Published : 23/12/2021 20:30 IST

ఏం చేస్తాడోనని ఆటోలోంచి దూకేశా.. అందుకే అప్రమత్తంగా ఉండండి!

(Photo: Twitter)

అర్ధరాత్రి దాకా ఎందుకు.. పట్టపగలు, మిట్టమధ్యాహ్నం, అదీ రద్దీగా ఉండే ప్రదేశంలోనూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఇందుకు తాజా ఉదాహరణే గురుగ్రామ్‌కు చెందిన నిష్తా పలివాల్‌కు ఎదురైన ఓ చేదు అనుభవం. ఇటీవలే ఓ ఆటో ప్రయాణంలో తనకెదురైన భయంకరమైన ఘటనను వరుస ట్వీట్ల రూపంలో పంచుకుందామె. ఈ క్రమంలో అపాయానికి చిక్కకుండా ఆపద నుంచి తాను బయటపడిన తీరును వివరిస్తూ.. రక్షణ విషయంలో అమ్మాయిలందరికీ ఓ హెచ్చరికను జారీ చేసింది. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని తన అనుభవంతో చెప్పకనే చెప్పిందీ యువతి. మరి, ఇంతకీ నిష్తా ఎదుర్కొన్న ఆ చేదు సంఘటనేంటి? ఈ క్రమంలో తనేం చెప్పాలనుకుంది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

గురుగ్రామ్‌కు చెందిన నిష్తా పలివాల్‌ కమ్యూనికేషన్స్‌ స్పెషలిస్ట్‌. ఇటీవలే ఓ పని మీద బయటికి వెళ్లిన ఆమెకు ఆటో డ్రైవర్‌ రూపంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. అయితే దాన్నుంచి ఎలాగోలా బయటపడ్డ ఆమె.. ఆ ఘటనను వరుస ట్వీట్ల రూపంలో పంచుకుంటూ అమ్మాయిలందరినీ అలర్ట్‌ చేసింది.

కుడికి వెళ్లాలంటే ఎడమకు తిప్పాడు!

‘ఇటీవల నాకెదురైన ఓ చేదు సంఘటనను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అది తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతోంది.. రోమాలు నిక్కపొడుస్తున్నాయి. డిసెంబర్‌ 19న పని మీద సెక్టర్‌ 22కి వెళ్లిన నేను.. పని పూర్తి కాగానే అక్కడ రద్దీగా ఉండే మార్కెట్‌లోని ఆటో స్టాండ్‌కి వెళ్లి ఆటో మాట్లాడుకున్నా. అక్కడికి మా ఇంటికి 7 నిమిషాల దూరం ఉంటుంది. అయితే నా దగ్గర డబ్బు లేకపోయేసరికి.. పేటీఎం చేస్తానని చెప్పా. అందుకు డ్రైవర్‌ ఒప్పుకోవడంతో ఆటో ఎక్కా. అతడు మంద్ర స్థాయిలో భక్తి పాటలు పెట్టుకొని ఆటో తోలుతున్నాడు. అంతలోనే మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకున్నాం. నిజానికి మా ఇంటికి (సెక్టర్‌ 1) వెళ్లాలంటే కుడి వైపు వెళ్లాలి. కానీ ఆటో డ్రైవర్‌ ఎడమ వైపుకి తిప్పాడు. అదేంటని అడిగితే పట్టించుకోలేదు.. పైగా నామీదే అరవడం మొదలుపెట్టాడు. నేనూ వెనక్కి తగ్గలేదు.. అతడి భుజంపై చరుస్తూ వెనక్కి తిప్పమని అరిచా. అయినా ఫలితం లేదు.

ఆటోలోంచి దూకేశా!

ఇదేదో సందేహించాల్సిన విషయమేనని గ్రహించిన నేను.. ఇతనికి దొరికిపోవడం కంటే ఆటోలోంచి దూకితేనైనా చిన్న చిన్న గాయాలతో బయటపడచ్చనిపించింది. అప్పటికి ఆటో వేగం 40ల్లో ఉంది. ఇంకా వేగం పెంచకముందే దూకేయడం బెటర్‌ అనుకొని.. వెంటనే ఆటోలోంచి దూకేశా. నిజానికి ఆ సమయంలో నాకంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. బహుశా.. ఆపదలో ఉన్నప్పుడు ఎలాగోలా బయటపడాలన్న ఆరాటమే ఇలాంటి ధైర్యాన్నిస్తుందేమో అని ఆ తర్వాత అనిపించింది. కుడి మోకాలి కింద నొప్పి తప్ప.. ఆ దేవుడి దయ వల్ల నాకు దెబ్బలేమీ తగల్లేదు.. ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికెళ్లిపోయా.. అయినా అతను వెంబడిస్తున్నాడేమోనన్న భయంతో పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు సాగా.

