Harnaaz Sandhu: అందుకే బరువు పెరిగా.. మీకేంటి ప్రాబ్లమ్?

ఒకప్పుడేమో.. ‘మరీ సన్నగా, పీలగా ఉన్నావు.. అంత అందగత్తెవేమీ కాదు..’ అన్నారు..

Updated : 06 Apr 2022 16:08 IST

ఒకప్పుడేమో.. ‘మరీ సన్నగా, పీలగా ఉన్నావు.. అంత అందగత్తెవేమీ కాదు..’ అన్నారు..

ఇక ఇప్పుడేమో.. ‘నాజూగ్గా ఉండాల్సిన నువ్వు ఇలా బొద్దుగా మారావేంటి? అందగత్తెలకు ఇది తగదు..’ అంటున్నారు.

నాడు-నేడు విశ్వ సుందరి హర్నాజ్‌ సంధుకు ఎదురైన విమర్శలివి. 21 ఏళ్ల తర్వాత దేశానికి అందాల కిరీటం అందించిన ఈ పంజాబీ చిన్నది.. ఇటీవలే జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసింది. అయితే ఇందులో కాస్త బొద్దుగా కనిపించిన హర్నాజ్‌ను చూసి అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సన్నగా ఉండాల్సిన అందాల తార.. ఇలా బరువు పెరగడమేంటని గుసగుసలాడుకున్నారు. అయితే దీని వెనుక ఓ బలమైన కారణమే ఉందంటూ నెటిజన్ల ట్రోలింగ్‌కు చెక్‌ పెట్టింది హర్నాజ్‌.

సెలబ్రిటీలు చిక్కినా, బొద్దుగా మారినా.. విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు కొందరు నెటిజన్లు. అసలు సమస్యేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. శరీరాకృతి విషయంలో కాస్త మార్పొస్తే చాలు.. అదేదో కావాలని తప్పు చేసినట్లుగా బరువు తగ్గమంటూ ఉచిత సలహాలిస్తుంటారు. విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు ఇటీవల ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొంది.

ఆ సమస్య వల్లే..!

‘విశ్వ సుందరి’ కిరీటం గెలిచాక కొన్ని నెలల పాటు న్యూయార్క్‌లోనే గడిపింది హర్నాజ్‌. ఇటీవలే భారత్‌కు వచ్చిన ఆమె.. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా.. డిజైనర్‌ ద్వయం శివన్‌, నరేష్‌ రూపొందించిన ఎరుపు రంగు గౌన్‌లో హొయలుపోయింది. అయితే అప్పటికి, ఇప్పటికి కాస్త లావైన హర్నాజ్‌ను చూసి నెటిజన్లు విమర్శలు గుప్పించారు. వీటిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. తనకున్న ఆరోగ్య సమస్యే ఇందుకు కారణమంటూ తనపై వచ్చిన విమర్శల్ని సింపుల్‌గానే తోసిపుచ్చింది.

‘ఒకప్పుడేమో నేను చాలా సన్నగా, పీలగా ఉన్నానని హేళన చేశారు.. ఇక ఇప్పుడేమో లావయ్యానంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారే కానీ.. ఇదంతా నాకున్న Celiac Disease వల్లేనన్న విషయం చాలామందికి తెలియదు. మిస్‌ యూనివర్స్‌ పోటీల కోసం ఇజ్రాయెల్‌ వెళ్లినప్పుడు పోటీలకు మూడు రోజుల ముందు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడే నాకు ఈ సమస్య ఉందని తెలిసింది. దీని కారణంగా నేను గోధుమ పిండి వంటి గ్లూటెన్‌ ఉండే ఆహార పదార్థాలను పూర్తి దూరం పెట్టాలి. అంతేకాదు.. ప్రాంతాలు మారినా శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి..’ అంటూ చెప్పుకొచ్చిందీ పంజాబీ భామ.

పాజిటివిటీని ఇష్టపడతా!

అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా.. తన శరీరాన్ని తాను ప్రేమించుకుంటానని చెబుతోంది హర్నాజ్‌. ‘బాడీ పాజిటివిటీని బలంగా నమ్మే వ్యక్తిని నేను! నా శరీరాకృతి గురించి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారన్న విషయం నాకు తెలుసు! అది వాళ్ల మనస్తత్వం! నేననే కాదు.. రోజూ చాలామంది మహిళలు చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు నేను చెప్పాలనుకుంటోన్న మాట ఒక్కటే.. అదేంటంటే.. ఎవరేమన్నా.. మన శరీరాన్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం. అలాంటప్పుడే మనకు మనం కొత్తగా కనిపిస్తాం. నా దృష్టిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించే ప్రతి మహిళా అందగత్తే! నేను మార్పుల్ని స్వీకరిస్తాను.. ప్రేమిస్తాను. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సంతోషంగా ఉండగలుగుతాను..’ అంటూ తన మాటలతో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.

అసలేంటీ డిజార్డర్‌?!

హర్నాజ్‌ తనకున్న ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టే సరికి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి Celiac Disease అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అంటే.. మన శరీరాన్ని కాపాడాల్సిన రోగనిరోధక శక్తి తిరిగి మన శరీరం పైనే దాడి చేయడమన్నమాట! ఈ సమస్య ఉన్న వారు గోధుమలు, బార్లీ, ఓట్స్‌.. వంటి గ్లూటెన్‌ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా అలసట/నీరసం, బరువు తగ్గడం/పెరగడం, కడుపుబ్బరం, వాంతులు, విరేచనాలు/మలబద్ధకం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే దీనికి విరుగుడు.. గ్లూటెన్‌ ఉన్న ఆహార పదార్థాల్ని మన మెనూలో నుంచి పూర్తిగా తొలగించడమొక్కటే మార్గం అంటున్నారు నిపుణులు. అలాగే ఆహార పదార్థాలు కొనేటప్పుడు గ్లూటెన్‌-ఫ్రీ లేబుల్‌ ఉన్న వాటినే కొనాలి. ఈ క్రమంలో తాజా మాంసం, కోడిగుడ్లు, పండ్లు-కాయగూరలు, పాలు-పాల పదార్థాలు, బీన్స్‌, పప్పులు, మొక్కజొన్న, క్వినోవా, బియ్యం.. వంటి గ్లూటెన్‌ లేని ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్