Weight Loss: అన్నానికి బదులుగా ఇవి!

మన భోజనంలో అన్నానిదే కీలక పాత్ర! అయితే బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే వారు, సమతులాహారానికి ప్రాధాన్యమిచ్చే వారు అన్నం తినే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం బోలెడన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.

Updated : 25 Feb 2022 20:50 IST

మన భోజనంలో అన్నానిదే కీలక పాత్ర! అయితే బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే వారు, సమతులాహారానికి ప్రాధాన్యమిచ్చే వారు అన్నం తినే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం బోలెడన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. పైగా వాటితో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు ఫిట్‌నెస్‌నూ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి, బియ్యానికి బదులు తీసుకోదగిన ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం రండి..

క్వినోవా

శరీరానికి కావాల్సిన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు క్వినోవాలో ఉంటాయి. వీటితో పాటు ప్రొటీన్‌ పుష్కలంగా లభించే ఈ ధాన్యంలో.. మెగ్నీషియం, కాపర్‌ వంటి ఖనిజాలూ మిళితమై ఉంటాయి. ఇవి ఎముక ఆరోగ్యానికి, జీవక్రియల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పైగా ఇందులో గ్లూటెన్‌ ఉండదు కాబట్టి.. శారీరక సత్తువను పెంచుకొని బరువు అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న క్వినోవాను అన్నం మాదిరిగానే వండుకోవచ్చు. ఒక గ్లాస్‌ క్వినోవాను రెండు గ్లాసుల నీటితో ఉడికించుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏ కూరతోనైనా తినొచ్చు.. లేదంటే సలాడ్‌, కిచిడీ రూపంలోనైనా తీసుకోవచ్చు.

గోధుమ రవ్వ

అల్పాహారం అనగానే మనందరికీ గోధుమ రవ్వ ఉప్మానే గుర్తొస్తుంది. నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ వంటకం.. ఇటు రుచితో పాటు అటు ఆరోగ్యాన్నీ అందిస్తుంది. అందుకే గోధుమ రవ్వను అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందులో శరీరానికి అవసరమయ్యే మెగ్నీషియం, మాంగనీస్‌, ఐరన్‌, ఫోలేట్‌, ఫైబర్‌, విటమిన్‌ బి6 పుష్కలంగా లభిస్తాయి. పైగా గోధుమ రవ్వలో క్యాలరీలూ తక్కువే! కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. దీన్ని కూడా అన్నం మాదిరిగానే ఒకటికి రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు. అన్ని రకాల కూరలతోనూ లాగించేయచ్చు.

క్యాలీఫ్లవర్‌ రైస్

వంద క్యాలరీలుండే కప్పు వైట్‌ రైస్‌తో పోల్చితే.. అదే పరిమాణంలో క్యాలీఫ్లవర్‌ రైస్‌ నుంచి కేవలం 13 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందుకే క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే వారు దీన్ని అన్నానికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. జింక్‌, క్యాల్షియం, ఐరన్‌, ఫోలేట్‌తో పాటు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్‌ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇక ఇందులోని ఫైబర్‌ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
పోషకాల మాట సరే కానీ దీన్నెలా తయారుచేసుకుంటారన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఇది చాలా సింపుల్‌! ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని మిక్సీలో వేసి బరకగా తిప్పుకోవాలి.. లేదంటే గ్రేటర్‌తో తురుముకోవచ్చు. ఆపై ప్యాన్‌లో కాస్త నూనె వేసుకొని ఈ క్యాలీఫ్లవర్‌ పొడిని కాస్త పొడిపొడిగా, గోధుమ వర్ణంలోకి మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా తయారైన క్యాలీఫ్లవర్‌ రైస్‌ని అన్నం మాదిరిగానే కూరలతో తినచ్చు.. లేదంటే కాయగూరలన్నీ వేసి కిచిడీలాగానైనా తయారుచేసుకొని తీసుకోవచ్చు. ఇదే విధంగా బ్రకలీ రైస్‌ కూడా తయారుచేసుకొని అన్నానికి ప్రత్యామ్నాయంగా తినచ్చు.

క్యాబేజీతో ఇలా!

క్యాబేజీని ఉల్లిపాయలకు ప్రత్యామ్నాయంగా వాడడం మనకు తెలిసిందే! అయితే దీన్ని అన్నానికి బదులుగా కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం క్యాబేజీని సన్నగా, చిన్న చిన్న ముక్కల్లా తరుగుకొని.. కాస్త నూనెలో వేసి వేయించాలి. పచ్చివాసన పోయి క్యాబేజీ ముక్కలు మృదువుగా మారేంత వరకు గరిటెతో తిప్పుతుండాలి. ఇలా తయారైన క్యాబేజీని అన్ని కాయగూరలతో కలిపి తీసుకోవచ్చు.. లేదంటే సలాడ్లలోనూ భాగం చేసుకోవచ్చు.
ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్‌ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచడానికి, విటమిన్‌ ‘కె’ రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు, రక్తం గడ్డకట్టే ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు తోడ్పడతాయి.

కొర్రలు

మంచి కొవ్వులు ఎక్కువగా, చెడు కొవ్వులు తక్కువగా ఉండే కొర్రలు రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మధుమేహులు అన్నానికి బదులుగా దీన్ని తీసుకోవడం అత్యుత్తమం అంటున్నారు నిపుణులు. ఇక ఇందులో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌.. వంటి పోషకాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే దీంతో పాటు రాగులు, జొన్నలు.. వంటి చిరుధాన్యాలు బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు నిపుణులు. అయితే వీటిలో ఏది ఎంచుకున్నా తగిన మోతాదులో తీసుకోవడం, ఒకటికి రెండు కప్పుల నీళ్ల చొప్పున బాగా ఉడికించుకోవడం చాలా ముఖ్యం. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

వీటితో పాటు బార్లీ, బ్రౌన్‌ రైస్‌, రాజ్‌గిరా (తోటకూర గింజలు).. వంటివి కూడా అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఎంత ఆరోగ్యకరమైనవైనా సరే.. అందరికీ అన్నీ పడకపోవచ్చు.. కొంతమందిలో అలర్జీలకూ దారితీయచ్చు. కాబట్టి ముందు కొద్ది మొత్తంలో తీసుకొని.. సరిపడితే రోజువారీ మెనూలో చేర్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని