నిద్రలో చెమటలు పడుతున్నాయా?
వేడి వాతావరణం, గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడం, ఒంట్లో వేడి ఎక్కువగా ఉండడం.. ఇలాంటప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం. అయితే కొంతమందికి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రుళ్లు నిద్రలో...
వేడి వాతావరణం, గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడం, ఒంట్లో వేడి ఎక్కువగా ఉండడం.. ఇలాంటప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం. అయితే కొంతమందికి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రుళ్లు నిద్రలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. చిన్న సమస్యే కదా అని చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది వివిధ రకాల అనారోగ్యాలకు సంకేతమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సమస్య తీవ్ర రూపం దాల్చకముందే మేల్కొని వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమమని చెబుతున్నారు. మరి, ఇంతకీ రాత్రుళ్లు ఉన్నట్లుండి చెమటలు ఎందుకు పడతాయి? తెలుసుకుందాం రండి..!
ఇవి కారణం కావచ్చు!
రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే కొన్ని ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు.
హైపర్ థైరాయిడిజం
థైరాయిడ్ గ్రంథి జీవక్రియలతో పాటు ఇతర శారీరక విధులు నిర్వర్తించడంలో సమర్థంగా పనిచేస్తుంది. అయితే ఇది అత్యంత చురుగ్గా మారినప్పుడు హైపర్ థైరాయిడిజం బారిన పడతాం. ఫలితంగా శరీరం వేడికి తట్టుకోలేక చెమటలు పడుతుంటాయి.
ఒత్తిడి/ఆందోళన
ఉన్నట్లుండి ఒక్కోసారి ఒత్తిడి, ఆందోళనలకు గురవుతాం. వాటి ప్రభావం మెదడు, శరీరంపై పడుతుంది. నిద్రలో చెమటలు పట్టడానికి ఇదీ ఓ కారణమే!
మానసిక రుగ్మతలు
కొన్ని రకాల మానసిక రుగ్మతలున్నప్పుడు (OCD, SAD, PTSD వంటివి) మనసులో ఒక రకమైన యాంగ్జైటీ, ఆందోళన మొదలవుతుంది. ఇది నిద్రలో చెమటలు పట్టేలా చేస్తుంది.
మెనోపాజ్
40 దాటిన మహిళల్లో రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే.. వారు మెనోపాజ్‌కు చేరువవుతున్నారనడానికి సూచనగా భావించవచ్చంటున్నారు నిపుణులు.
⚛ టీబీ/హెచ్‌ఐవీ, లుకేమియా.. వంటి సమస్యలున్నప్పుడు ఉన్నట్లుండి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంటుంది. ఇది రాత్రుళ్లు చెమటకు దారి తీస్తుంది.
⚛ యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ రెట్రోవైరల్స్, హైపర్‌టెన్షన్ మందులు వాడడం వల్ల చెమట గ్రంథుల్ని నియంత్రించే మెదడు భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా నిద్రలో చెమటలు పడుతుంటాయి.
⚛ కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు మితిమీరి తీసుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమటలు పట్టే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
అయితే రాత్రి పూట నిద్రలో చెమటలు పట్టడమనేది తరచూ తలెత్తినా, దీంతో అసౌకర్యంగా అనిపించినా ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించాలి. తద్వారా సమస్యేంటో తెలుసుకొని.. చికిత్స తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
⚛ మెనోపాజ్‌కు దగ్గరవుతున్న, మెనోపాజ్‌లో దశలో ఉన్న మహిళలు ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ క్రమంలో మసాలా, కారం.. వంటివి దూరం పెట్టాలి.
⚛ బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నిపుణుల సలహా మేరకు పోషకాహారం తీసుకుంటూనే.. వ్యాయామాలు చేయడం ముఖ్యం.
⚛ కెఫీన్, మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చాక్లెట్.. వంటి వాటిని ఎంత దూరం పెడితే అంత మంచిది.
⚛ నిద్రించే ప్రదేశం చల్లగా ఉండేలా చూసుకోవాలి. అలాగే చల్లదనాన్ని పంచే పరుపులు, దిండ్లకు ప్రాధాన్యమివ్వడం ముఖ్యం.
⚛ కొన్ని రకాల మందుల వల్ల ఈ సమస్య ఎదురవుతోందని గమనిస్తే వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర మందులేవైనా వాడచ్చేమో నిపుణుల్ని అడిగి సలహా తీసుకోవడం మంచిది.
⚛ మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకునేందుకు నచ్చిన పనులు చేయడం, ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.