వాళ్ల సంతోషానికి కారణమేమిటో తెలుసా?
ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ఒత్తిడి, ఆందోళనల్ని ఎదుర్కొనే వారు ఎందరో! నిజానికి ఇలాంటి టెన్షన్స్ దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ విషయం గుర్తెరిగినా కొందరు అనవసర భయాందోళనలకు గురవుతుంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం వీరికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు.
ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ఒత్తిడి, ఆందోళనల్ని ఎదుర్కొనే వారు ఎందరో! నిజానికి ఇలాంటి టెన్షన్స్ దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ విషయం గుర్తెరిగినా కొందరు అనవసర భయాందోళనలకు గురవుతుంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం వీరికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. తమ చుట్టూ ఏం జరిగినా సానుకూలంగానే స్పందిస్తూ.. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తుంటారు. వాళ్లను చూసి ‘అలా ఉండడం అదృష్టం’ అనుకుంటాం.. కానీ వాళ్ల రోజువారీ అలవాట్లు, పాటించే కొన్ని నియమాలే వారిని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతాయని చెబుతున్నారు నిపుణులు.
⚛ అది చిన్న విషయమైనా, పెద్ద సమస్యైనా.. అవసరమున్నా, లేకపోయినా.. కొందరు దాని గురించే పదే పదే లోతుగా ఆలోచిస్తుంటారు. నిజానికి దీనివల్ల సమయం వృథా అవడంతో పాటు మానసికంగానూ ఒత్తిడి ఎదురవుతుంటుంది. కానీ మానసికంగా దృఢంగా ఉన్న వాళ్లు అస్సలు ఇలా చేయరు. ఏదైనా సమస్య వస్తే దాన్ని త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప.. దాని గురించే లోతుగా ఆలోచించి మనసు పాడుచేసుకోరు.
⚛ చదువు, కెరీర్, పెళ్లి, పిల్లలు.. ఇలా జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి కాకుండా అనుకోకుండా కొన్ని మార్పులొస్తుంటాయి. వాటిని అర్థం చేసుకొని స్వీకరించినప్పుడే హ్యాపీగా ఉండగలం. ఎప్పుడూ మానసికంగా సంతోషంగా ఉండే వాళ్లు ఇలాగే చేస్తారని చెబుతున్నారు నిపుణులు.
⚛ నచ్చకపోతే చిన్న విషయానికే కోపగించుకోవడం, చిరాకు పడడం.. వంటివి చేస్తుంటారు మనలో చాలామంది.. కానీ మానసికంగా దృఢంగా ఉండే వారు ప్రశాంతంగా దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తుంటారట! తమ అధీనంలో లేని దాని గురించి పాకులాడకుండా.. తమ సాధ్యాసాధ్యాల గురించి తొలుత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
⚛ శరీరాకృతి దగ్గర్నుంచి, వేసుకునే దుస్తుల దాకా.. ఎదుటివారికి అందంగా కనిపించాలన్న ఆలోచనే కొంతమంది మనసును తొలిచేస్తుంటుంది. నిజానికి ఇదే మానసిక ఒత్తిళ్లకు కారణమవుతుంటుంది. కానీ తాము మాత్రం చుట్టూ ఉన్న వాళ్ల కోసం కాకుండా.. తమకు నచ్చినట్లుగా ఉండడంలోనే సంతోషాన్ని, సంతృప్తిని వెతుక్కుంటామంటున్నారు మానసికంగా బలంగా ఉండే అమ్మాయిలు.
⚛ ‘గతం గతః..’ అనుకొని ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ.. భవిష్యత్తు గురించి ఉన్నతంగా ఆలోచించే వారే జీవితంలో పైచేయి సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండే వారి ఫిలాసఫీ కూడా ఇదే! అందుకే గత జ్ఞాపకాల్ని తవ్వుకొని బాధపడకుండా.. పాజిటివ్‌గా ఆలోచించడం, సంతోషంగా జీవించడం నేర్చుకుందాం..!
⚛ ఈర్ష్యాద్వేషాలు, అసూయ, ఎదుటివారి గెలుపును జీర్ణించుకోలేకపోవడం.. ఇవన్నీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంటాయి. అందుకే కొంతమంది వీటి జోలికి పోరు. తద్వారా సంతోషంగా ఉండగలుగుతారు. పైగా విజేతల్ని ప్రశంసించడం, కష్టపడే వారిని ప్రోత్సహించడం.. వీరికి అలవాటు కూడా!
⚛ ‘కోరుకున్నవన్నీ జరగాలని లేదు. అంతమాత్రానికి బాధపడడం అనవసరం..’ అనుకుంటారు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు. అందుకే నిత్యం సంతోషంగా ఉంటారు. కాబట్టి గొంతెమ్మ కోరికలు కోరుకోకుండా.. మన సమర్థత, వనరుల్ని దృష్టిలో ఉంచుకొనే ఏ విషయంలోనైనా అడుగు ముందుకేయడం మంచిది.
⚛ స్నేహితుల్ని ఎంచుకోవడంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారట మానసికంగా దృఢంగా ఉండే అమ్మాయిలు. చాడీలు చెప్పడం, అసూయ పడడం, ఎదుటివారి ఓటమిలో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తుల్ని దూరం పెడుతుంటారని, ఒకవేళ చెలిమి చేసినా వారి గురించి తెలిశాక మాత్రం వారితో స్నేహ బంధాన్ని తెంచుకోవడానికీ సిద్ధంగా ఉంటారట!
⚛ కొంతమంది మొహమాటానికి పోయి చాలా పనుల్ని నచ్చకపోయినా స్వీకరిస్తుంటారు. కానీ, మానసికంగా బలంగా ఉండే వారు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ క్రమంలో వాళ్ల ఆత్మగౌరవానికి, సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది కూడా!
⚛ రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా, ఓటమినీ గెలుపుతో సమానంగా స్వీకరించడం మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులకే చెల్లుతుంది.
⚛ నిజానికి మనకు నచ్చినట్లుగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలం. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు పాటించే సూత్రం కూడా ఇదే! సమాజంతో పని లేకుండా తమకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు.. స్వీయ ప్రేమను పెంచుకుంటారు.
⚛ మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు అనారోగ్యాల బారిన పడే అవకాశం చాలా తక్కువని చెబుతోంది ఓ అధ్యయనం. ఈ క్రమంలో రోజూ వ్యాయామం చేయడం, చక్కటి పోషకాహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర పోవడం.. వంటి ఆరోగ్యకరమైన అలవాట్లే వాళ్ల సంతోషానికి కారణమట!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.