ఆ రహస్యాలను కూడా తన పేరెంట్స్‌కి చెప్పేస్తాడు..!

నాకు పెళ్లై నాలుగు నెలలవుతోంది. నా భర్త బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆయన ప్రతి చిన్న విషయాన్ని తన తల్లిదండ్రులతో చెబుతుంటాడు. సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేడు. అంతేకాకుండా నా స్నేహితుల గురించి నేను చెప్పిన విషయాలను కూడా....

Updated : 12 Mar 2023 14:53 IST

నాకు పెళ్లై నాలుగు నెలలవుతోంది. నా భర్త బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆయన ప్రతి చిన్న విషయాన్ని తన తల్లిదండ్రులతో చెబుతుంటాడు. సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేడు. అంతేకాకుండా నా స్నేహితుల గురించి నేను చెప్పిన విషయాలను కూడా వాళ్ల అమ్మకు చెబుతున్నాడు. ‘ఎందుకలా చెబుతున్నావు.. అవి మన మధ్యే ఉండాలి’ అంటే ‘అమ్మకు చెబితే తప్పేముంది’ అంటున్నాడు. తనకు ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదు. కౌన్సెలింగ్‌ వల్ల తనలో మార్పు వస్తుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఇది చాలా కుటుంబాల్లో వచ్చే సమస్య. చాలామంది చిన్నప్పటి నుంచి ఎవరితో సఖ్యతగా ఉంటారో.. పెళ్లైన తర్వాత కూడా వారితో అంతే సఖ్యతగా ఉంటూ ప్రతి విషయాన్ని పంచుకుంటుంటారు. వీరిలో స్నేహితులు, బంధువులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కో ఆలోచనా విధానం ఉంటుంది. దాని పైనే వారు ప్రవర్తించే విధానం కూడా ఆధారపడి ఉంటుంది. ముందు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరికీ ఒకే రకమైన ఆలోచనా విధానం ఉండదు అన్న విషయం మీరు గ్రహిస్తే ఇది మీకు పెద్ద సమస్యగా కనిపించదు.

మీ విషయానికొస్తే- మీరు గోప్యంగా ఉంచాలనుకున్న అంశాలు ఆయనకు మామూలు అంశాలుగా కనిపించవచ్చు. అందుకే వాటి గురించి వాళ్ల పేరెంట్స్‌తో చెబుతుండవచ్చు. ఇలా చెప్పడం, చెప్పకపోవడం అనేది వాళ్ల వాళ్ల వ్యక్తిగత ఆలోచనా విధానాల పైన ఆధారపడి ఉంటుంది. దీనిని మీరు అర్ధం చేసుకుని మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి.

ఈ క్రమంలో- మీ వారు ఏ విషయాన్నయినా సరే - తన తల్లిదండ్రులతో పంచుకుంటారు అనుకుంటే.. వాళ్లకు తెలియాల్సిన అవసరం లేని, మీరు గోప్యంగా ఉంచాలనుకున్న విషయాల గురించి ఆయనతో చెప్పకపోవడమే మంచిది. అప్పుడు మీకు ఆయనతో ఎలాంటి సమస్యా ఉండకపోవచ్చు. అదేవిధంగా మీ ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయాలలో కూడా ఆయనకు ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పడం వల్ల అనవసరమైన సమస్యలు ఉండవు. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కపుల్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వారు మీ ఇద్దరి అభిప్రాయాలను, మనస్తత్వాలను తెలుసుకొని ఏ రకంగా ఉంటే మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుందో చెబుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్