Published : 24/11/2022 21:16 IST

కిస్‌మిస్‌తో కొండంత ఆరోగ్యం..!

ఇంట్లో పాయసం, పరమాన్నం.. వంటివి చేసినప్పుడు అందులో కిస్‌మిస్‌ వేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వీటిని తింటే బరువు పెరుగుతామోనన్న భయం కూడా కొందరిలో ఉంటుంది. కానీ మితంగా తింటే కిస్‌మిస్‌ వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా..

⚛ పోషకాలు మెండుగా ఉండే ఆహార పదార్థాల్లో కిస్‌మిస్‌ కూడా ఒకటి. శరీర కణాల్లో ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరగాలంటే ప్రొటీన్లు అవసరం. ఇవి అందాలంటే మనం రోజూ కిస్‌మిస్‌ తినాల్సిందే. ఇందులో ఐరన్‌ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల హెమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. దీంతోపాటు వీటిలో పొటాషియం, ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

⚛ ఆకలిగా లేదా కాస్త అలసటగా ఉన్నప్పుడు వీటిని తింటే తక్షణ శక్తిని పొందచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్లు, సహజసిద్ధమైన చక్కెరలు పుష్కలంగా ఉండడమే దీనికి కారణం. ఎక్కువగా వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నవారు కిస్‌మిస్‌ను తీసుకోవడం వల్ల అతిగా అలసిపోకుండా ఉండడమే కాకుండా శక్తిని కోల్పోకుండా ఉంటారు.

⚛ ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి ‘బోరాన్‌’ అనే పదార్థం చాలా అవసరం. ఇది కిస్‌మిస్‌లో లభ్యమవుతుంది. ఎముకలకు దృఢత్వాన్ని అందించడంతో పాటు వాటికి సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడంలో కిస్‌మిస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఎదురయ్యే ‘ఆస్టియోపొరోసిస్‌’ సమస్యను నివారించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

⚛ దంతక్షయం, పళ్లు పుచ్చిపోవడం, పెళుసుబారడం.. వంటి సమస్యలకు చెక్‌ పెట్టాలంటే కిస్‌మిస్‌ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. కిస్‌మిస్‌లో ఉండే ఔషధ గుణాలు నోట్లో చేరే బ్యాక్టీరియాను నిర్మూలించి, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

⚛ కిస్‌మిస్‌లో ఉండే విటమిన్‌ ‘ఎ’, బీటా కెరోటిన్‌, బీటా కెరోటినాయిడ్‌.. వంటి పోషకాల ప్రభావం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బయాటిక్‌ లక్షణాల కారణంగా ఇది వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడి జ్వరం వంటి ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని