అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే!
వేసవికాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. అలాగని ఏమీ తినకపోతే నీరసం ఆవహిస్తుంది.. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా మనం హుషారుగా పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేలా ఉండాలి. ఇందుకు సరైన ఎంపిక చిరుధాన్యాలతో...
వేసవికాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. అలాగని ఏమీ తినకపోతే నీరసం ఆవహిస్తుంది.. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా మనం హుషారుగా పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేలా ఉండాలి. ఇందుకు సరైన ఎంపిక చిరుధాన్యాలతో చేసిన జావ. ఇది సులువుగా అరుగుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. కావాల్సిన పోషకాలనూ అందిస్తుంది...
జావ అంటే ఏదో కొంచెం నీళ్లలో రాగిపిండి వేసుకుని తీసుకోవడం కాదు. మరెలా అంటారా? రోగనిరోధక శక్తిని పెంచి తక్షణ శక్తిని అందించే ఈ జావను ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావాల్సినవి:
బియ్యం- అరకేజీ, పెసలు- పావుకేజీ, మొలకెత్తిన రాగులు- 100 గ్రా., గోధుమలు- 50 గ్రా., ఓట్స్- 50 గ్రా., బార్లీ- 25 గ్రా., సోయా గింజలు- 25 గ్రా.
తయారీ:
బియ్యం, పెసలు, రాగులు, గోధుమలు, బార్లీ, సోయాగింజలు.. వీటన్నింటినీ విడివిడిగా వేయించాలి. ఓట్స్‌ను వేయించనవసరం లేదు. తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో ఒకటికి నాలుగువంతుల నీళ్లు పోసుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి దించేయాలి. ఇందులో ఉడికించిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే కాస్త నెయ్యి కూడా జత చేయొచ్చు.
ప్రయోజనాలెన్నో!
⚛ ఈ జావలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది.
⚛ తక్షణ శక్తి అందుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. బరువును తగ్గిస్తుంది కూడా.
⚛ దీంట్లో అమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ట్రిప్టోపెన్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
⚛ ఈ జావలో క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్ బి, పీచు, మాంసకృత్తులు ఉంటాయి. 25 గ్రాముల పొడితో తయారుచేసిన జావను తీసుకున్నా కావాల్సిన శక్తి అందుతుంది. రెండు గంటలపాటు ఆకలి వేయదు. డైటింగ్‌లో భాగంగా రాత్రిపూట దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు.
⚛ ఈ జావ త్వరగా జీర్ణమవుతుంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి మంచి ఆహారం. అన్ని వయసుల వాళ్లు, మధుమేహ బాధితులు దీన్ని తీసుకోవచ్చు.
⚛ జావ కాస్త కారంగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.