ఆ విషయాల గురించి చెప్పకుండా నన్ను దూరం పెడుతున్నాడు..!

నా భర్త వారి కుటుంబ విషయాల్లో వేరుగా చూస్తుంటారు. ఇది నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ విషయాల గురించి ఆయనతో మాట్లాడాను. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్కోసారి అందరూ కలిసి నన్ను కావాలనే వేరు చేస్తున్నారేమో అనే భావన కలుగుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి?

Updated : 26 Jul 2023 20:03 IST

మా పెళ్లై ఆరేళ్లవుతోంది. నా భర్త, వారి కుటుంబ విషయాల్లో నన్ను మొదట్నుంచి దూరంగానే ఉంచుతున్నారు. మా అత్తమామలు, బావ గారు కూడా ఆ విషయాల గురించి మాట్లాడరు. అయితే వారి కంటే ఆయన నన్ను దూరంగా పెట్టడమే తీవ్రంగా బాధపెడుతోంది. మేము ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాం. మా అత్తమామలు, బావ గారితో నా భర్త రోజూ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. వారితో మాట్లాడిన తర్వాత కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపడుతుంటారు. నేను ఏమైందని అడిగినా ‘అంత కంగారు పడాల్సిన అవసరం లేదు’ అని సమాధానమిస్తుంటారు. అయితే మా అత్తమామలు, బావ గారు నాతో సఖ్యతగానే ఉంటారు. కానీ, వారి కుటుంబ విషయాల్లో మాత్రం నన్ను వేరుగానే చూస్తుంటారు. ఇది నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ విషయాల గురించి ఆయనతో మాట్లాడాను. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్కోసారి అందరూ కలిసి నన్ను కావాలనే వేరు చేస్తున్నారేమో అనే భావన కలుగుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు పెళ్లై ఆరేళ్లైందని అంటున్నారు. మొదట్నుంచి మీ భర్త, వారి కుటుంబ విషయాల్లో మిమ్మల్ని దూరం పెడుతున్నాడని చెబుతున్నారు. మీ అత్తమామలు, బావగారితో మాట్లాడే క్రమంలో మీ భర్త కొన్నిసార్లు నిరుత్సాహానికి లోనవుతున్నాడని అంటున్నారు. ఒక భార్యగా మీరు మీ భర్త బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. అలాగే అతని బాధను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నారు. కానీ అలా జరగకపోవడంతో మీరు ఒత్తిడికి గురవుతున్నారు. జీవిత భాగస్వాములన్నాక ఒకరి విషయాలను మరొకరితో పంచుకోవాలి. అప్పుడే బంధంలో ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటాయి. కానీ, మీ విషయంలో అది జరగడం లేదు. అయితే ప్రతి బంధంలో కొన్ని పరిమితులు ఉంటాయి. అవి ఒకరితో ఒకరు ఎలా ఉండాలో నిర్ణయిస్తుంటాయి.

ఒకసారి మీ ఆరేళ్ల అనుబంధాన్ని నెమరువేసుకోండి. ఈ క్రమంలో కొన్ని విషయాల గురించి ఆలోచించండి. మొదటగా మీ భర్త కేవలం వారి కుటుంబ విషయాల్లోనే మిమ్మల్ని దూరం పెడుతున్నాడా? ఇతర విషయాల్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాడా? అన్న విషయాన్ని పరిశీలించండి. అతని కుటుంబ సభ్యులు మీతో సఖ్యతగానే ఉంటున్నారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారి కుటుంబ విషయాలు తెలుసుకుని కూడా మీరు చేయడానికి ఏమీ ఉండకపోవచ్చు. అలాంటి అభిప్రాయం వల్ల ఆ విషయాలను మీ దగ్గర ప్రస్తావించడం లేదా? అనే విషయాన్ని ఆలోచించండి. చివరగా, అతని వ్యక్తిగత విషయాలను మీ ప్రమేయం లేకుండా సొంతంగానే పరిష్కరించుకోవాలనుకుంటున్నాడా? అనేది కూడా తెలుసుకోండి. ఒకవేళ అలా నిర్ణయించుకుంటే ఆ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే అండగా మీరున్నారన్న ధైర్యాన్ని ఇవ్వండి. అప్పుడు కొంతైనా అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

ఒకవేళ అతను కేవలం వారి కుటుంబ విషయాల్లోనే మిమ్మల్ని దూరం పెడుతున్నాడంటే మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ బంధమూ వంద శాతం సంపూర్ణంగా ఉండదు. ప్రతి బంధంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒక భర్తగా మిగిలిన విషయాల్లో మీతో సరిగానే ఉన్నప్పుడు దీని గురించి మీరు ఎక్కువగా కలత చెందాల్సిన అవసరం లేదు. అయితే అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తోందని అంటున్నారు. దీన్నుంచి బయటపడడానికి ఒకసారి మానసిక నిపుణులను కలవండి. వారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే ఒకసారి మీ భర్తతో స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడండి. ఈ క్రమంలో- అతని కుటుంబ విషయాల గురించి మీతో పంచుకోకపోవడం వల్ల మిమ్మల్ని వేరు చేస్తున్నట్లుగా ఫీలవుతున్నానని అర్ధమయ్యేలా వివరించండి. దానివల్ల అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని