Published : 13/01/2023 20:49 IST

నెయ్యి విషయంలో ఆ సంకోచం వద్దు..!

సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు.. నోరూరించే పిండివంటలు. ఇక స్వీట్స్ అంటే నెయ్యి లేకుండా కష్టమే..! అయితే దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పెరిగి లావవుతామేమోనని కొందరు, గుండెకు మంచిది కాదని మరికొందరు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని ఇంకొందరు.. ఇలా నెయ్యంటే భయపడుతుంటారు. తినాలని ఉన్నా సరే.. నోరు కట్టేసుకుంటారు.. కానీ వివిధ పోషకాల సమ్మేళనమైన నెయ్యి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అందుకే పండగలు, ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. రోజువారీ ఆహారంలో సైతం నిస్సంకోచంగా నెయ్యిని భాగం చేసుకోవచ్చంటున్నారు.

పోషకాలెన్నో..!

నెయ్యి వివిధ రకాల పోషకాల సమ్మేళనం. ఇందులోని ఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.

నరాల పనితీరుకు..

శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాల స్థాయులు తగ్గిపోవడం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. ఈ రెండు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటి వాటిలో అతి ముఖ్యమైంది నెయ్యి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే ఈ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. తద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి నెయ్యిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం.

అరుగుదలకు..

నెయ్యి వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం మరింత సులభంగా అరుగుతుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. నెయ్యి జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల ఆమ్లాలు విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి నెయ్యి తింటే అరగదు అన్న అపోహను తొలగించుకొని దీన్ని రోజూ ఆహారంతో పాటుగా తీసుకుంటే మంచిది.

పెదాలు పగిలితే..

నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చలికాలంలో చాలామందికి పెదాలు పగిలి.. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు కాస్త నెయ్యిని తీసుకొని దాంతో పెదాలపై కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. పెదాలు మాత్రం మృదువుగా మెరుస్తూ ఉంటాయి.

అయితే నెయ్యి ఆరోగ్యానికి మంచిదన్నారు కదా.. అని మరీ ఎక్కువగా తీసుకుంటే లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకున్నవారవుతారు. కాబట్టి రోజుకు రెండు టీస్పూన్ల నెయ్యిని తీసుకుంటే అటు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండడంతో పాటు ఇటు దాని నుంచి అన్ని రకాల ప్రయోజనాల్నీ పొందచ్చు. అలాగే గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం.. వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. వారి సమస్య స్థాయిని బట్టి నెయ్యి వినియోగాన్ని తగ్గించడం లేదంటే డాక్టర్ సలహా మేరకు ఉపయోగించడం మంచిది. అలాగే నెయ్యిలో కూడా కల్తీ జరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వినియోగించేలా జాగ్రత్తపడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని