Updated : 17/11/2022 12:41 IST

సీతాఫలం.. ఇమ్యూనిటీకి బలం!

ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. సాధారణంగా ఈ పండ్లు సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య ఎక్కువగా లభిస్తాయి. కొన్ని గుండ్రంగా, కొన్ని హృదయాకారంలో.. ఉండే ఈ పండ్లను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఎంతో రుచికరంగా ఉండే సీతాఫలాలు ఆరోగ్యానికీ ఎంతో అవసరం. ఇందులో ఎ, సి, బి6 వంటి విటమిన్లతో పాటు కాపర్, పొటాషియం, పీచు.. వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పైగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా! ఈ క్రమంలో ఈ మధుర ఫలంలో ఉన్న పోషకాలేంటి? అవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపకరిస్తాయో తెలుసుకుందాం రండి...

⚛ చాలా బలహీనంగా ఉండి.. ఏ పని చేయడానికీ శరీరం సహకరించట్లేదా? అయితే సీతాఫలం తినండి. ఎందుకంటే ఈ పండులో శరీరానికి శక్తినిచ్చే గుణాలు అధికంగా ఉంటాయి.

⚛ ఆహారం త్వరగా జీర్ణం కావట్లేదా?? అయితే సీతాఫలం తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కాపర్ మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవడంలో సహాయపడుతుంది.

⚛ ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు విశ్రాంతినివ్వడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ ఖనిజం గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

⚛ ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి రక్షిస్తుంది.

⚛ ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. సీతాఫలం ఇందుకు సహకరిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంపై ఏర్పడిన వాపును తగ్గించడంలో సహకరిస్తాయి.

⚛ ఇందులో కొవ్వులు తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ పండు తినడం వల్ల మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు.

⚛ ఈ పండులో ఉండే అసిటోజెనిన్, ఆల్కలాయిడ్స్.. అనే సమ్మేళనాలు ఎలాంటి క్యాన్సర్లు రాకుండా శరీరాన్ని కాపాడతాయి.

⚛ సీతాఫలంలో బి-కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. ఫలితంగా ఒత్తిడి, టెన్షన్.. నుంచి ఉపశమనం పొందచ్చు.

⚛ ఈ పండులో విటమిన్ సి, రైబోఫ్లేవిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చూపు స్పష్టంగా కనిపించేందుకు సహాయపడతాయి.

⚛ ఈ పండు తినడం వల్ల శరీరం తక్కువ మొత్తంలో చక్కెరల్ని గ్రహిస్తుంది. ఫలితంగా టైప్-2 మధుమేహం నుంచి రక్షించుకోవచ్చు.

⚛ సీతాఫలంలో కాపర్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి. ఇది పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. కాపర్ తక్కువైతే పూర్తిగా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సీతాఫలం తినడం మంచిది.

⚛ అలాగే గర్భం దాల్చిన మహిళల్లో వేవిళ్లు, మూడ్ బాగోలేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం.. లాంటి చాలా సమస్యలు ఉంటాయి. సీతాఫలం వీటన్నింటికీ చెక్ పెట్టేస్తుంది.

⚛ ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి.

⚛ కొంతమందికి పాలు తాగడమంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటి వారు సీతాఫలం తినడం వల్ల పాలు తాగినంత బలం, శక్తి వస్తాయి.


కొనేముందు..

సీతాఫలాలను కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలూ కొన్నున్నాయి. అవేంటంటే..

⚛ ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉన్న పండ్లను కొనచ్చు. కానీ నల్లగా మారిన వాటిని కొనకపోవడమే మంచిది.

⚛ ఒకవేళ పూర్తిగా పండని వాటిని తీసుకొని ఇంట్లో పండించుకోవాలంటే.. సాధ్యమైనంత మేరకు పెద్దగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోండి. చిన్నగా ఉన్నవి పండే అవకాశం తక్కువ.

⚛ అలాగే మీరు కొన్న కాయలను.. ఒక గోనె సంచిలో ఉంచి ఓ మూలన ఉంచండి. రెండు రోజుల్లో అవి పండుతాయి.

⚛ పండ్లను కొంటే రెండు రోజుల్లోపే తినడం మంచిది. అంతకు మించితే అవి పాడైపోతాయి.

⚛ పండ్లను ఫ్రిజ్‌లో నేరుగా కాకుండా కవర్లో ఉంచి పెట్టడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని