హ్యాండ్‌బ్యాగ్‌ ఇలా ధరిస్తే ముప్పేనట!

గడప దాటుతున్నామంటే మన వెంట ఓ హ్యాండ్‌బ్యాగ్‌ ఉండాల్సిందే! మేకప్‌ సామగ్రి దగ్గర్నుంచి వ్యాలెట్‌, ఫోన్‌, ఛార్జర్‌, పవర్‌ బ్యాంక్‌, హెడ్‌ఫోన్స్‌, పుస్తకాల వరకు.. అన్నీ అందులో నింపేసి దాన్నో చిన్న సైజు లగేజ్‌ బ్యాగ్‌లా....

Published : 02 May 2023 12:27 IST

గడప దాటుతున్నామంటే మన వెంట ఓ హ్యాండ్‌బ్యాగ్‌ ఉండాల్సిందే! మేకప్‌ సామగ్రి దగ్గర్నుంచి వ్యాలెట్‌, ఫోన్‌, ఛార్జర్‌, పవర్‌ బ్యాంక్‌, హెడ్‌ఫోన్స్‌, పుస్తకాల వరకు.. అన్నీ అందులో నింపేసి దాన్నో చిన్న సైజు లగేజ్‌ బ్యాగ్‌లా మార్చేస్తాం. ఇలా బరువైన హ్యాండ్‌బ్యాగ్‌ను భుజానికి వేసుకొని ఎంత దూరమైనా ప్రయాణించేస్తాం. ఈ క్రమంలో కొంతమంది బ్యాగ్‌ లూప్‌ను చిన్నగా ఉండేలా ఎడ్జస్ట్ చేసుకుంటే.. మరికొంతమంది స్లింగ్‌ మాదిరిగా పొడవుగా ఉండేలా జాగ్రత్తపడతారు. ఏదేమైనా.. హ్యాండ్‌బ్యాగ్‌ను ఎక్కువ సమయం పాటు ఒకే వైపు భుజానికి తగిలించుకోవడం వల్ల శరీర భంగిమలో పలు సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. దాంతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలూ తప్పవంటున్నారు. ఇంతకీ ఏంటవి? అలా జరగకూడదంటే హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకుందాం రండి..

ఎలాంటి సమస్యలొస్తాయ్?

అవసరం ఉన్నా, లేకపోయినా.. ముందు జాగ్రత్తగా మనం నిత్యం ఉపయోగించే వస్తువులన్నీ హ్యాండ్‌బ్యాగ్‌లో నింపేస్తుంటారు చాలామంది. దీంతో బ్యాగు బరువు తడిసి మోపెడవుతుంది. ఇక ఇది జారిపోకూడదని బ్యాగ్‌ లూప్‌ తగ్గించేసి భుజానికి దగ్గరగా ఉండేలా ఎడ్జస్ట్ చేసుకుంటారు. మరికొందరు.. పొడవుగా వేలాడదీసుకుంటారు. అయితే హ్యాండ్‌బ్యాగ్‌ ఎలా ధరించినా.. జారిపోకూడదన్న ఉద్దేశంతో.. మనకు తెలికుండానే ఆ భుజం కాస్త పైకి లేచినట్లుగా, మరో భుజం కిందికి వంచినట్లుగా ఆటోమేటిక్‌గా మన శరీర భంగిమ మారిపోతుంది. దీంతో ముందు నుంచి చూస్తే రెండు భుజాలు సమానంగా కాకుండా కాస్త ఏటవాలుగా కనిపిస్తుంటాయి. ఇలా రోజూ ధరించడం వల్ల కొన్నాళ్లకు బ్యాగ్‌ వేసుకోకపోయినా రెండు భుజాలు సమానంగా ఉంచలేం. దీంతో శరీర భంగిమలో తేడాలొస్తాయి. అంతేకాదు.. ఇలాంటి అసమాన శరీర భంగిమ వల్ల మెడనొప్పి, భుజాల్లో నొప్పి, వెన్ను నొప్పి, నడుం నొప్పి.. వంటి ఆరోగ్య సమస్యలు వేధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ఇలా ధరిస్తే మంచిది!

శరీర భంగిమలో తేడాలు, తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల్ని నివారించాలంటే హ్యాండ్‌బ్యాగ్‌ వేసుకునే క్రమంలో కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

హ్యాండ్‌బ్యాగ్‌ను ప్రతిసారీ ఒకే భుజానికి తగిలించుకునే అలవాటుంటుంది చాలామందికి. కానీ ఇలా ఒకేవైపు కాకుండా.. నిర్ణీత వేళల్లో మరో భుజానికి మార్చుతూ.. ఒకే భుజంపై పడే అదనపు భారాన్ని తగ్గించాలి. తద్వారా శరీర భంగిమ, శారీరక నొప్పులు రాకుండా కొంతవరకు నివారించచ్చు.

హ్యాండ్‌బ్యాగ్‌ అంటే ఎప్పుడూ భుజానికే తగిలించుకోనక్కర్లేదు. కొన్నిసార్లు చేతికి తగిలించుకోవడం లేదంటే లగేజ్‌ బ్యాగ్‌లా చేత్తో పట్టుకోవడం.. వంటివి చేసినా ఫలితం ఉంటుంది.

కొంతమంది హ్యాండ్‌బ్యాగ్‌లోనే లంచ్‌బాక్స్‌, వాటర్‌ బాటిల్‌.. వంటివి పెట్టి క్యారీ చేస్తుంటారు. దీనివల్ల ఒకే భుజంపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లంచ్‌బాక్స్‌, బాటిల్‌ వంటివి వేరే బ్యాగ్‌లో పెట్టి.. ఓ భుజానికి హ్యాండ్‌బ్యాగ్‌, మరో భుజానికి లంచ్‌ బ్యాగ్‌ తగిలించుకోవడం మంచిది. అలాగే వీటినీ తరచూ రెండు భుజాలకు మార్చుతుండాలి.

మనం వేసుకునే హ్యాండ్‌బ్యాగ్‌/పర్స్‌ బరువు మన శరీర బరువులో 10 శాతానికి మించకూడదని ఓ అధ్యయనం చెబుతోంది. కాబట్టి అవసరం ఉన్నా, లేకపోయినా వస్తువులన్నీ ఇందులో నింపేసి దీని బరువు తడిసి మోపెడు చేయకుండా.. తక్కువ బరువుండేలా జాగ్రత్తపడడం మంచిది.

హ్యాండ్‌బ్యాగ్‌కు బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. దీనివల్ల భుజాలపై సమానంగా ఒత్తిడి పడి శరీర భంగిమలో తేడాలు రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. అయితే బ్యాక్‌ప్యాక్‌ కూడా ఎక్కువ బరువు లేకుండా తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి. తద్వారా నడుము, వీపుపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

హ్యాండ్‌బ్యాగ్‌ కంటే క్రాస్‌ బాడీ బ్యాగ్‌ (క్రాస్‌గా ధరించేది) కాస్త బెటర్ అంటున్నారు నిపుణులు. అయితే దీనివల్ల మెడలపై ప్రభావం పడచ్చంటున్నారు. కాబట్టి ఈ క్రాస్‌ బాడీ బ్యాగ్‌ను కూడా భుజాలు మార్చుతూ వేసుకోవడం మంచిదంటున్నారు.

వీటితో పాటు ప్లాంక్స్‌, సిటప్స్‌, క్రంచెస్‌, వెనక్కి వంగి చేసే వ్యాయామాలు, యోగా.. వంటివి తరచూ సాధన చేస్తే.. అటు ఫిట్‌గా ఉండచ్చు.. ఇటు చక్కటి శరీర భంగిమనూ మెయింటెయిన్‌ చేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని