బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే..

గర్భం ధరించినప్పటి నుంచీ బిడ్డ పుట్టే దాకా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందులో ఆహార నియమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇదే క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తల్లీ, బిడ్డా.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అలాగే బిడ్డకు పాలివ్వాలంటే తల్లికి పాలు ఉత్పత్తి కావాలి. పాల ఉత్పత్తిలో తల్లి తీసుకునే....

Published : 23 Feb 2022 21:11 IST

గర్భం ధరించినప్పటి నుంచీ బిడ్డ పుట్టే దాకా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందులో ఆహార నియమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇదే క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తల్లీ, బిడ్డా.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అలాగే బిడ్డకు పాలివ్వాలంటే తల్లికి పాలు ఉత్పత్తి కావాలి. పాల ఉత్పత్తిలో తల్లి తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

ఓట్‌మీల్..

తల్లి శరీరంలో పాలు ఉత్పత్తి కావడానికి సహకరించే పదార్థాల్లో ముఖ్యమైనది ఓట్‌మీల్‌. బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తి.. వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. అలాగే దీని ద్వారా ఎక్కువ మొత్తంలో ఐరన్‌ కూడా లభిస్తుంది. కాబట్టి అప్పుడే తయారు చేసుకున్న ఓట్‌మీల్‌కు తాజా పండ్లు, తేనె.. వంటివి కలుపుకొని తీసుకుంటే ఎక్కువ మొత్తంలో పోషకాలు శరీరానికి అందుతాయి.

బ్రౌన్‌ రైస్

తల్లుల శరీరంలో శక్తి ఉత్పత్తి కావడానికి బ్రౌన్‌ రైస్‌ ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అయితే సులభంగా జీర్ణం కావాలంటే మాత్రం వండే ముందు కొన్ని గంటల పాటు బ్రౌన్‌రైస్‌ను నానబెట్టాలి.

కోడిగుడ్డు

కోడిగుడ్డులో ఉండే పచ్చసొనలో విటమిన్‌ డి ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లి ఎముకలను దృఢంగా తయారు చేయడానికి, బిడ్డ ఎముకలు, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవడం, అలా తినాలనిపించనప్పుడు ఆమ్లెట్‌ వేసుకుని తినడం మంచిది.

సాల్మన్‌ చేపలు..

బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు సరైన మొత్తంలో పోషకాలు పొందాలంటే సాల్మన్‌ చేపల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి వారానికి రెండుసార్లు తప్పనిసరిగా దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

పాలు..

క్యాల్షియం ఎక్కువగా లభించే పాలను రోజూ తీసుకోవడం మంచిది. ఇది పాలిచ్చే తల్లులు కోల్పోయే క్యాల్షియంను తిరిగి అందించడంలో సహాయపడుతుంది. అలాగే పాలలో ఉండే ప్రొటీన్‌, ఇతర పోషకాలు బిడ్డ ఎదుగుదలకు బాగా అవసరమవుతాయి. కాబట్టి రోజూ రెండు గ్లాసుల పాలు తాగడం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

మెంతులు..

తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచే మరో ఆహార పదార్థం మెంతులు. వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్‌లు ఇందుకు సహాయపడతాయి. వీటిని రోజూ ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవడం వల్ల వీటి నుంచి బిడ్డ శరీర పెరుగుదలకు కావాల్సిన క్యాల్షియం, పీచు.. వంటి ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ పదార్థాలన్నీ ఎంత సహజసిద్ధమైనవైనా వీటిని తీసుకునే ముందు ఒకసారి డాక్టర్‌ను కూడా సంప్రదించడం ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్