ఒత్తైన జుట్టు కోసం ఈ ప్యాక్స్‌ ట్రై చేయండి...

ఒత్త్తెన, పొడవాటి కురులు సొంతం చేసుకోవాలని కోరుకోని అమ్మాయిలుంటారా చెప్పండి?? వాటి కోసమే కదా.. రకరకాల నూనెలు, క్రీమ్‌లు, షాంపూలు, కండిషనర్లు.. మొదలైనవి ఉపయోగించేది. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా కేశసంపదకు కూడా ఎంతో కొంత నష్టం వాటిల్లుతున్న మాట వాస్తవమే.

Published : 04 Nov 2021 12:32 IST

ఒత్త్తెన, పొడవాటి కురులు సొంతం చేసుకోవాలని కోరుకోని అమ్మాయిలుంటారా చెప్పండి?? వాటి కోసమే కదా.. రకరకాల నూనెలు, క్రీమ్‌లు, షాంపూలు, కండిషనర్లు.. మొదలైనవి ఉపయోగించేది. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా కేశసంపదకు కూడా ఎంతో కొంత నష్టం వాటిల్లుతున్న మాట వాస్తవమే. అయితే సహజసిద్ధంగా లభించే కొబ్బరినూనె లేదా కొబ్బరిపాలు.. వంటి కొబ్బరి ఉత్పత్తులను వినియోగించి తయారుచేసిన కొన్ని రకాల మాస్కులను కురులకు వేసుకోవడం ద్వారా కేశాలకు వాటిల్లే నష్టాన్ని తగ్గించడమే కాదు.. ఆరోగ్యమైన, ఒత్త్తెన జుట్టు కూడా సొంతం చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఆ మాస్కులేంటో మనమూ చూసేద్దాం రండి..

కొబ్బరినూనె, తేనె..

స్టౌ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా కొబ్బరినూనె, చెంచా తేనె వేయాలి. తేనె కరిగి కొబ్బరినూనెలో కలిసేంత వరకు వేడి చేసి దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బాగా కలిపి చేతివేళ్లతో కుదుళ్లు మొదలుకొని చివర్ల వరకు కురులకు అప్త్లె చేయాలి. 20 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చి.. ఆపై గోరువెచ్చని నీటితో కేశాలను శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ద్వారా కురులకు సరిపడినంత తేమ అందడం మాత్రమే కాదు.. కుదుళ్లకు పోషణ కూడా అంది దృఢపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గి, ఒత్త్తెన కేశసంపద సొంతం చేసుకోవచ్చు.

అరటి, అవకాడోతో..

బాగా పండిన అరటిపండు తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో మెత్తగా చేసుకున్న అవకాడో, చెంచా కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పట్టించి కాసేపు మృదువుగా మర్దన చేయాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.

విటమిన్ ఇ, కొబ్బరినూనె..

ఎన్ని చిట్కాలు పాటించినా కొందరి జుట్టు పొడిబారినట్లు, నిర్జీవంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు కొద్దిగా కొబ్బరినూనె తీసుకొని అందులో విటమిన్ ఇ క్యాప్స్యూల్‌లోని నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడిచేసి కురులకు అప్త్లె చేసుకోవాలి. మృదువుగా మర్దన చేసుకొని 30 నుంచి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే సరి. పొడిబారిన కేశాలకు విటమిన్ ఇ నూనె తిరిగి జీవం పోస్తుంది. అలాగే కొబ్బరినూనె తగినంత తేమ అందించి కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్ట్రాబెర్రీ, కొబ్బరినూనె..

బాగా పండిన స్ట్రాబెర్రీలు గుప్పెడు తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో తేనె, కొబ్బరినూనె చెంచా చొప్పున వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత కాసేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి: కుదుళ్ల వద్ద అధికంగా ఉన్న నూనెను తొలగిస్తుంది. అలాగే కురుల పీహెచ్ స్థాయులను క్రమబద్ధీకరించి.. అవి ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది.

కొబ్బరినూనె, కొబ్బరిపాలు..

ఒక గిన్నెలో బాగా పండిన అరటిపండు, కొబ్బరినూనె వేసుకొని, మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని విడిగా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరిపాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కురులకు బాగా పట్టించి చేతివేళ్లతో కుదుళ్ల వద్ద మర్దన చేయాలి. 20 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మాస్క్ ద్వారా కురులు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదగడమే కాదు.. మృదువుగా, ప్రకాశవంతంగా కూడా మారతాయి.

ఇవి కూడా..

* కొబ్బరినూనెలో కోడిగుడ్డులోని పచ్చసొన, చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాస్త ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ మాస్క్‌ను కేశాలకు అప్త్లె చేసుకొని కాసేపు ఆరనిచ్చి తలస్నానం చేయడం వల్ల కేశసంపద ఆరోగ్యంగా ఉంటుంది.

* రాత్రి నిద్రపోయే ముందు కురులకు గోరువెచ్చగా వేడిచేసిన కొబ్బరినూనె కొద్దిగా రాసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. మరునాడు ఉదయాన్నే తలస్నానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

* నాలుగు చెంచాల కొబ్బరినూనెలో, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కురులకు అప్త్లె చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల కురులు మృదువుగా మారడంతోపాటు చుండ్రు కూడా తగ్గుముఖం పడుతుంది.

* కలబంద గుజ్జు, కొబ్బరినూనె చెంచా చొప్పున తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కురులు శుభ్రం చేసుకోవాలి.

చూశారుగా.. కొబ్బరినూనె ఉపయోగించి తయారుచేసే వివిధ మాస్కులు.. వాటి ఉపయోగాలు.. మీరు కూడా ఓసారి వీటిని ప్రయత్నించి చూడండి.. ఒత్త్తెన, ఆరోగ్యవంతమైన కేశసంపదను సొంతం చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్