కాలేయం.. పదిలంగా ఉండాలంటే..!
కాలేయం.. మన శరీర భాగాల్లో అతిముఖ్యమైన అవయవాల్లో ఒకటి. రక్తం శుద్ధి చేయడం దగ్గర్నుంచి జీర్ణక్రియ సాఫీగా సాగడం వరకు.. ఇలా వివిధ జీవ క్రియల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం ఆరోగ్యం....
కాలేయం.. మన శరీర భాగాల్లో అతిముఖ్యమైన అవయవాల్లో ఒకటి. రక్తం శుద్ధి చేయడం దగ్గర్నుంచి జీర్ణక్రియ సాఫీగా సాగడం వరకు.. ఇలా వివిధ జీవ క్రియల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ అలవాట్లు చిన్నవే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాలేయం పనితీరుపై ప్రభావం చూపిస్తాయని, తద్వారా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా కొన్ని సందర్భాల్లో మరణానికి సైతం దారి తీసే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆ అలవాట్లేంటో మనమూ తెలుసుకొని ఇకనైనా జాగ్రత్తపడదాం రండి..
మనకి ఉండే ప్రతి అలవాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని అలవాట్లు కాలేయం పనితీరుని ప్రభావితం చేయడమే కాకుండా, ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.
నిద్రలేమి..
ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రతిఒక్కరూ ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం. కానీ ప్రస్తుత లైఫ్‌స్త్టెల్ కారణంగా నిద్ర సమయం తగ్గడమో లేక గ్యాడ్జెట్స్ కారణంగా అంతరాయాలు ఏర్పడడమో.. ఇలా వివిధ కారణాల వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అయితే ఇలా సరిపడినంత నిద్ర లేకపోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి పడుతుందని, ఫలితంగా దాని పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కేవలం కాలేయం పైన మాత్రమే కాదు.. మన శరీరంలోని చాలా అవయవాల పనితీరుని నిద్రలేమి ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యానికి చాలా ఆవశ్యకం అని వైద్యులు సూచిస్తారు.
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?
మన శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడంలో కూడా కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాంటి లివర్ పనితీరు సక్రమంగా ఉండాలంటే అందుకు ఉదయాన్నే తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. కొంతమంది సమయం లేదనో.. లేక ఇతర కారణాల వల్లో ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం స్కిప్ చేస్తుంటారు. కానీ ఇది సరికాదు. పోషకాలతో నిండిన ఆహారపదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవడం తప్పనిసరి. అలాగే అల్పాహారం సమయంలో ప్రాసెస్డ్ ఫుడ్స్, టాక్సిన్లు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
ప్రతి చిన్నదానికీ మాత్రలా?
తలనొప్పి వచ్చినా సరే.. దగ్గర్లోని ఫార్మసీకి పరుగులు తీయడం.. ట్యాబ్లెట్ వేసుకోవడం.. కొంతమందికి అలవాటు. కానీ ఇలా ప్రతి చిన్న సమస్యకీ వేసుకునే మందులు కూడా కాలేయం పనితీరుని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు సూచించిన మందులు తగిన మోతాదులో వేసుకోవడమే ఉత్తమం.
విటమిన్లు అందుతున్నాయా?
బి- కాంప్లెక్స్ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో అవసరం అని అందరికీ తెలుసు. అయితే అవి తగినంత మోతాదులో శరీరానికి అందుతున్నాయో? లేదో? సరిచూసుకొని అవసరమైతే వాటికి ప్రత్యామ్నాయాలు తీసుకోవడం కూడా చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి బి విటమిన్స్ చాలా ఆవశ్యకమని వారు సూచిస్తున్నారు. అంతేకాదు.. వీగన్‌గా మారిన వారు బి12 విటమిన్ తగినంత అందుతోందో, లేదో సరిచూసుకోవడం కూడా చాలా ముఖ్యమట! ఇది ఎక్కువగా లభించే గుడ్లు, చేపలు, చీజ్, రొయ్యలు.. వంటి పదార్థాలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ప్రొటీన్లు ఎక్కువైతే..
మనం తీసుకునే ఆహారపదార్థాల్లో ప్రొటీన్స్ స్థాయులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైందట! అందుకే కేవలం ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాలే కాకుండా కార్బోహైడ్రేట్స్ కూడా మోతాదు మించకుండా తీసుకోవడం చాలా అవసరం.
ఇవి గుర్తుంచుకోండి..
⚛ మూత్రం వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఆపుకోకుండా వీలైనంత త్వరగా మూత్రవిసర్జన చేయాలి. ఫలితంగా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోవడం ద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
⚛ అతిగా ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం, వూబకాయం.. వంటి ఆరోగ్య సమస్యల బారిన పడడం సహజం. అయితే దీనివల్ల కూడా కాలేయం పనితీరు ప్రభావితం అవుతుంది.
⚛ మనం తీసుకునే ఆహారపదార్థాల్లో చక్కెర అధిక మోతాదులో ఉంటే కాలేయం సరిగ్గా పని చేయదు. కాబట్టి వీలైనంత మితంగానే చక్కెరను డైట్‌లో భాగం చేసుకోవడం మంచిది.
⚛ సరిపడినంత వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం.. వంటి కారణాలు కూడా కాలేయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.