ఆరోగ్య యోగానికి...

ఆఫీసులో ఆమె బాస్‌ కావొచ్చు... ఇంట్లో మాత్రం అమ్మే! బయట ఆమె గొప్ప వ్యాపారవేత్త కావొచ్చు... ఇంట్లో అన్నిపనులూ ఒంటిచేత్తో చక్కబెట్టుకొనే భార్యనే. ఇలా మల్టీటాస్క్‌లు చేస్తాం కాబట్టే మనమొక చోటుంటే... మనసు ఇంట్లో పిల్లల చుట్టూనో, సాయంత్రం చేయబోయే వంట చుట్టూనో తిరుగుతుంది. ఆఫీస్, ఇల్లూ... కెరియర్, వ్యక్తిగత జీవితం వీటిని బ్యాలెన్స్‌ చేయలేక ఒత్తిడితో సతమతమైపోతుంటాం

Published : 21 Jun 2024 04:30 IST

ఆఫీసులో ఆమె బాస్‌ కావొచ్చు... ఇంట్లో మాత్రం అమ్మే! బయట ఆమె గొప్ప వ్యాపారవేత్త కావొచ్చు... ఇంట్లో అన్నిపనులూ ఒంటిచేత్తో చక్కబెట్టుకొనే భార్యనే. ఇలా మల్టీటాస్క్‌లు చేస్తాం కాబట్టే మనమొక చోటుంటే... మనసు ఇంట్లో పిల్లల చుట్టూనో, సాయంత్రం చేయబోయే వంట చుట్టూనో తిరుగుతుంది. ఆఫీస్, ఇల్లూ... కెరియర్, వ్యక్తిగత జీవితం వీటిని బ్యాలెన్స్‌ చేయలేక ఒత్తిడితో సతమతమైపోతుంటాం. యోగ సాధనతో వీటిని సమన్వయం చేసుకుంటూనే, బోనస్‌గా ఫిట్‌నెస్‌ని కూడా సొంతం చేసుకోవచ్చు అంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు. అదెలా అంటే... 

హార్మోన్లని అదుపులో ఉంచి.. 

న జీవితం మన చేతుల్లో కన్నా హార్మోన్ల పనితీరుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందేమో! బాల్యాన్ని విడిచిపెడితే మొదటి సారి నెలసరి వచ్చింది మొదలు... లైంగిక జీవితంలో, ప్రెగ్నెన్సీ సమయంలో... మెనోపాజ్‌లో హార్మోన్ల పాత్రే కీలకం. నెలసరి దగ్గర పడుతున్నప్పుడు... అకారణంగా బాధపడతాం, ఇట్టే చికాకుపడతాం. ఈ మూడ్‌ స్వింగ్స్‌కితోడు కడుపుబ్బరం, సెన్సిటివ్‌గా మారే చర్మం. ఇవన్నీ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్లే జరుగుతాయి. ఈ హార్మోన్ల సమతుల్యత సాధించడానికి యోగాని మించిన వ్యాయామం లేదు. భుజంగాసనం, ఉష్ట్రాసనం, బాలాసనం, మత్య్సాసనం, యోగనిద్ర వంటి తేలికపాటి ఆసనాలు ఇందుకు ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా చేయగలిగితే థైరాయిడ్, పీసీఓఎస్‌ వంటి సమస్యల్నీ తేలిగ్గా నయం చేసుకోవచ్చు. 

మత్య్సాసనం: గాఢంగా ఊపిరి తీసుకోవడానికి ఉపకరించే ఈ ఆసనం... పీయూష గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఆ ఆసనంలోనే ఉండి వెనక్కి వంగుతూ వెల్లకిలా పడుకోవాలి. తరవాత మోచేతులని నేలపై దన్నుగా ఉంచి వీపుని పైకి లేపి, తలని నేలకి తాకించాలి. చేతులతో కాలిబొటనవేళ్లని పట్టుకోవాలి. శ్వాసమీద ధ్యాస ఉంచి వీలైనంత సేపు ఈ ఆసనంలో ఉండి, నిదానంగా సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనంతో పైన చెప్పిన ప్రయోజనంతో పాటు వ్యాధినిరోధకశక్తీ పెరుగుతుంది. ఆస్తమా వంటి సమస్యలుంటే తగ్గుతాయి.


బరువుని అదుపు చేసి...

 

హార్మోన్ల తరవాత మనల్ని వేధించే మరో ముఖ్యమైన సమస్య... అధిక బరువు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ నివేదికల ప్రకారం పట్టణాల్లో ఉంటున్న మహిళల్లో 23 శాతం మంది ఊబకాయంతో ఇబ్బందిపడుతున్నారు. తక్కిన వ్యాయామాలతో పోలిస్తే యోగాతో 92 శాతం మంది మహిళలు సరైన ఫలితాలని అందుకున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. సూర్య నమస్కారాలతోపాటు వీరభద్రాసనం, త్రికోణాసనం, నౌకాసనం, భుజంగాసనం, సర్వాంగాసనం వంటివి బరువుని తగ్గించుకోవడానికి ఉపకరిస్తాయి.

భుజంగాసనం: ఈ ఆసనం పాముని పోలి ఉంటుంది కాబట్టే దీన్ని భుజంగాసనం అంటారు. బోర్లాపడుకుని కాళ్లు చాచి నేలకి ఆనించి ఉంచాలి. కాలిమడమలని దగ్గరగా ఉంచి... కాళ్లను వెనక్కి స్ట్రెచ్‌ చేసి ఉంచాలి. చేతులని ఛాతీకి ఇరుపక్కలా ఉంచి శ్వాస తీసుకుంటూ తలనిపైకెత్తి, వీలైనంత వెనక్కి స్ట్రెచ్‌ చేయాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి... సాధారణ స్థితికి రావాలి. ఇలా కనీసం పదిసార్లయినా చేయాలి. ఈ ఆసనం పొట్ట దగ్గర కొవ్వుని సులభంగా తగ్గిస్తుంది. పొత్తికడుపు దగ్గర కండరాలకి వ్యాయామం అందించి నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. దీంతోపాటు రెడీటూఈట్‌ ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. 


సంతాన సాఫల్యత కోసం... 

నేక సమస్యలకు మనలోని ఒత్తిడే మూలకారణం. ఆ ఒత్తిడిని తగ్గించి... సంతాన సాఫల్యతని పెంచే శక్తి యోగాకు ఉంది. మన జీవనశైలిని కొద్దిగా మార్పు చేసుకుని యోగా సాధనకి కాసింత సమయం కేటాయిస్తే చాలు. మార్జాలాసనం, మండూకాసనం, మాలాసనం, సేతుబంధాసనం, సర్వాంగాసనం, భుజంగాసనం, వీరభద్రాసనం, అధోముఖశ్వానాసనం, బాలాసనం వంటివి ఉపకరిస్తాయి. 

మార్జాలాసనం: ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. శరీరాన్ని ముందుకు వంచుతూ మోకాళ్లూ, అరచేతులని నేలకు ఆనించాలి. అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటికి సమాంతరంగా ఉండాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ నడుముని వీలైనంత పైకిలేపాలి. తలని కొద్దిగా కిందకి దింపాలి. కాసేపు అలానే ఉండి... ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నడుముని కిందకి దింపాలి. తలని పైకి ఎత్తాలి. ఇలా ఐదారుసార్లు చేయాలి. ఈ ఆసనాలతోపాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం చేస్తే ఉపయోగం. ఏకాగ్రతతోపాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
ముద్రలు, ప్రాణాయామాలు, ఆసనాలు వేటికవే ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మనం చేయాల్సిందల్లా మనసు పెట్టడం, సమయం కేటాయించి యోగసాధన చేయడమే... 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్