Updated : 28/12/2022 19:51 IST

గర్భిణిగా ఉన్నప్పుడు పని చేస్తే..

ఆరోగ్యం సహకరిస్తే గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు తమ తమ విధుల్లో కొనసాగడం వల్ల ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

తొమ్మిది నెలల పాటు చురుగ్గా పని చేయడం వల్ల సుఖ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

ఇలా మనం ఎప్పుడూ పనిలో బిజీగా ఉండడం వల్ల లేనిపోని ఆలోచనలు మనసులోకి రాకుండా మానసికంగా దృఢంగా ఉండచ్చు.

కొంతమంది కాబోయే తల్లులు పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. అలా వారు ప్రెగ్నెన్సీ అంతా హ్యాపీగా ఉంటే.. పుట్టబోయే బిడ్డ కూడా హ్యాపీగా, యాక్టివ్‌గా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.

అలాగే ఈ సమయంలో మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు..

గర్భిణిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో మీ సొంత నిర్ణయం కాకుండా నిపుణుల సలహా మేరకే వాటిని చేయడం మంచిది. అలాగే మీ ఆరోగ్యం సహకరించకపోయినా వ్యాయామం చేసే విషయంలో మీ శరీరాన్ని అస్సలు బలవంత పెట్టద్దు. ఎందుకంటే ఇలా బలవంతంగా మీరు చేసే వ్యాయామాలు మీపై, మీ బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపచ్చు.

నెలలు నిండుతున్న కొద్దీ పెరుగుతున్న పొట్ట వల్ల అసౌకర్యం కలగచ్చు. ఈ క్రమంలో పొట్ట సపోర్ట్ కోసం గైనకాలజిస్ట్‌ సలహా మేరకు బెల్లీ బ్యాండ్‌ వాడచ్చు.

గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లోనే కాదు.. బయటికి వెళ్లినా సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్ని ధరించడానికే మొగ్గు చూపాలి. ఈక్రమంలో వదులుగా ఉండే, కాటన్‌ తరహా దుస్తులు వేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది.. అలాగే హీల్స్‌కు బదులుగా ఫ్లాట్‌గా ఉండే చెప్పులు ఎంచుకుంటే ఎలాంటి అసౌకర్యం ఉండదు.

ఖాళీ సమయాల్లో మీకు నచ్చిన పనులు చేయడం, మ్యూజిక్‌ వినడం.. వంటివి చేస్తే మనసుకు, శరీరానికి రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. అలాగే సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమే!

ఇక పని బిజీలో పడిపోయి నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా డాక్టర్ చేత చెకప్ చేయించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.

ఇలా ఈ చిట్కాలన్నీ పాటిస్తూ గర్భిణిగా ఉన్న సమయంలోనూ హ్యాపీగా తమ తమ పనుల్ని, వృత్తి ఉద్యోగాల్ని కొనసాగించచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఒకవేళ ఈ క్రమంలో మరీ అలసటగా అనిపించినా, శరీరం సహకరించకపోయినా బలవంతంగా ముందుకెళ్లడం మాత్రం అస్సలు చేయద్దంటున్నారు. తద్వారా తల్లీబిడ్డలిద్దరి మీదా దాని ప్రభావం పడుతుందట! కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని, నిపుణుల సలహా మేరకు మసలుకుంటే అటు ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేయచ్చు.. ఇటు మీ పనుల్నీ పూర్తిచేసుకోవచ్చు..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని