Updated : 17/03/2023 19:50 IST

నిద్ర పట్టడం లేదా? ఇవి ట్రై చేయండి..!

అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ప్రశాంతమైన నిద్ర కూడా అవసరం. కానీ ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామందికి నిద్ర పట్టకపోవడం.. కలత నిద్ర.. వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని రకాల పానీయాలను తాగడం ద్వారా ప్రశాంతంగా నిద్ర పోవచ్చంటున్నారు సంబంధిత నిపుణులు. అయితే షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే విషయంలో ఓసారి వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం మంచిది.

అరటిపండు స్మూతీ..

సాధారణంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి గల కారణాల్లో మెగ్నీషియం లోపించడం కూడా ఒకటి. కాబట్టి నిద్రకు ఉపక్రమించడానికి ముందు అరటిపండుతో తయారుచేసిన స్మూతీని తాగడం ద్వారా ప్రశాంతమైన నిద్ర మన సొంతం చేసుకోవచ్చు.
దీనికోసం సహజసిద్ధంగా పండిన అరటిపండు, రెండు చెంచాల ఆల్మండ్ బటర్, కప్పు పాలు బ్లెండర్‌లో వేసి బాగా మిక్స్ చేయాలి. సుమారు 2 లేదా 3 నిమిషాల పాటు మిక్స్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకొని నేరుగా తాగేయచ్చు. ఈ పానీయం కాస్త తీయగా ఉండాలని కోరుకునేవారు ఇందులో కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. అరటిపండు, ఆల్మండ్ బటర్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కేవలం ప్రశాంతమైన నిద్రకే కాదు.. కండర మరియు నాడీ వ్యవస్థ కూడా సక్రమంగా పని చేసేలా కూడా చేస్తుంది.

పాలు, తేనెతో..

వేడి పాలలో కొద్దిగా వెనీలా ఎసెన్స్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు కొద్దికొద్దిగా నిదానంగా తాగాలి. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లు విడుదలయ్యేలా చేయడం ద్వారా మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. అలాగే వెనీలా ఎసెన్స్ మెదడుని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇక తేనె కూడా నిద్రకు ఉపకరించే హార్మోన్లు విడుదలయ్యేందుకు ప్రేరేపిస్తుంది.

చామొమైల్ టీ..

ఒక కప్పులో మరిగించిన నీళ్లు తీసుకొని అందులో చామంతి ఆకులు లేదా పువ్వులు వేసి మూడు నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా తేనె, పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. అంతే.. చామొమైల్ టీ రడీ.. దీనికి బదులుగా మార్కెట్లో లభ్యమవుతున్న చామొమైల్ టీ బ్యాగ్స్‌ని వేడి నీటిలో వేసుకోవడం ద్వారా కూడా చామొమైల్ టీ సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని నిద్ర పోవడానికి ముందు తాగడం ద్వారా చక్కని నిద్రని మన సొంతం చేసుకోవచ్చు.

లావెండర్ మిల్క్‌షేక్..

ఒకటిన్నర కప్పు బాదం పాలు తీసుకొని దానిలో ఎండబెట్టిన లావెండర్ పువ్వులు చెంచా వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి అందులో బ్లూబెర్రీ ఐస్‌క్రీమ్, తాజా బ్లూబెర్రీలు (కొన్ని) కూడా వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే ఇందులో ఐస్‌క్యూబ్స్, మ్యాపుల్ సిరప్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ కూడా వేసుకోవచ్చు. నిద్రకు ఉపక్రమించే ముందు ఈ పానీయం సేవించడం ద్వారా కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. బాదంపాలు మన శరీరంలో నిద్రకు ఉపకరించే సెరటోనిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేయడమే అందుకు ప్రధాన కారణం.

బాదం పాలతో..

ఒక కప్పు బాదం పాలు తీసుకొని అందులో చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా అల్లం వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడి చేసి అందులో కొద్దిగా తేనె వేసి మళ్లీ బాగా మిక్స్ చేయాలి. ఇలా సిద్ధం చేసిన బాదంపాలను తాగడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందట!

చెర్రీ జ్యూస్..

రోజూ ఉదయం, రాత్రి సమయాల్లో గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం ద్వారా ప్రశాంతమైన నిద్రని మన సొంతం చేసుకోవచ్చట! చెర్రీల్లో ఉండే మెలటోనిన్ అనే పదార్థం త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది.

చెర్రీ ఆల్మండ్ స్మూతీ, చెర్రీ కోకొనట్ స్మూతీ, చామొమైల్ అండ్ లావెండర్ టీ.. మొదలైనవి కూడా చక్కని నిద్రకు ఉపకరించే పానీయాలే అంటున్నారు నిపుణులు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని