Published : 26/06/2022 10:29 IST

పెంపుడు జంతువుల్ని చూసి నేర్చుకుందాం!

మనసు బాగోలేకపోయినా, ఏమీ తోచకపోయినా, బోర్‌ కొట్టినా.. పెట్స్‌ (జంతువులు/పక్షులు)తో కాసేపు ఆడుకున్నామంటే ఎంతో రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. పైగా అవి మన దగ్గరుంటే ఓ మంచి నేస్తం మనకు తోడున్నట్లే! అందుకే పెంపుడు జంతువుల్ని దత్తత తీసుకునే వారి సంఖ్య ఈ రోజుల్లో క్రమంగా పెరుగుతోందనే చెప్పాలి. అయితే వాటిని ఇలా ఎంతసేపూ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోణంలో నుంచే చూడడం కాకుండా కాస్త వాటి అలవాట్లను కూడా దగ్గర్నుంచి గమనించమంటున్నారు నిపుణులు. తద్వారా ఆరోగ్యపరంగా బోలెడన్ని విషయాలు అవగతమవుతాయంటున్నారు. మరి, పెంపుడు జంతువులు/మన చుట్టూ ఉండే పక్షుల నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లేంటో తెలుసుకుందాం రండి..

నమిలితేనే ఒంటబడుతుంది!

ఆఫీస్‌, ఇంటి పనులంటూ మనకు రోజూ హడావిడే! ఓ అరగంట సమయం కేటాయించి ప్రశాంతంగా తిందామన్నా సమయం దొరకదు. అందుకే ఉన్న టైమ్‌లోనే గబగబా తినేస్తుంటారు చాలామంది. అంతేనా.. తినడానికీ సమయం వృథా అనుకునే వారూ లేకపోలేదు. అయితే నిజానికి ఇలా ఆదరాబాదరాగా తినడం వల్ల పలు జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే మనం పెంచుకునే పక్షులు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఓసారి గమనించమంటున్నారు. ఒక చిన్న గింజ తినడానికి అవి కనీసం ఐదు నుంచి పది నిమిషాలు వెచ్చిస్తాయట! ఈ క్రమంలో ఆహారాన్ని బాగా నములుతూ వాటి రుచిని ఆస్వాదించడంలో పక్షుల కంటే మనం చాలా వెనకబడే ఉన్నామని చెప్పాలి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మనం నోట్లోకి తీసుకున్న ఆహారం మెత్తగా నమలడం వల్ల మన శరీరంలోని అదనపు క్యాలరీలు ఖర్చవుతాయని ఓ అధ్యయనం చెబుతోంది. తద్వారా బరువూ అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఏ విధంగా చూసినా నెమ్మదిగా తినడమే ఆరోగ్యానికి ప్రయోజనకరం.. కాబట్టి ఇకనుంచైనా పక్షుల్లా తినడానికి ప్రయత్నిద్దాం..!

ఒళ్లు విరవడంలో తప్పులేదు!

పిల్లి, కుక్క.. వంటి జంతువుల్ని మనం గమనిస్తే.. అవి అలా కాసేపు ఓ కునుకు తీశాక కాళ్లు ముందుకి-వెనక్కి చాపుతూ ఒళ్లు విరవడం మనం చూసే ఉంటాం. అప్పుడనే కాదు.. రోజులో కొన్నిసార్లు అవి ఇలా బాడీ స్ట్రెచ్‌ చేస్తుంటాయి. దీనివల్ల ఎక్కువ సేపు ఒకే స్థితిలో కూర్చొన్నప్పుడు/పడుకున్నప్పుడు బిగుసుకుపోయిన కండరాలు, కీళ్లు తిరిగి ఫ్లెక్సిబుల్‌గా మారతాయట! అంతేకాదు.. ఇది శరీరానికి ఓ చిన్నపాటి వ్యాయామంలా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఉదయం నిద్ర లేచీ లేవగానే మంచంపై నుంచే ఈ వర్కవుట్‌ చేయమంటున్నారు. అలాగే ఎక్కువసేపు పనిలో నిమగ్నమై కాస్త బ్రేక్‌ తీసుకునే క్రమంలోనూ ఇలా బాడీ స్ట్రెచ్‌ చేస్తే మంచిదట! కాబట్టి అందరి ముందూ ఇలా ఒళ్లు విరిస్తే బాగోదేమో.. అన్న ఆలోచనలు పక్కన పెట్టి ఆరోగ్యం పైనే దృష్టి పెట్టమంటున్నారు నిపుణులు.

కోడి కూయకముందే.. ఊరు లేవకముందే!

తెలతెలవారగానే గూడు వదిలి ఆహారం కోసం అన్వేషణ సాగించే పక్షులు.. చీకటి పడక ముందే తిరిగి గూటికి చేరుకుంటాయి. అంటే త్వరగా లేచి, త్వరగా పడుకోవడమని తమ అలవాట్లతో చెప్పకనే చెబుతున్నాయివి. ఫలితంగా వాటిలాగా రోజంతా ఎంతో చురుగ్గా ఉండచ్చు.. చేసే పనిపై ఏకాగ్రత పెట్టచ్చు. కానీ మనలో చాలామంది పని ఉన్నా, లేకపోయినా రాత్రి ఆలస్యంగా పడుకోవడం.. పొద్దెక్కేదాకా మంచం దిగకపోవడం.. చేస్తుంటారు. నిజానికి ఇలా ఓ వేళాపాళా లేకుండా నిద్రపోవడం వల్ల ఆహారం కూడా వేళకు తీసుకోం. దీని ప్రభావం జీర్ణవ్యవస్థపై పడి.. అంతిమంగా రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.. అంతేకాదు.. మానసికంగానూ ఒత్తిడి, ఆందోళనలు ఎదురవుతుంటాయి. మరి, ఇలా జరగకూడదంటే పక్షుల్లా ఓ మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాల్సిందే!

చలాకీగా.. ఆరోగ్యంగా..!

శరీరం-మనసు ఎంత చురుగ్గా ఉంటే.. అంత ఆరోగ్యంగా ఉండచ్చు. మరి, ఇలా యాక్టివ్‌గా ఉండాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి! అలాగని జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన పని లేదు.. సింపుల్‌గా కాసేపు నడక, మరికాసేపు పరుగు.. వంటివి మన జీవనశైలిలో భాగం చేసుకున్నా సరిపోతుంది. మన చుట్టూ ఉండే పిల్లులు, కుక్కల్ని చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అవి కాసేపైనా ఒక దగ్గర కూర్చోలేవు. ఎప్పుడు చూసినా అటూ ఇటూ తిరగడం, పరిగెత్తడం, ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్లతో గెంతడం, ఆడుకోవడం.. వంటివి చేస్తుంటాయి. ఇలాంటి ఆటలే వాటి శరీరానికి చక్కటి వ్యాయామాన్ని అందించి అవి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే వ్యాయామం చేసే సమయం లేదని సాకులు చెప్పడం కంటే.. ఏదో ఒక పనిచేస్తూ నడవడం, పిల్లలతో/పెట్స్‌తో ఆడుకోవడం, ఉదయాన్నే ఎండలో కాసేపు పరిగెత్తడం.. వంటివి చేయచ్చు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామంతో పాటు లేలేత సూర్యకిరణాల నుంచి విటమిన్‌ ‘డి’ కూడా అందుతుంది.

సాకులు చెప్పకుండా..!

సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే పండ్లు, కాయగూరలు తినమంటే.. ‘నాకు ఆ పండు నచ్చదు.. ఈ కాయగూర తినడం ముందు నుంచీ నాకు అలవాటు లేదు..’ అంటూ సాకులు చెబుతుంటారు కొంతమంది. ఇలాంటి వారు పక్షుల ఆహారపుటలవాట్లను గమనిస్తే ఓ విషయం స్పష్టంగా అవగతమవుతుందంటున్నారు నిపుణులు. చిలుక వంటి కొన్ని రకాల పక్షులు ఏ ఆహారమైనా బాగా ఆస్వాదిస్తాయట! అంతేకాదు.. మనలా కొన్ని రకాల పండ్లు/కాయగూరల్ని చూస్తే మొహం చిట్లించుకోవడం, దూరం పెట్టడం.. వంటివేవీ అవి చేయవట! పైగా ఆయా కాలాల్లో దొరికే పండ్లు/కాయగూరల్ని తీసుకోవడంలో మనుషుల కంటే పక్షులు/జంతువులే ముందున్నాయని చెబుతున్నారు నిపుణులు. వాటి చురుకుదనానికి ప్రకృతి ప్రసాదించే ఈ పదార్థాలు తీసుకోవడం కూడా ఓ కారణమే అంటున్నారు. అందుకే పండ్లు/కాయగూరలు తీసుకునే విషయంలో సాకులు మాని.. వాటి రుచిని ఆస్వాదించమంటున్నారు.

కాబట్టి ఇక నుంచైనా.. ఇంట్లో ఉండే పెట్స్‌, ఇంటి చుట్టూ కనిపించే జంతువులు/పక్షులను చూసైనా మన ఆహారపుటలవాట్లను మార్చుకుందాం.. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయంలోనూ పిల్లలకూ వీటినే ఉదాహరణగా చూపిద్దాం.. తద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మన సొంతం చేసుకుందాం..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని