Hansika: ఇంజెక్షన్లంటే భయం.. అలాంటిది అవెలా తీసుకోగలను?!

సినీ తారల జీవితం తెరిచిన పుస్తకం. వాళ్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో.. వాళ్లపై పుట్టిన రూమర్స్‌ కూడా అంతే త్వరగా వైరలవుతుంటాయి. టాలీవుడ్‌ బ్యూటీ హన్సికకు సంబంధించిన ఓ వార్త కూడా ప్రస్తుతం....

Updated : 16 May 2023 20:43 IST

(Photos: Instagram)

సినీ తారల జీవితం తెరిచిన పుస్తకం. వాళ్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో.. వాళ్లపై పుట్టిన రూమర్స్‌ కూడా అంతే త్వరగా వైరలవుతుంటాయి. టాలీవుడ్‌ బ్యూటీ హన్సికకు సంబంధించిన ఓ వార్త కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దానిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందించింది. తార్కికంగా సమాధానమిస్తూ.. పుకార్లు వ్యాప్తి చేసే వారి నోటికి సున్నితంగానే తాళం వేసింది. ఇంతకీ హన్సిక విషయంలో ప్రచారమవుతోన్న ఆ రూమర్‌ ఏంటి? దానిపై ఈ చక్కనమ్మ స్పందనేంటి? తెలుసుకుందాం రండి..

బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది హన్సిక. ఆపై ‘దేశముదురు’తో కథానాయికగా తొలిసారి వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ‘కంత్రి’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘గౌతమ్‌ నంద’.. వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. అయితే 2004లో ‘అబ్ర క దబ్ర’ అనే సినిమాలో బాలనటిగా కనిపించిన హన్సిక.. మూడేళ్ల తర్వాత 2007లో ‘దేశముదురు’లో కథానాయికగా తెరపైకి వచ్చేసరికి.. తన యూత్‌ఫుల్‌ లుక్స్‌కి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఈ చక్కనమ్మలో ఈ మార్పేంటని మరికొందరు ఆశ్చర్యపోయారు కూడా!

ఏ తల్లైనా అలా చేయగలదా?

అయితే ఇంత తక్కువ సమయంలోనే హన్సికలో వచ్చిన ఈ మార్పులకు కారణం ఆమె తల్లి మోనానేనని, వృత్తిరీత్యా చర్మ వ్యాధి నిపుణురాలైన ఆమె ఇచ్చిన హార్మొనల్ ఇంజెక్షన్ల వల్లే హన్సికలో ఇంత వేగంగా మార్పులొచ్చాయంటూ, తాను డబ్బు కోసమే ఇలా చేసిందంటూ.. ఆ సమయంలో ఇలాంటి పుకార్లు విపరీతంగా వ్యాప్తి చెందాయి. కేవలం అప్పుడే కాదు.. ఆపై పలు సందర్భాల్లోనూ ఈ రూమర్స్‌ తెరమీదకొచ్చాయి. ఇటీవలే హన్సిక వివాహ సమయంలోనూ మరోసారి ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇన్నాళ్లూ ఈ వార్తలు తన కంట పడినా మౌనం వహించానని, తనపై ఇలాంటి వార్తలు ప్రచారం చేసినందుకు చాలా బాధపడ్డానంటూ ఇటీవల ఓ సందర్భంలో స్పందించారు మోనా.

‘హన్సిక హార్మొనల్ ఇంజెక్షన్లకు సంబంధించిన వార్తలు చాలా బాధాకరం. గత కొన్నేళ్లుగా ఇవి ప్రచారమవుతున్నాయి. అయినా మేం మౌనం వహించాం. నా కూతురు త్వరగా ఎదగాలని నేను తనకు ఇంజెక్షన్లు చేసినట్లు చాలామంది ఆరోపిస్తున్నారు. అలా అయితే వీటి అవసరం చాలామందికి ఉంది. ఆ ఇంజెక్షన్‌ ఏదో చెప్తే.. దాన్ని అందరికీ ఇచ్చి నేను శ్రీమంతురాలిని అవుతాను! అయినా తన కన్న బిడ్డ విషయంలో ఏ తల్లైనా ఇలా చేయగలదా? అసలు బాల్యం నుంచి యవ్వన దశలోకి రావడానికి ఇంజెక్షన్లు దోహదపడతాయా? మీరే చెప్పండి..!’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు మోనా.

ఇంజెక్షన్లంటే భయం!

ఇక ఇదే విషయంపై తన తల్లితో పాటు హన్సిక కూడా స్పందించింది. ‘సోషల్‌ మీడియా వచ్చాకే కాదు.. రాక ముందు నుంచే ఇలాంటి పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. కాకపోతే సోషల్‌ మీడియా వచ్చాక.. వీటి గురించి చాలామందికి తెలిసింది. అయితే ఇలాంటివి చూసి అమ్మ బాధపడుతుందన్న ఉద్దేశంతో నేను వీటిని దాచడానికి ప్రయత్నించా. కానీ నా పెళ్లి సమయంలో మళ్లీ ఇవి తెరమీదకొచ్చాయి. అయినా వాటిని దాచాల్సిన పనిలేదనిపించింది. ఎందుకంటే అందులో నిజం లేదు కాబట్టి! అయితే నేను ఈ క్షణంలోనూ ఇంజెక్షన్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేను.. ట్యాటూ వేయించుకోవడానికి అస్సలు ఆసక్తి చూపను. ఎందుకంటే నాకు సూదులంటే చాలా భయం. అలాంటప్పుడు కూతురిని నొప్పించేలా ఒక తల్లి ఎలా ప్రవర్తించగలదు? ఆర్థికంగా మా ఎదుగుదల చూసి ఈర్ష్య పుట్టిన వారే ఇలా చేసుంటారని దీన్ని బట్టే అర్థమైపోతుంది. మరి, ఇంత చెప్పినా ఇంకా దీని గురించే మాట్లాడతానంటే ఇక మీ ఇష్టం..!’ అందీ అందాల తార.

హన్సిక తన ప్రియుడు సోహైల్‌ను గతేడాది డిసెంబర్‌లో వివాహమాడింది. జైపూర్ కోటలో సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతి తక్కువమంది అతిథులు పాల్గొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగు, తమిళంలో సుమారు ఏడు ప్రాజెక్టులతో బిజీగా ఉందీ అందాల తార.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్