Published : 01/04/2023 19:29 IST

Finger Millet: అందుకే ఆహారంలో రాగులు ఉండాల్సిందే!

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. ఇందులో ముఖ్యంగా రాగులు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలు చిరుధాన్యాల వైపు మొగ్గేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందుకే ఈ ఏడాదిని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా జరుపుకొంటున్నాం. ఈ క్రమంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) రాగుల వల్ల శరీరానికి లభించే ప్రయోజనాల గురించి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో రాగుల వల్ల కలిగే ప్రయోజనాలేంటి? రాగులతో ఎలాంటి వంటకాలు చేసుకోవచ్చో తెలుసుకుందామా...

చాలామంది రాగులు అనగానే పాత పద్ధతిలో జావ లాగా తీసుకోవాలనుకుంటారు. కానీ రాగులతో కూడా వివిధ రకాల వంటకాలు చేసుకోవచ్చు. కొంతమంది వీటిని ఇడ్లీ, దోశల రూపంలో తీసుకుంటారు. అయితే ఇవే కాకుండా రాగులతో మరిన్ని రెసిపీలు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. రాగులతో లడ్డూ, కేక్‌, హల్వా, పూరీలు, పరోటాలు మొదలైనవి చేసుకోవచ్చు. రాగుల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు.

ఎముకల దృఢత్వానికి...

రాగుల్లో క్యాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎంత క్యాల్షియం లభిస్తుందో.. రెండు రాగి దోశలను తీసుకోవడం వల్ల అంతే క్యాల్షియం శరీరానికి అందుతుందని చెబుతున్నారు నిపుణులు. క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. అలాగే దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. అందుకే ఎదిగే పిల్లలకు రాగులను క్రమం తప్పకుండా ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాగే వయసు మళ్లిన వారు కూడా రాగులను తీసుకోవడం ద్వారా ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.

ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే..

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులు, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడమేనని అంటున్నారు నిపుణులు. అయితే ఇలాంటి వారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. ఎందుకంటే 100 గ్రాముల రాగుల్లో కేవలం 1.9 గ్రాములు మాత్రమే కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఫైబర్‌ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. దానివల్ల రాగులు కొద్ది మొత్తంలో తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలన్న కోరిక కలగదు. అదే సమయంలో శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.

మధుమేహులకు...

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న మరో సమస్య మధుమేహం. మన దేశంలో ప్రతి 11 మందిలో ఒకరు మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ముందురోజుల్లో మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి రాగులు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ‘గ్లైసెమిక్‌ ఇండెక్స్‌’ తక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తంలోని గ్లూకోజు స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి, మధుమేహం సమస్యతో బాధపడేవారికి రాగులు మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులకు...

రాగుల్లో క్యాల్షియంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ కూడా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 34.7 మైక్రోగ్రాముల ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది గర్భిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగుల్లో ఉండే మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్‌, అమైనో ఆమ్లాలు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు.

అందానికి..

రాగులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్‌ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి వార్ధక్య ఛాయలను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు. అలాగే వీటిలో ఉండే మిథయనిన్ అనే అమైనో ఆమ్లాలు చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయని చెబుతున్నారు. ఫలితంగా చర్మ కణజాలాలు సజీవంగా ఉండి చర్మం ముడతలు పడకుండా చేస్తుందని అంటున్నారు.

రాగుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా..! అలాగని వీటిని మరీ ఎక్కువగా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి కానీ, ప్రత్యామ్నాయ ఆహారంగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని