మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. యూట్యూబ్‌లో పాఠాలు.. లక్షల్లో సంపాదన!

ఈ టెక్నాలజీ యుగంలో చాలామంది యువత తమదైన నైపుణ్యాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇందులో అమ్మాయిలే అధికంగా ఉంటున్నారు. ఈ జాబితాలో హరియాణాకు చెందిన శ్రద్ధ ఖప్రా ముందు వరుసలో ఉంటుంది.

Published : 06 Sep 2023 12:26 IST

(Photos: Instagram)

ఈ టెక్నాలజీ యుగంలో చాలామంది యువత తమదైన నైపుణ్యాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇందులో అమ్మాయిలే అధికంగా ఉంటున్నారు. ఈ జాబితాలో హరియాణాకు చెందిన శ్రద్ధ ఖప్రా ముందు వరుసలో ఉంటుంది. ఈ రోజుల్లో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటుంటే తను మాత్రం ఆ ఉద్యోగాన్నే వదిలి సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. అనతి కాలంలోనే లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు లక్షలు గడిస్తూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రద్ధ ‘మైక్రోసాఫ్ట్‌ వాలీ దీదీ’గా పిలిపించుకుంటోంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

మొదటి అమ్మాయిగా..

హరియాణాకు చెందిన శ్రద్ధ (23) ఓ మారుమూల గ్రామంలో జన్మించింది. అక్కడ చదువుకోవడానికి సరైన పాఠశాలలు కూడా లేవు. దాంతో ఆమె దిల్లీకి చేరుకుంది. అక్కడే టెన్త్‌, ఇంటర్ పూర్తి చేసింది. అందులో మంచి మార్కులు సంపాదించిన శ్రద్ధ ‘నేతాజీ సుభాష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో సీటు దక్కించుకుంది. ఇందులో 8.8 గ్రేడ్‌ సాధించి ఇంజినీరింగ్‌ పట్టాను అందుకుంది. ఈ క్రమంలో ఆ గ్రామంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మొదటి అమ్మాయిగా పేరు సంపాదించుకుంది.

ఉద్యోగం వదిలి..

ఇంజినీరింగ్‌ పూర్తవ్వగానే బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటారు. శ్రద్ధ కూడా అలాంటి కలనే కంది. ఈ క్రమంలో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మూడు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత డీఆర్‌డీవోలో నెల రోజుల పాటు రీసెర్చ్‌ ట్రైనీగా పని చేసింది. మళ్లీ తిరిగి మైక్రోసాఫ్ట్‌ సంస్థలోనే మూడు నెలల పాటు ఇంటర్న్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే అదే సంస్థలో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇలాంటి పరిస్థితిలో చాలామంది ఆనందంలో మునిగి తేలుతుంటారు. కానీ శ్రద్ధ ఇందుకు భిన్నంగా ఆలోచించింది. ఐదు నెలల పాటు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత తన లక్ష్యం ఇది కాదని భావించింది. ఇందుకోసం ఉద్యోగాన్ని సైతం వదులుకుంది.

అప్నా కాలేజీ..

చాలామంది విద్యార్థులు తాము చదువుతోన్న కాలేజీల్లో కోడింగ్‌ నైపుణ్యాలు నేర్చుకుంటున్నా వారికి ప్రాక్టికల్‌ అవగాహన తక్కువగా ఉంటోందని తెలుసుకుంది శ్రద్ధ. ఇలాంటివారికి తనే సొంతంగా అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలోనే 2020లో ‘అప్నా కాలేజీ’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలను ఉచితంగా చెప్పడం ప్రారంభించింది. అనతి కాలంలోనే విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆమె చెప్పే కోడింగ్ పాఠాలు మెచ్చిన విద్యార్థులు శ్రద్ధను ముద్దుగా ‘శ్రద్ధా దీదీ’, ‘మైక్రోసాఫ్ట్‌ వాలీ దీదీ’గా పిలుస్తుంటారు. శ్రద్ధా ఛానల్‌కు 40 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 లక్షల మంది అభిమానులు ఉన్నారు. వీటి ద్వారా శ్రద్ధ నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.

అలాగే శ్రద్ధ ‘అప్నా కాలేజీ’ పేరుతో వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తోంది. దీని ద్వారా కూడా కోడింగ్‌ పాఠాలు నేర్పుతోంది. దీనికి దేశంలోనే పెద్ద కోడింగ్‌ కమ్యూనిటీగా పేరుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని