Published : 10/04/2022 14:21 IST

నవమి నైవేద్యంతో మేలైన ఆరోగ్యం!

కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పదార్థాల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ క్రమంలో వీటి తయారీ విధానం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

బెల్లం పానకం..

కావాల్సిన పదార్థాలు

* బెల్లం - ఒక కప్పు

* నీరు - నాలుగు కప్పులు

* మిరియాల పొడి - చెంచా

* యాలకుల పొడి - అర చెంచా

* అల్లం పొడి - పావు చెంచా

తయారీ విధానం

ముందుగా నీటిలో బెల్లాన్ని వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం పొడి.. మొదలైన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తియ్యతియ్యటి బెల్లం పానకం రడీ..!

ఆరోగ్యానికి మేలు!

మీకు తెలుసా..! నైవేద్యానికి నవగాయ పిండివంటలు లేకపోయినా, అవి వండడానికి ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లో చిన్న బెల్లం ముక్క ఉంటే చాలంటారు పెద్దలు. బెల్లంతో చేసిన వంటకాలతో దేవతలు సైతం తృప్తి చెందుతారట. అంతటి విశిష్ట స్థానం ఉంది మరి దీనికి. అందుకే దాదాపు ప్రతి పండక్కీ తయారు చేసే నైవేద్యంలో బెల్లాన్ని ఉపయోగిస్తాం. దీనివల్ల కేవలం నోటికి రుచే కాకుండా.. అనేక రకాల పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

* బెల్లం వివిధ రకాల పోషకాలకు నిలయం. ఇందులో అనేక ఖనిజాలు దాగి ఉన్నాయి.. ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, శరీర ఎదుగుదలకు కావలసిన ఇతర ఖనిజాలు కూడా బెల్లం నుంచే మనకు లభిస్తాయి.

* శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి.. వెంటనే అలసట మటుమాయమైపోతుంది.

* బెల్లంలో ఇనుము శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.

* ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ వల్ల కణజాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడతాయి.

* బెల్లం సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేసి శ్వాసకోస గ్రంథులు, వూపిరితిత్తులు, పొట్ట.. వంటి శరీర భాగాలను శుభ్రపరుస్తుంది.


వడపప్పు

కావాల్సిన పదార్థాలు

* పెసరపప్పు - ఒక కప్పు

* తురిమిన కొబ్బరి - మూడు చెంచాలు

* చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చిమిర్చి - కొన్ని

* నిమ్మరసం - చెంచా

* ఉప్పు - రుచికి తగినంత

* కొత్తిమీర - అలంకరణ కోసం

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును అరగంట పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులో పైన చెప్పిన ఇతర పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. వడపప్పు రడీ!

ప్రయోజనాలు

* పెసరపప్పులో శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమయ్యే విటమిన్ ఎ, బి, సి, ఇ; క్యాల్షియం, పొటాషియం, ఐరన్.. వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

* బరువు తగ్గాలనుకునే వారికి పెసరపప్పు మంచి ఆహారం. ఇందుకు కారణం దీనిలో తక్కువ మోతాదులో ఉండే కొవ్వు పదార్థాలే. అలాగే పెసరపప్పులో అధికంగా ఉండే ప్రొటీన్, ఫైబర్.. వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించేందుకు సహకరిస్తాయి.

* ఈ పప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.

* జీర్ణవ్యవస్థను పటిష్ట పరచడానికి, మధుమేహం రాకుండా నివారించడానికి పెసరపప్పు బాగా తోడ్పడుతుంది.

అలాగే బియ్యప్పిండి, బెల్లం నీటిలో కలిపి చలిమిడిని తయారు చేస్తారు. ఇవన్నీ వేడిని తగ్గించేవే.. అందుకే వేసవి తాపానికి గురికాకుండా ఉండేందుకు వీటిని సేవిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని