Published : 25/03/2022 15:42 IST

అందుకే పెరుగు తినాలట!

పాలు, పెరుగు తీసుకోవడానికి కొందరు ఆసక్తి చూపించరు. వీటివల్ల బరువు పెరుగుతామనే అభిప్రాయంలో ఉండేవారూ లేకపోలేదు. అయితే సకల పోషకాల మిళితమైన పెరుగు రోజూ తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది. అదెలాగంటే..

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది..

జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి. పైగా మనం తీసుకునే ఇతర పదార్థాల నుంచి పోషకాలనూ శరీరం స్వీకరిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

మేలు చేసే బ్యాక్టీరియా..

పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాల్షియం ఎక్కువే..

ఇతర పాల పదార్థాల్లానే పెరుగులోనూ క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది. ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్‌ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.

ఒత్తిడికి దూరంగా..

కొన్ని సందర్భాల్లో చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కప్పు పెరుగు తిని చూడండి. అది ఒత్తిడిని సులువుగా తగ్గించేస్తుంది. మానసిక సాంత్వనను కూడా అందిస్తుంది. అలాగే బరువు సైతం అదుపులో ఉంటుంది.

* ప్రతిరోజూ పెరుగు తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు చాలామటుకు అదుపులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్