చాక్లెట్.. ఆ కోరికను పెంచుతుందట!
కేక్స్ దగ్గర్నుంచి మిల్క్ షేక్స్ దాకా.. బిస్కట్స్ దగ్గర్నుంచి స్వీట్స్ దాకా.. ఇలా ఎందులోనైనా చాక్లెట్ ఫ్లేవర్‌ని కోరుకుంటారు కొంతమంది. ఇక కొంతమంది అమ్మాయిలైతే చాక్లెట్ అంటే చెవి కోసుకుంటారు. మరి, ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న....
కేక్స్ దగ్గర్నుంచి మిల్క్ షేక్స్ దాకా.. బిస్కట్స్ దగ్గర్నుంచి స్వీట్స్ దాకా.. ఇలా ఎందులోనైనా చాక్లెట్ ఫ్లేవర్‌ని కోరుకుంటారు కొంతమంది. ఇక కొంతమంది అమ్మాయిలైతే చాక్లెట్ అంటే చెవి కోసుకుంటారు. మరి, ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ పదార్థం రుచిని ఆస్వాదించడమే తప్ప.. అసలు ఇదెక్కడ పుట్టింది? దీన్నెలా తయారుచేస్తారు? దీనివల్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రయోజనాలున్నాయా? అని మీరెప్పుడైనా ఆలోచించారా? మరి అయితే ఆలస్యమెందుకు.. ‘ప్రపంచ చాక్లెట్ దినోత్సవం’ సందర్భంగా ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం రండి..
చాక్లెట్.. ఈ పేరు వినగానే మన మనసు దాని వైపు పరుగులు తీస్తుంది.. మన నోరు దాని రుచి కోసం తహతహలాడుతుంది. మరి, ఎంతోమందిని తన మాయలో పడేసుకున్న ఈ చాక్లెట్ ఎక్కడ పుట్టిందో తెలుసా? ఉత్తర అమెరికాలోని మెసోఅమెరికాలో. థియోబ్రోమా కొకోవా చెట్టు నుంచి సేకరించిన కొకోవా గింజలతో చాక్లెట్‌ను తయారుచేస్తారు. మెసోఅమెరికన్లు దీన్ని తొలుత డ్రింక్ రూపంలో సేవించేవారట. మసాలాలు, కార్న్ ప్యూరీ కలిపి తయారుచేసిన ఈ పానీయానికి ‘చిలేట్’ అని నామకరణం చేశారట. చేదుచేదుగా ఉండే ఈ డ్రింక్ శరీరానికి శక్తిని అందించడంతో పాటు లైంగిక కోరికల్ని పెంచే సాధనంగా కూడా వారు దీన్ని వాడేవారట.
ఆరోగ్యపరంగానూ..
చాక్లెట్ రుచిలోనే కాదు.. ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగని మరీ ఎక్కువగా చాక్లెట్ తింటే స్థూలకాయం, హైపర్‌టెన్షన్, మధుమేహం.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు బైట్స్ చాలంటున్నారు.
⚛ మానసిక ఒత్తిళ్లను తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్ సొంతం అంటున్నారు నిపుణులు. మన మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయులను పెంచి మనసులోని ఆందోళనలను తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. చాక్లెట్ తినే వారితో పోల్చితే తినని వారిలో డిప్రెషన్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
⚛ డార్క్ చాక్లెట్‌లో ‘ఎల్- అర్జినైన్’ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది లైంగిక అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసి లైంగిక కోరికలు పెరిగేందుకు సహకరిస్తుంది. అందుకే చాక్లెట్‌ను న్యాచురల్ సెక్స్ బూస్టర్‌గా పరిగణిస్తారు.
⚛ చాక్లెట్‌లోని ఫ్లేవనాల్స్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఈ ఫ్లేవనాల్స్ అధికంగా లభించే కొకోవా డ్రింక్ తాగే వారి చర్మం సున్నితంగా, నవయవ్వనంగా మెరిసిపోతుందంటున్నారు నిపుణులు.
⚛ చాక్లెట్ మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడంలో సహకరిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు దీనిలోని ప్లాంట్ స్టెరోల్స్, కొకోవా ఫ్లేవనాల్సే కారణమట!
⚛ ఇక మరో అధ్యయనం ఏం చెబుతుందంటే.. గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ 30 గ్రాముల చాక్లెట్ తీసుకోవడం వల్ల పిండం ఆరోగ్యంగా ఎదుగుతుందట!
⚛ చాక్లెట్‌లో ఉండే కొకోవాలో ఫినోలిక్ సమ్మేళనాలుంటాయి. అవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి.
⚛ హాట్ చాక్లెట్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదట. అంతేకాదు.. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
⚛ చాక్లెట్ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం 1/3 వంతులు తగ్గుతుందట!
⚛ వ్యాయామం చేసే ముందైనా, క్రీడల్లో పాల్గొనే ముందైనా తక్షణ శక్తి కోసం ఓ చిన్న ముక్క చాక్లెట్ తినమంటున్నారు నిపుణులు. అలాగే ఇది శరీరాన్ని ఫిట్‌గా, దృఢంగా ఉంచడానికి సైతం తోడ్పడుతుంది.
⚛ ఎప్పుడూ ఏదో ఒక చిరుతిండి తినాలని మనసు కోరుకుంటే ఒక చిన్న చాక్లెట్ ముక్క నోట్లో వేసుకోండి.. ఇక అలాంటి పదార్థాల పైకి మనసు మళ్లదు. తద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
ముచ్చటగా మూడు రకాలు!
మనం ఎంతగానో ఇష్టపడి తినే చాక్లెట్లలో ముచ్చటగా మూడు రకాలున్నాయి.
1. డార్క్ చాక్లెట్
పాల పదార్థాలు అతి తక్కువగా లేదంటే అసలు ఉపయోగించకుండా తయారుచేసేదే డార్క్ చాక్లెట్. రుచిలో కాస్త చేదుగా ఉండే ఈ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో రక్తప్రసరణను ప్రేరేపించి బీపీని అదుపులో ఉంచుతాయి.
2. మిల్క్ చాక్లెట్
12 శాతం పాలు లేదా పాల పదార్థాలు, 33-45 శాతం కొకోవా పౌడర్, చక్కెర.. వంటి వాటితో ఈ చాక్లెట్ తయారవుతుంది. రుచిలో తియ్యగా ఉండే ఈ చాక్లెట్‌లో చక్కెరలు, కొవ్వులు కూడా అధికంగా ఉంటాయట.
3. వైట్ చాక్లెట్
కొకోవా గింజల నుంచి సేకరించిన బటర్‌తో మాత్రమే దీన్ని తయారుచేస్తారు. ఇందులో చాక్లెట్, కొకోవా పౌడర్.. వంటివేమీ ఉపయోగించరు.
చూశారుగా.. రుచికరమైన చాక్లెట్‌తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో! అలాగని ఎక్కువ మొత్తంలో తిన్నారో అధిక బరువుతో పాటు లేనిపోని అనారోగ్యాలు మూటగట్టుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.