అరచేతుల్లో విరబూసే గోరింట.. అందానికి.. ఆరోగ్యానికీ!

'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించేందుకు ఆషాఢ, భాద్రపద, ఆశ్వయుజ మాసాల్లో గోరింటాకు పెట్టుకోవడం తెలిసిందే. వీటిలో అట్లతద్ది చివరిది. వాతావరణ మార్పుల...

Updated : 12 Oct 2022 16:17 IST

'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించేందుకు ఆషాఢ, భాద్రపద, ఆశ్వయుజ మాసాల్లో గోరింటాకు పెట్టుకోవడం తెలిసిందే. వీటిలో అట్లతద్ది చివరిది. వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి.. ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంతేకాదు.. దీనిలో పలు ఆరోగ్య రహస్యాలు సైతం దాగున్నాయని చెబుతున్నారు నిపుణులు.

ఈ సమస్యలకు చెక్..

✬ కాలేయ సంబంధిత సమస్యల్ని నివారించడానికి, కామెర్ల వ్యాధి చికిత్సకు గోరింటాకు చెట్టు బెరడును ఉపయోగిస్తారు.

✬ చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది.

✬ గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల.. ఇది శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

✬ కొంతమంది చేతులు నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల గోళ్లలో పుండ్లలా తయారవుతుంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది.

✬ గాయాలైనప్పుడు, ఆటలమ్మ వ్యాధి సోకినప్పుడు శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి కూడా గోరింటాకు మంచి ఔషధంగా పని చేస్తుంది.

✬ పూర్వకాలంలో గోరింటాకును వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వాడేవారు. ఉదాహరణకి.. తలనొప్పి, కడుపునొప్పి, కాలిన గాయాలు.. ఇలా ఏ సమస్య అయినా సరే.. ఆ ప్రదేశంలో గోరింటాకు పేస్ట్‌ను రాసేవారు.. దీంతో క్రమంగా నొప్పి క్షీణించి సమస్య తగ్గిపోయేది. ఇది సహజసిద్ధమైంది కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.

✬ శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలోనూ గోరింటాకు తోడ్పడుతుంది.

ఆరోగ్యవంతమైన జుట్టుకు..

✬ కొంతమందికి జుట్టు బాగా వూడిపోతుంటుంది. మరి, ఈ సమస్యను దూరం చేసి కొత్త జుట్టు రావడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది. దీనికోసం ఆవనూనెలో గోరింటాకు వేసి వేడిచేయాలి. తర్వాత వడకట్టగా వచ్చిన నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు మళ్లీ పెరగడం మొదలవుతుంది.

✬ నెలకోసారి గోరింటాకుతో తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే వెంట్రుకలు మెరుపు, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. చుండ్రు సమస్య కూడా దరిచేరదు.

✬ జుట్టు ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే.. గోరింటాకు పేస్ట్‌ను తలకు పట్టించి అది ఆరేవరకు అంటే కనీసం మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో కడిగేసి.. జుట్టును పొడిగా ఆరబెట్టుకోవాలి. పడుకునే ముందు జుట్టుకు ఆయిల్ రాసుకుని, మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ అప్త్లె చేసుకుంటే సరి.. దీంతో జుట్టుకు మంచి రంగు, మెరుపు వస్తాయి.


గోరింట ఎర్రగా పండాలంటే...!

✬ గోరింటాకుని రుబ్బేటప్పుడు కొంచెం చక్కెర, రెండు లవంగాలు వేయాలి. రుబ్బిన తర్వాత ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి పక్కన పెట్టాలి. ఓ అరగంట అయ్యాక గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.

✬ అలాగే పెట్టుకున్న గోరింటాకు ఆరిపోయిన తర్వాత చక్కెర నిమ్మరసం కలిపిన మిశ్రమంలో ముంచిన దూదితో చేతిపైన అద్దాలి. అదేవిధంగా పెనంపై కొద్దిగా ఇంగువ వేడి చేసి, ఆ పొగను చేతులకు తగలనిచ్చినా గోరింటాకు ఎర్రగా పండుతుంది.

✬ ఇక గోరింటాకు తీసేశాక లవంగ నూనెను చేతికి రాసుకోవడం వల్ల కూడా చక్కగా పండుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్