అప్రమత్తత అవసరం!

ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఆ భయం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ భయంతోనే కనీసం దూకిన తర్వాతైనా ఆటో నంబర్ నోట్‌ చేసుకోవాలన్న ఆలోచన నాకు రాలేదు. నిజానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా బయటపడాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన మనసులోకి రాదనుకోండి. అయితే ఇదంతా నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే.. వివిధ పనుల రీత్యా, వృత్తి ఉద్యోగాల రీత్యా రాత్రింబవళ్లు బయటికి వెళ్తుంటాం. రాత్రనే కాదు.. ఆఖరికి మధ్యాహ్నం కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఇందుకు నా విషయంలో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి మనందరం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడం అవసరం. తద్వారా ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి.. ప్రాణాలను పణంగా పెట్టి కదిలే వాహనాల్లోంచి దూకాల్సిన అవసరం రాదు..’ అంటోంది నిష్తా.

సురక్షితంగా గమ్యం చేరడానికి..!

ఈ గురుగ్రామ్‌ అమ్మాయి చెప్పింది అక్షర సత్యం. ఆపద సమయంలో ఆలోచించే సమయం ఉండచ్చు ఉండకపోవచ్చు.. పైగా దాన్నుంచి ఎలా బయటపడాలోనన్న ఆతృత తప్ప.. ఆ సమయంలో సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనలు మన మదిలోకి రావు. అయితే ముప్పును ముందుగానే పసిగట్టి కొన్ని రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే అపాయం నుంచి సురక్షితంగా బయటపడచ్చంటున్నారు నిపుణులు.

* ఆటోలో, బస్సులో, క్యాబ్‌లో.. ఇలా మనం ఎందులో ప్రయాణించినా.. ఆ వాహనం తాలూకు నంబర్లను కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో షేర్‌ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ లైవ్‌ లొకేషన్‌ని అవతలి వారితో షేర్‌ చేసినా.. వారు మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. తద్వారా ప్రమాద సమయంలో త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది.

* ప్రస్తుతం మహిళల రక్షణకు వివిధ రకాల సేఫ్టీ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని.. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆయా ఫీచర్లకు తగినట్లుగా వాటిని వినియోగించుకుంటే సురక్షితంగా గమ్యం చేరుకోవచ్చు.

* పోలీస్‌, అంబులెన్స్‌.. తదితర అత్యవసర నంబర్లు ప్రమాద సమయంలోనూ సడెన్‌గా గుర్తుకు రాకపోవచ్చు. కాబట్టి వాటిని కూడా సాధారణ నంబర్లతో పాటు ‘స్పీడ్‌ డయల్‌’ లిస్టులో సేవ్‌ చేసుకొని పెట్టుకోవచ్చు.

* ఎక్కడికెళ్లినా మన వెంట ఓ హ్యాండ్‌ బ్యాగ్‌ ఉండాల్సిందే! అయితే అందులో బరువనుకోకుండా.. పెప్పర్‌ స్ప్రే బాటిల్‌, చిన్న నైఫు, విజిల్‌, షార్ప్‌గా ఉండే పెన్ను/పెన్సిల్‌.. వంటివి ఉంచుకోవాలి. తద్వారా ప్రమాద సమయంలో అవతలి వారిపై త్వరగా దాడి చేసి అక్కడ్నుంచి తప్పించుకోవచ్చు.

* ఆత్మరక్షణ విద్యలకు మించిన ఆయుధం మరొకటి లేదని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికీ మించిపోయింది లేదు.. కాబట్టి అమ్మాయిలంతా కరాటే, కిక్‌ బాక్సింగ్‌, కుంగ్‌ఫూ.. వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకొని ఉండడం మంచిది. తద్వారా దాడికి ప్రతిదాడి చేసే నేర్పు మనకు అలవడుతుంది.

* రోడ్డుపై నడుస్తున్నా మొబైల్‌ చేతిలో ఉంచుకోవడం ద్వారా త్వరగా స్పందించచ్చంటున్నారు నిపుణులు. అయితే అందులో పాటలు వినడం, ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లడం వంటివి చేయకూడదు.

* క్యాబ్/ఆటో బుక్‌ చేసుకున్న తర్వాత కూడా లైవ్‌ లొకేషన్‌ని కుటుంబ సభ్యులకు షేర్‌ చేయడం మర్చిపోవద్దు.

* రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఎవరైనా వెంబడిస్తున్నా.. పోలీసులకు/కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయడం.. అక్కడే ఆగిపోకుండా వెంటనే దగ్గర్లోని రద్దీ ప్రదేశానికి వెళ్లడం ఉత్తమం.

మరి, మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు సురక్షితంగా గమ్యం చేరుకోవాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలంటారు? మీ అభిప్రాయాలు, సలహాలను Contactus@vasundhara.net ద్వారా పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి