో ఫుడ్‌ స్టాల్స్‌ కొలువుదీరుతాయి.. తమకు నచ్చిన రుచుల్ని/వంటకాల్ని ఆస్వాదించేందుకు యువత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు. అందుకే ఇదే ప్రదేశంలో నా పాస్తా స్టాల్‌ని ఏర్పాటుచేశా. నా మినీ స్టాల్‌కు ‘మ్యాక్‌ అండ్‌ చీజ్‌’ అనే పేరు కూడా పెట్టా. ప్రస్తుతం పాస్తాతో విభిన్న వంటకాల్ని తయారుచేసి అందిస్తున్నా. వంటకాలు తయారుచేసే క్రమంలో గ్లౌజులు ధరించి.. పూర్తి పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తున్నా. ఇలా నా చేతి వంటకాల్ని నలుగురికీ వడ్డించడం, వారి నుంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ రావడం నాకెంతో సంతృప్తినిస్తోంది. ప్రతి శనివారం సాయంత్రం స్టాల్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకొని ఇక్కడికి చేరుకుంటా.. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా స్టాల్‌ నడుపుతున్నా. ఆదివారం కూడా ఇదే సమయంలో స్టాల్‌ నిర్వహిస్తున్నా..’ అంటోన్న ధృవి.. ఇలా ప్రేమతో వండి వార్చడంలోనే అసలైన సంతృప్తి దాగుందంటోంది. భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నానంటోందామె.

అయితే ఇలా ఓవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఖాళీ సమయాల్లో వ్యాపారంపై దృష్టి పెడుతోన్న ధృవి కథను ఇటీవలే ఓ ఫుడ్‌ బ్లాగర్‌ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ‘వృత్తిప్రవృత్తుల్లో దేన్నీ వదులుకోకుండా.. రెండింటినీ సమన్వయం చేస్తోన్న ధృవి ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!’ అంటూ చాలామంది స్పందిస్తున్నారు. నిజమే కదా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని