Updated : 02/07/2022 18:45 IST

జుట్టు సంరక్షణలోనూ ఇది కావాల్సిందే..!

వేప వల్ల మన చర్మానికి, జుట్టుకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం తెలిసిందే. అందుకే దీనిని వివిధ సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతుంటారు. ఈ క్రమంలో- ప్రత్యేకించి కేశ సంరక్షణలో ఈ ఉత్పత్తులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం రండి..

పొడవాటి జుట్టుకు..

వేపాకుల పొడిని తరచూ ఉపయోగిస్తూ ఉంటే తలలోని ఇన్ఫెక్షన్లన్నీ దూరమవుతాయి. వేప నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవుగా పెరుగుతుంది. దీంతో పాటు జుట్టు చిట్లిపోవడం కూడా తగ్గుతుంది.

హెయిర్ కండిషనర్

కొన్ని వేపాకులను తగినన్ని నీళ్లలో వేసి మరిగించండి.. దీన్లో తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట ఉంచి తర్వాత కడిగేయండి. ఇది జుట్టుకు కండిషనర్‌గా పనిచేస్తుంది. బిరుసుగా ఉన్న జుట్టును పట్టులా మెత్తగా మారుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది.

బెరడుతోనూ..

వేప బెరడు, వేర్లను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తలకు పట్టించడం వల్ల పేల బాధ తొలగిపోతుంది. దీని వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది.

వేప నూనె..

కొన్ని రకాల సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ వంటి వాటిలో వేప నూనెను ఉపయోగిస్తారు. దీనికి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసే గుణం ఉంటుంది. దీని వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది.

చర్మం పొడిబారుతుంటే..

చర్మం పొడిబారిపోతోందా? వేప ప్యాక్‌ని ప్రయత్నించండి. వెంటనే ఫలితం కనిపిస్తుంది. వేప పొడిలో కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్‌ని కలపండి. దీన్ని మిశ్రమంలా చేసి మొహానికి పట్టించండి. రెండు, మూడు నిమిషాలుంచి చల్లని నీటితో కడిగేయండి. మీ సమస్య పరిష్కారమైపోతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని