మామిడి పళ్లు.. రుచికే కాదు.. ఆరోగ్యానికీ!

మామిడి పళ్లంటే మీకు మహా ఇష్టమా? ఈ సీజన్లో మిస్సవ్వకుండా వాటిని తింటున్నారా? వెరీ గుడ్..! అయితే వాటి రుచి గురించి తెలిసిన మీకు.. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

Published : 03 Jun 2024 12:07 IST

మామిడి పళ్లంటే మీకు మహా ఇష్టమా? ఈ సీజన్లో మిస్సవ్వకుండా వాటిని తింటున్నారా? వెరీ గుడ్..! అయితే వాటి రుచి గురించి తెలిసిన మీకు.. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

మెరుగయ్యే కంటి చూపు...

ఆహారంలో భాగంగా మనం తీసుకునే ఒక్కో విటమిన్ వల్ల ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. వీటిలో విటమిన్ ‘ఎ’ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్‌ మామిడి పండ్లలో పుష్కలంగా లభిస్తుంది. ఒక కప్పు మామిడి పండ్ల ముక్కల నుంచి దాదాపు 25 శాతం రోజుకు సరిపడా విటమిన్ ‘ఎ’ శరీరానికి అందుతుంది. ఫలితంగా కళ్లు పొడిబారటం వంటి సమస్యలు దూరమై.. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఐరన్ కోసం...

కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతుంటారు. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఐరన్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోమని సూచిస్తారు నిపుణులు. ఈ పోషకం ఎక్కువగా ఉండే మామిడి పండ్లను కూడా గర్భిణులు తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే అది కూడా డాక్టర్ల సలహా మేరకు, మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్లే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే వాళ్లకూ మామిడి పండ్లు మంచి ఆహారం అని చెప్పచ్చు.

జీర్ణశక్తికి..

జీర్ణశక్తిని పెంపొందించడానికి మామిడి పండ్లు మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు, ఫైబరే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఎంజైమ్‌లు మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లను విచ్ఛిత్తి చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తాయి. అలాగే ఫైబర్‌ కూడా అరుగుదలను ప్రేరేపిస్తుంది. తద్వారా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలేవీ తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

ఇమ్యూనిటీ పెరుగుతుంది..

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటేనే అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇందుకు ఈ సీజన్లో లభించే మామిడి పండ్లు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. విటమిన్‌ ‘ఎ’, ‘సి’తో పాటు ఈ పండ్లలో ఉండే కెరోటినాయిడ్స్‌ రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచడంలో సహకరిస్తాయి.

వీటితో పాటు వివిధ రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో, ముఖ వర్చస్సును పెంచడంలోనూ మామిడి పండ్లు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అయితే ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు చేకూరినా వీటిని మితంగా తినడమే మేలంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్