Published : 26/11/2022 19:43 IST

తలస్నానం.. తడి జుట్టు.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

రాత్రి పూట నిద్ర పోయే ముందు తలస్నానం చేస్తున్నారా? జుట్టు తడిగా ఉండగానే నిద్రపోతున్నారా? అయితే  జుట్టు తడిగా ఉన్నప్పుడు అలాగే పడుకోవడం వల్ల సౌందర్యపరంగా పలు సమస్యలు తలెత్తడంతో పాటు ఇటు ఆరోగ్యానికీ హానికరమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

తడి జుట్టుతో పడుకొని కేశ సౌందర్యాన్ని దెబ్బతీయడం కంటే పడుకునే ముందు జుట్టు ఆరబెట్టుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

☞ ప్రత్యేకించి శీతాకాలంలో పగటిపూటే తలస్నానం చేయడం మంచిది. తద్వారా రాత్రి పడుకునే సమయానికి కేశాలు సహజసిద్ధంగా ఆరిపోతాయి. కాబట్టి జుట్టు డ్యామేజ్‌ కాకుండా కాపాడుకోవచ్చు.

☞ తలస్నానం చేశాక కాటన్‌ టీ-షర్ట్‌ లేదంటే కాటన్‌ టవల్‌తో జుట్టును పొడిగా తుడుచుకోవాలి. ఇలా కాటన్‌ వస్త్రాన్ని ఉపయోగిస్తే వెంట్రుకల్లోని తేమ దీనికి త్వరగా ఇంకి జుట్టు ఆరిపోతుంది.

☞ వెంట్రుకలు దృఢత్వాన్ని కోల్పోకూడదంటే తలస్నానం చేశాక కండిషనర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు.

☞ ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పడుకునే ముందే తలస్నానం చేయాల్సి వస్తే సిల్క్‌ దిండు కవర్‌ను ఉపయోగించమంటున్నారు నిపుణులు. తద్వారా దిండుకు, వెంట్రుకలకు మధ్య రాపిడి తక్కువగా జరిగి జుట్టు డ్యామేజ్‌ కాకుండా కొంత వరకు రక్షించుకోవచ్చు.

☞ రాత్రుళ్లు జుట్టు ఆరబెట్టుకునే సమయం లేని వారు తక్కువ వేడితో బ్లో-డ్రయర్స్‌ ఉపయోగించి వెంట్రుకల్ని ఆరబెట్టుకుంటే డ్యామేజ్‌ను తగ్గించచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

☞ తడి జుట్టుకు కొబ్బరి నూనె రక్షణ కవచంలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అందుకే తప్పని పరిస్థితుల్లో తడి జుట్టుతోనే నిద్రపోవాలనుకునే వారు కొన్ని చుక్కల కొబ్బరి నూనెను జుట్టు చివర్లకు రాసుకుంటే సరి!

☞ పడుకునే ముందు తడి జుట్టును విరబోసుకోకపోయినా- జడ వేసుకోవడం, బిగుతుగా ముడేసుకోవడం వంటివి చేసినట్లయితే దానివల్లా వెంట్రుకలు తెగిపోవడం, నిర్జీవమైపోవడం వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు.

☞ దిండు కవర్లను ఎప్పటికప్పుడు మార్చడం వల్ల కూడా వాటిపై చేరిన బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి కుదుళ్లను, ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని