Published : 22/02/2023 13:05 IST

పెళ్లికి ముందే నన్ను అనుమానిస్తున్నాడా?

నాకు నెల క్రితం ఎంగేజ్‌మెంట్ అయింది. అయ్యింది. ఇంకా పెళ్లి డేట్‌ ఫిక్స్‌ కాలేదు. అయితే అతని మనస్తత్వం చూస్తుంటే అతనిపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. రోజంతా ఫోన్‌ చేస్తూనే ఉంటాడు. నేను ఏం చేస్తున్నాను? ఎక్కడికి వెళ్లాను? ఎవరితో వెళ్లాను? అని ఆరా తీస్తుంటాడు. నా ఈ-మెయిల్‌, ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌లు కూడా అడిగాడు. నేను ఇవ్వనన్నాను. దాంతో అలిగి పది రోజులు మాట్లాడలేదు. తన ప్రవర్తన విసుగు తెప్పిస్తోంది. తను నాపై ఆసక్తితో మాట్లాడుతున్నాడో, నన్ను అనుమానిస్తున్నాడో తెలియడం లేదు. అతడిని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందేమోనని అనిపిస్తోంది. ఈ విషయంలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఇద్దరి వ్యక్తుల మధ్య అనుబంధం కలకాలం కొనసాగాలంటే నమ్మకం అనే పునాది బలంగా ఉండాలి. కానీ మీరు చెప్పిన అబ్బాయి మనస్తత్వం చూస్తుంటే అతనిది ఆధిపత్య లేదా అనుమానించే మనస్తత్వంగా అనిపిస్తోంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇన్ని రోజులు అతనితో ఉన్న పరిచయాన్ని ఒకసారి విశ్లేషించుకోండి. కేవలం లోపాల గురించి మాత్రమే కాకుండా మంచి విషయాలను కూడా గమనించండి. ఒకవేళ అప్పటికీ ఆ పరిచయం భారంగా, బరువుగా అనిపిస్తే మాత్రం దాన్నుంచి బయటకు రావడమే మంచిది.

అయితే కొంతమంది తమలో ఉన్న అభద్రతాభావం వల్ల కూడా ఇలా ప్రవర్తిస్తుంటారు. ఇంకొంతమంది మానసిక సమస్యల వల్ల కూడా ఇలా చేస్తుంటారు. లేదంటే వారి స్వభావమే అలా ఉండచ్చు. ఏది ఏమైనా అతని ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తోందని భావిస్తే నేరుగా అతనితోనే ఈ విషయాల గురించి చర్చించండి. లేదంటే మీ సమస్యను పెద్దవాళ్లకు చెప్పి మాట్లాడించండి. అవసరమైతే కౌన్సెలింగ్‌ తీసుకోండి. అప్పటికీ మీకు ఇదే భావన ఉంటే అతనితో పెళ్లి గురించి మళ్లీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని