నీళ్లే కాదు.. కొబ్బరీ మంచిదే!

డీహైడ్రేషన్‌ సమస్యలను అధిగమించాలన్నా, అందాన్ని మెరుగుపరచుకోవాలన్నా కొబ్బరి నీళ్లకు మించింది మరొకటి లేదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందీ న్యాచురల్‌ డ్రింక్‌. అందుకే కరోనా మొదలయ్యాక కొబ్బరి నీళ్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇమ్యూనిటీ కోసమైనా చాలామంది దీనిని డైట్‌లో భాగం చేసుకుంటున్నారు.

Updated : 22 Jul 2021 20:36 IST

డీహైడ్రేషన్‌ సమస్యలను అధిగమించాలన్నా, అందాన్ని మెరుగుపరచుకోవాలన్నా కొబ్బరి నీళ్లకు మించింది మరొకటి లేదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందీ న్యాచురల్‌ డ్రింక్‌. అందుకే కరోనా మొదలయ్యాక కొబ్బరి నీళ్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇమ్యూనిటీ కోసమైనా చాలామంది దీనిని డైట్‌లో భాగం చేసుకుంటున్నారు.

కొబ్బరిని అలాగే వదిలేస్తున్నారా?

కొబ్బరి బోండంలో స్వచ్ఛమైన, రుచికరమైన నీళ్లతో పాటు అడుగు భాగాన కొబ్బరి ఉంటుంది. దీన్ని ‘నారియల్‌ మలాయ్’, ‘కోకొనట్‌ క్రీమ్‌’, ‘కొబ్బరి పల్ప్’, ‘కోకొనట్‌ మీట్‌’ అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. అయితే చాలామంది కొబ్బరి బోండంలో నీళ్లు మాత్రమే తాగుతారు. అందులోని కొబ్బరిని ఏ మాత్రం పట్టించుకోరు. ఇందులోని పోషకాల గురించి అవగాహన లేకనో... ఈ కొబ్బరిని తింటే బరువెక్కుతామన్న అపోహతోనో ఇలా చేస్తుంటారు.

ఇమ్యూనిటీ కోసం కొబ్బరి మలాయ్!

అయితే కొబ్బరి నీళ్లతో పాటు అడుగున ఉండే కొబ్బరిలోనూ ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రోగనిరోధక శక్తితో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఈ కొబ్బరితో ముడిపడి ఉన్నాయని వారు చెబుతున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

గుండె ఆరోగ్యానికి మంచిది!

ఈ కొబ్బరి మలాయ్‌లో కొవ్వులు అధికంగా ఉండే మాట నిజమే. అయితే అవి శరీరానికి మేలు చేసే కొవ్వులు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచడంలోనూ ఇవి బాగా తోడ్పడతాయి. ఈ క్రమంలో గుండెకు సంబంధించిన సమస్యల నుంచి రక్షణ పొందాలంటే దీనిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే.

బరువు తగ్గాలంటే..

ఈ కొబ్బరిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు ఈ కొబ్బరిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో ఆకలి కోరికలు కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

ఆ సమస్యలు దూరం!

కొబ్బరి మలాయ్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమవ్వడంలో బాగా తోడ్పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ రేటు మెరుగుపడడమే కాకుండా కడుపులో మంట, అజీర్తి, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి.

తక్షణ శక్తి కోసం..

డీహైడ్రేషన్‌ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కొబ్బరి నీళ్లు ఎంత సమర్థంగా పని చేస్తాయో అందరికీ తెలుసు. అయితే కొబ్బరి నీళ్లతో పాటు కొబ్బరి మలాయ్‌ను కూడా తీసుకుంటే శరీరంలో నీటి స్థాయులను మరింతగా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా శరీరానికి తక్షణ శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని వారు చెబుతున్నారు.

రక్తపోటు సమస్యలు దూరం

కొబ్బరి మలాయ్‌ను తరచుగా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఇందులోని సి-విటమిన్‌, పొటాషియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు రక్తపోటులోని హెచ్చుతగ్గులను నివారించడంలో బాగా సహాయపడతాయి.

రోగ నిరోధక శక్తి

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వివిధ ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షణ కల్పించడంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో కీలకం. వీటితో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కొబ్బరి మలాయ్‌లో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు.

చర్మ సంరక్షణ కోసం..

చర్మ సంరక్షణకు ఉపకరించే అద్భుత గుణాలు కూడా ఈ కొబ్బరిలో ఉన్నాయి. ఇందులో విరివిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ చర్మ సమస్యలను చాలా వరకు దూరం చేస్తాయి.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

* కొబ్బరి మలాయ్‌లో ఎ, బి, సి-విటమిన్లు, థయమిన్‌, రైబోఫ్లావిన్‌ పుష్కలంగా ఉంటాయి.

* ఇందులోని క్యాల్షియం ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఆస్టియోపొరోసిస్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

* చిగుళ్ల వాపు, నొప్పి, రక్తం కారడం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

* మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.

చూశారుగా.. కొబ్బరి బోండంలో ఉండే కొబ్బరితో ఎన్ని ప్రయోజనాలున్నాయో! కాబట్టి ఇక నుంచీ కొబ్బరి బోండం కొన్నప్పుడు కొబ్బరి నీళ్లతో పాటు మలాయ్‌ను కూడా తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్