Updated : 27/07/2021 17:54 IST

లోబీపీకి చెక్‌ పెట్టే ఆహారమిది!

వేళకు తినకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం, రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, అధిక పనిభారం, మానసిక ఒత్తిడి.. ఇలాంటి జీవనశైలి ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. లోబీపీ (హైపోటెన్షన్‌) కూడా అందులో ఒకటి. ఆరోగ్యవంతుల్లో రక్తపోటు 120/80 mmHg గా ఉంటుంది.. అదే ఈ రేటు 90/60 mmHg కంటే తక్కువ నమోదైందంటే దాన్ని లోబీపీగా పరిగణిస్తుంటారు. అయితే సాధారణంగానే పురుషులతో పోల్చితే మహిళల్లో బీపీ స్థాయులు కాస్త తక్కువగానే ఉంటాయంటోంది ఓ అధ్యయనం. కానీ పైన పేర్కొన్నట్లు లోబీపీ నమోదైతే మాత్రం నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరిస్తోంది. మరి, ఇంతకీ ఈ సమస్యను ఎలా గుర్తించాలి? దీన్నుంచి బయటపడాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

లక్షణాలివే!

లోబీపీని కొన్ని లక్షణాలతో గుర్తించచ్చని చెబుతున్నారు నిపుణులు. కళ్లు మసకబారడం, తల తిరగడం, త్వరగా అలసిపోవడం, అనవసరంగా టెన్షన్‌ పడడం, ఏ పనిపైనా దృష్టి నిలపకపోవడం, మైకం, వికారం, వాంతులు, తలనొప్పి.. ఇవన్నీ బీపీ పడిపోయినప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు. కొంతమందిలో మూర్ఛ, పల్స్‌ రేట్‌ పడిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఒళ్లు చల్లబడిపోవడం.. లాంటి తీవ్ర లక్షణాలు కూడా కనిపిస్తాయట! ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లడం మేలు! అయితే ఈ సమస్య కొంతమందిలో తాత్కాలికమే అయినా.. మరికొంతమందిలో మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగే ప్రమాదమూ ఉందంటున్నారు నిపుణులు. ఏదేమైనా.. బీపీని సాధారణ స్థితికి తెచ్చుకొని ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు వైద్యులు సూచించిన మందులతో పాటు కొన్ని ఆహార పదార్థాలు సైతం సహకరిస్తాయంటున్నారు.

ఆహారంలో ఈ మార్పులు!

రక్తపోటును సాధారణ స్థితికి తెచ్చుకోవడానికి సరైన డైట్‌ పాటించడమే ఉత్తమ మార్గమంటున్నారు నిపుణులు. వేళకు పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చని వారు సూచిస్తున్నారు. మరి లోబీపీ బాధితులు రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన ఆ ఆహార పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

ద్రవాహారం

లోబీపీకి డీహైడ్రేషన్‌ కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. శరీరంలో తగినంత నీటిస్థాయులు లేనప్పుడు రక్తం పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా బీపీ పడిపోతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలి. దానిమ్మ, బీట్‌రూట్‌ జ్యూస్‌ అయితే మరీ మంచిది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

విటమిన్‌ బి-12 ఎక్కువగా!

విటమిన్‌ బి-12 లోపం వల్ల రక్తహీనత తలెత్తుతుంది. ఇది క్రమంగా హైపోటెన్షన్‌కు దారి తీస్తుంది. అందువల్ల విటమిన్‌ బి-12 అధికంగా ఉండే గుడ్లు, పప్పుధాన్యాలు, పెరుగుతో పాటు చికెన్‌, మటన్‌, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.

ఫోలేట్‌ తగినంత!

ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేయడంలో ఫోలికామ్లం పాత్ర కీలకం. నిమ్మజాతి పండ్లు, బీన్స్‌, ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, లివర్‌ను అధికంగా తీసుకుంటే శరీరానికి సరైన స్థాయిలో ఫోలేట్‌ అందుతుంది. ఐరన్‌ అధికంగా ఉండే అరటి పండ్లు, నట్స్‌, ముల్లంగి, పాలకూరను కూడా ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

ఉప్పు మోతాదులో!

లోబీపీ ఉన్న వారు తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదును పెంచడం వల్ల కూడా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పచ్చళ్లు, ఆలివ్‌ ఆయిల్‌, సూప్స్‌, జున్ను.. వంటివి ఆహారంలో చేర్చుకోవడం మంచిదంటున్నారు. అయితే ఉప్పు మితిమీరినా హైబీపీతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకోండి. అందుకే మీ ఆరోగ్య స్థితి, బీపీ స్థాయుల్ని బట్టి ఎంత ఉప్పు వాడాలో నిపుణుల్ని అడిగి తెలుసుకోవచ్చు.

ఇవి కూడా!

* హఠాత్తుగా బీపీ పడిపోయిన వారికి తాత్కాలిక ఉపశమనం కోసం కెఫీన్‌ ఉండే కాఫీ లేదా టీ.. వంటివి అందిస్తే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

* లోబీపీ బాధితులు ఉదయాన్నే ఐదారు తులసి ఆకులు నమలడం ఉత్తమం. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ ‘సి’ రక్తపోటులోని హెచ్చుతగ్గులను నియంత్రిస్తాయి.

* బాదం పాలు, ఎండు ద్రాక్ష కూడా రక్తపోటును నియంత్రించడంలో బాగా సహాయపడాయి.

* లోబీపీతో బాధపడేవారు వేళకు భోజనం చేయడం, ఆకలిగా లేకపోయినా రెండు మూడు గంటలకోసారి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

* సమయానికి నిద్రపోవడమూ ముఖ్యమే! రోజూ కనీసం 8 గంటలైనా నిద్రపోతే శరీరం పునరుత్తేజితం అవుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని