Published : 24/03/2023 20:59 IST

అందుకే ఖర్జూరాలు తినాలి!

రంజాన్‌ మాసంలో ఆచరించే కఠిన ఉపవాస దీక్షకు అత్యంత ప్రాధాన్యం ఉంది. రోజూ ఈ దీక్ష విరమించేటప్పుడు తీసుకునే ఆహార పదార్థాల్లో ‘ఖర్జూరాలు’ తప్పకుండా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఈ పండు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.

ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం.

ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి.. బరువు అదుపులో ఉంచుకోవచ్చు.

ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి, ఇతర కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి ఖనిజాలు ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారికీ మంచి ఫలితాన్నిస్తాయి.

ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు.

మలబద్ధకంతో బాధపడేవారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు ‘కె’ విటమిన్ కూడా ఉంటుంది. నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన పోషకాలు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది ఇవి తినడానికి భయపడుతుంటారు. కానీ వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది. కానీ డయాబెటిస్‌తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమ వంతు పాత్ర పోషిస్తాయి.

మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని