Yoga Day: ఏ ఆరోగ్య సమస్యకు.. ఏ యోగాసనం..?

మహిళలు వివిధ బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో ఎంతో కొంత ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల కలిగే చిరాకు, కోపం.. వంటి భావోద్వేగాలను తమలోనే అణచుకొని మరింతగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది.

Published : 21 Jun 2024 12:26 IST

మహిళలు వివిధ బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో ఎంతో కొంత ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల కలిగే చిరాకు, కోపం.. వంటి భావోద్వేగాలను తమలోనే అణచుకొని మరింతగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్, ప్రత్యుత్పత్తి సమస్యలు.. వంటివి తలెత్తుతున్నాయి. మరి, ఈ వాస్తవాన్ని గుర్తెరిగి.. ఒత్తిడిని తగ్గించుకుంటే ఇలాంటి ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చు. అయితే అందుకు యోగానే చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు. మహిళలు ఎదుర్కొనే ప్రతి సమస్యకూ ప్రత్యేకమైన యోగాసనాలు వేయడం వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడచ్చని చెబుతున్నారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నేపథ్యంలో ఏయే యోగాసనాలు ఎలాంటి అనారోగ్యాల్ని తగ్గిస్తాయో తెలుసుకుందాం రండి..

గ్రంథుల పనితీరుకు..

థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని అన్ని గ్రంథులకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి. చాలామంది మహిళలు తమ సమస్యలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడక లోలోపలే కుమిలిపోతుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరిగిపోయి థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా ఊబకాయం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం.. వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో విశుద్ధచక్రాసనం వేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి థైరాయిడ్ పనితీరుని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు.

అలాగే పిట్యూటరీ గ్రంథి ఇతర గ్రంథుల పనితీరును సమన్వయపరుస్తుంది. కానీ ఒత్తిడి పెరగడం వల్ల గ్రంథుల మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతిని శ్వాసవేగం పెరిగిపోతుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా అవయవాలకు సరిపడినంత ఆక్సిజన్ లభించదు. దాంతో హార్మోన్ల మధ్య సమతుల్యత లోపించి రుతుచక్రం దెబ్బతింటుంది. అంతేకాదు డయాబెటిస్, ఎసిడిటీ, అల్సర్లు.. లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఒత్తిడి వల్ల కలిగే ఈ సమస్యలను యోగా ద్వారా తగ్గించుకోవచ్చు.

దీనికోసం సూర్యనమస్కారాలు, విపరీతకర్ణి, నౌకాసనం, మత్య్సాసనం, భ్రమరీప్రాణాయామం, అంతర్ముఖ ముద్ర.. వంటివి సాధన చేయాలి.

ఊబకాయం..

ఈ సమస్య నుంచి బయటపడటానికి సూర్యనమస్కారాలు బాగా పనిచేస్తాయి. అలాగని నిత్యం అధిక సంఖ్యలో సూర్యనమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో యోగాని ఎక్సర్‌సైజ్‌లా చేస్తూ దాన్ని పవర్‌యోగా అంటున్నారు. అలా చేస్తున్నప్పుడు మొదట బాగానే ఉంటుంది. కానీ రెండు మూడు నెలల వ్యవధిలోనే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రోజుకి ఇరవై సూర్య నమస్కారాలు చేసినా చక్కటి ప్రయోజనం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

సూర్య నమస్కారాల వల్ల శరీరంలోని ప్రతి భాగం కదులుతుంది. ఫలితంగా కొవ్వు కరగడం మొదలవుతుంది. అలాగే నౌకాసనం, పాదహస్తాసనం, ఉత్థానుపాదాసనం, శ్రీలింగముద్ర, కపాలభాతి, వీరభద్రాసనం, త్రికోణాసనం, సర్వాంగాసనం.. లాంటి ఆసనాలు వేయచ్చు. అలాగే భస్త్రికా ప్రాణాయామం కూడా సాధన చేయాలి.

గైనిక్ సమస్యలకు..

పీసీఓడీ, సిస్టులు, నీటిబుడగలు.. లాంటి సమస్యల బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో సమస్య వచ్చిన తర్వాత తీసుకొనే చర్యల కన్నా సమస్య రాకుండా చూసుకోవడం మంచిది.

గైనిక్ సమస్యలు రాకుండా ఉష్ట్రాసనం, భుజంగాసనం, ధనురాసనం, శుప్తగోరక్షాసనం, పక్షిక్రియ, పశ్చిమోత్తనాసనం, హలాసనం, చక్రాసనం, సర్వాంగాసనం, మాతంగి ముద్ర, నాడీశోధన ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం.. వంటివి సాధన చేయాలి.

వెన్ను సంబంధిత సమస్యలు..

ఆఫీస్‌లో ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల వెన్నుపాముపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా చాలామంది చిన్న వయసులోనే నడుము నొప్పి, మెడనొప్పితో బాధపడుతున్నారు.

ఈ సమస్యకు మేరుదండాసనాలు పరిష్కారం చూపిస్తాయి. అలాగే మార్జాలాసనం, వ్యాఘ్రాసనం, భుజంగాసనం వేస్తూ ఉండాలి. పృష్ణ ముద్ర, మేరుదండ ముద్రలు కూడా వేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడచ్చు.

గమనిక: ముందు మీ సమస్యను నిర్ధరించుకొని.. నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలోనే ఆయా ఆసనాలు సాధన చేయాల్సి ఉంటుంది. తద్వారా అటు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.. ఇటు శారీరకంగా, మానసికంగానూ దృఢంగా మారచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్