అందుకే.. సాంబార్‌ మంచిదట..!

భారతదేశంలో అది కూడా ముఖ్యంగా దక్షిణాదిలో సాంబార్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.. దీని రుచి అలాంటిది మరి.. అంతటా పాకిపోయి అందరినీ తన దాసులుగా చేసేసుకుందీ వంటకం. కేవలం రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది....

Updated : 24 Mar 2022 18:10 IST

భారతదేశంలో అది కూడా ముఖ్యంగా దక్షిణాదిలో సాంబార్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.. దీని రుచి అలాంటిది మరి.. అంతటా పాకిపోయి అందరినీ తన దాసులుగా చేసేసుకుందీ వంటకం. కేవలం రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది సాంబార్. అందుకే ఓ సినిమాలో నటి 'సాంబార్‌తో ఏమి చేసినా మంచిగనే ఉండును..' అంటుంది. మరి ఇంతకీ సాంబార్ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

మరాఠాల వంటగదిలో..

సాంబార్ అనగానే దక్షిణాదికి చెందిన వంటకం అనుకుంటాం. కానీ అది మొదట పుట్టింది తంజావూరు మరాఠాల వంటగదిలో అన్న విషయం మీకు తెలుసా? పదిహేడో శతాబ్దంలో మరాఠా రాజైన షాహూజీ వంటగదిలో పుట్టిందీ వంటకం. అప్పటికే ఉన్న అమ్తి అనే వంటకానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి సాంబార్‌ని తయారుచేశారట. అందులో వేసే పెసరపప్పుకి బదులుగా కందిపప్పు, కోకమ్ జ్యూస్కి బదులుగా చింతపండు రసం వేసి ప్రయోగం చేసి చూశాడా వంటవాడు. వంటకం రుచి అద్భుతంగా వచ్చింది. దాన్ని ఆరోజు తమ ఆస్థానానికి అతిథిగా వచ్చిన సంభాజీ భోస్లేకి వడ్డించి.. ఆయన పేరును బట్టి సాంబార్ అని పేరు పెట్టారట. అప్పటి నుంచి ఇది బాగా పాపులరైంది. తమిళంలో చాంపు అంటే మెత్తని పేస్ట్ చేయడం అన్నమాట. చంపారం అంటే కారంగా ఉన్న మసాలాలు.. మసాలాలను పొడి చేసి దాంతో తయారుచేస్తారు కాబట్టి దీన్ని 'చంపార్' అనేవారని.. అదే సాంబార్‌గా మారిందని మరో వాదన కూడా ఉంది. వాస్తవం ఏదైనా ఇంత అద్భుతమైన వంటకాన్ని కనిపెట్టిన ఆ వంటవాడిని మెచ్చుకోకుండా ఉండలేం.

ప్రొటీన్ అందుతుంది..

సాంబార్‌లో ముఖ్యంగా కందిపప్పు, శెనగ పప్పు వంటివి కలుపుతుంటారు. పప్పుల ద్వారా మన శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ అందుతుంది. అయితే ఎప్పుడూ ఒకే రకం కాకుండా వివిధ రకాల పప్పులతో చేసిన సాంబార్‌ని ఆహారంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల అమైనో ఆమ్లాలు మన శరీరానికి అందుతాయి. లేదంటే అన్నిరకాల పప్పులను కలిపిన మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. కంది పప్పు, శెనగ పప్పు, పెసర పప్పు వంటివన్నీ ఒక్కో కప్పు చొప్పున తీసుకొని ఒక మిశ్రమంగా చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని అవసరమైనప్పుడల్లా తీసుకొని సాంబార్ చేసుకోవచ్చు. దీనివల్ల పప్పులన్నింటి నుంచి దాదాపు అన్ని రకాల అమైనో ఆమ్లాలు శరీరంలోకి చేరతాయి కాబట్టి ప్రొటీన్ లోపం లేకుండా జాగ్రత్తపడచ్చు.

ఫైబర్ కూడా..

సాంబార్ తయారీలో బంగాళాదుంప, సొరకాయ, ములక్కాడలు, బెండకాయలు, వంకాయలు వంటి కూరగాయలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. వీటన్నింటి వల్లా మన శరీరానికి ఎక్కువ మొత్తంలో ఫైబర్ అందుతుంది. రోజూ పీచుపదార్థాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాంబార్‌లో ఎక్కువ శాతం నీరే ఉంటుంది కాబట్టి ఇది మన జీర్ణవ్యవస్థలో వేగంగా కదులుతుంది. దీనిలోని పీచుపదార్థం జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది కాబట్టి మలబద్ధకం లేకుండా జాగ్రత్తపడచ్చు. పిల్లలు కూరగాయలు తినడానికి ఆసక్తి చూపించకపోతే వాటిని ఉడికించి గుజ్జుగా చేసి, సాంబార్‌లో వాటన్నింటినీ కలపొచ్చు. దీనివల్ల వారి జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

బరువును తగ్గిస్తుంది..

సాంబార్‌లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం కూరగాయలు, పప్పులలో ఉన్న కార్బోహైడ్రేట్లు మాత్రమే దీని ద్వారా మనకు లభిస్తాయి. ఇవన్నీ మనకు ఉపయోగపడేవే.. గ్త్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారపదార్థమైన సాంబార్‌ని తీసుకుంటే ఇట్టే బరువు తగ్గే వీలుంటుంది. సాంబార్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని కొద్దిగా తీసుకోగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రొటీన్, ఫైబర్ కూడా సరైన మోతాదులో ఉండడం వల్ల దీన్ని తీసుకుంటే కొన్ని గంటల వరకూ తిరిగి ఆకలి వేసే అవకాశమే ఉండదు.  అందుకే ఉదయం ఇడ్లీ సాంబార్, మధ్యాహ్నం సాంబారన్నం (బ్రౌన్ రైస్) తీసుకోవడం వల్ల ఇటు రుచికరమైన ఆహారం తింటూనే అటు బరువు తగ్గే వీలు కూడా ఉంటుంది. ఇది మధుమేహంతో బాధపడే వారికి సైతం చక్కటి ఆహారం. 

చూశారుగా.. సాంబార్ వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో.. ఎంతైనా 'సాంబార్.. సాంబార్‌దా..' మరి, మీరూ సాంబార్‌ని మీ రోజువారీ మెనూలో చేర్చుకుంటారుగా..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్