Published : 04/10/2022 20:28 IST

ఇవి ఆరోగ్యానికీ మంచివి..!

దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మలగన్న అమ్మ.. ఆ దుర్గమ్మని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తాం.. ఆ తల్లికి ఇష్టమైన అనేక పిండివంటలు చేసి ప్రసాదంగా నివేదిస్తాం.. ఎవరి శక్తికి తగ్గట్లు వారు ఆ పరాశక్తిని పూజిస్తారు. అయితే  ప్రత్యేకించి ప్రసాదాల విషయానికొస్తే ఎన్ని రకాల పిండివంటలు చేసినా- పానకం, వడపప్పు, చలిమిడి మాత్రం తప్పనిసరిగా నివేదించాలని పెద్దలు చెబుతారు. ఇలా అమ్మవారికి నివేదించే ఈ పదార్థాల్లో మన ఆరోగ్యానికి మేలు కలిగించే ఎన్నో సుగుణాలుండడం గమనార్హం..

నైవేద్యానికి నవగాయ పిండివంటలు లేకపోయినా, అవి వండడానికి ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లో చిన్న బెల్లం ముక్క ఉంటే చాలంటారు పెద్దలు. బెల్లంతో చేసిన వంటకాలతో దేవతలు సైతం తృప్తి చెందుతారట. అంతటి విశిష్ట స్థానం ఉంది మరి దీనికి. అందుకే దాదాపు ప్రతి పండక్కీ తయారు చేసే నైవేద్యంలో బెల్లాన్ని ఉపయోగిస్తాం. దీనివల్ల కేవలం నోటికి రుచే కాకుండా.. అనేక రకాల పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

🩺 బెల్లం వివిధ రకాల పోషకాలకు నిలయం. ఇందులో అనేక ఖనిజాలు ఉన్నాయి.. ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, శరీర ఎదుగుదలకు కావలసిన ఇతర ఖనిజాలు కూడా బెల్లం నుంచే మనకు లభిస్తాయి.

🩺 శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి.. వెంటనే అలసట మాయమైపోతుంది.

🩺 బెల్లంలో ఇనుము శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.

🩺 ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ వల్ల కణజాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడతాయి.

🩺 బెల్లం సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేసి శ్వాసకోస గ్రంథులు, వూపిరితిత్తులు, పొట్ట.. వంటి శరీర భాగాలను శుభ్రపరుస్తుంది.

వడపప్పులోనూ..

అదేవిధంగా- ప్రసాదంగా నివేదించే వడపప్పు సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

🩺 పెసరపప్పులో శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమయ్యే విటమిన్ ఎ, బి, సి, ఇ; క్యాల్షియం, పొటాషియం, ఐరన్.. వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

🩺 బరువు తగ్గాలనుకునే వారికి పెసరపప్పు మంచి ఆహారం. ఇందుకు కారణం దీనిలో తక్కువ మోతాదులో ఉండే కొవ్వు పదార్థాలే. అలాగే పెసరపప్పులో అధికంగా ఉండే ప్రొటీన్, ఫైబర్.. వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించేందుకు సహకరిస్తాయి.

🩺 ఈ పప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.

🩺 జీర్ణవ్యవస్థను పటిష్టపరచడానికి, మధుమేహం రాకుండా నివారించడానికి పెసరపప్పు బాగా తోడ్పడుతుంది.

అలాగే బియ్యప్పిండి, బెల్లం నీటిలో కలిపి చలిమిడిని తయారు చేస్తారు. ఇవన్నీ వేడిని తగ్గించేవే..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని