Monsoon Food: బరువునీ అదుపులో ఉంచే హెల్దీ స్నాక్స్..!
బయట వర్షం పడుతుంటే.. వేడివేడి సమోసా, పకోడీ, మిర్చీ-బజ్జీ.. వీటి పైకే మనసు లాగుతుంటుంది. నూనె, క్యాలరీలు ఎక్కువగా నిండి ఉండే ఈ స్నాక్స్ ఆరోగ్యంగా ఉన్న వారికే కాదు.. బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికీ మంచివి కావు. పైగా ఈ కాలంలో జీర్ణ వ్యవస్థ.....
బయట వర్షం పడుతుంటే.. వేడివేడి సమోసా, పకోడీ, మిర్చీ-బజ్జీ.. వీటి పైకే మనసు లాగుతుంటుంది. నూనె, క్యాలరీలు ఎక్కువగా నిండి ఉండే ఈ స్నాక్స్ ఆరోగ్యంగా ఉన్న వారికే కాదు.. బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికీ మంచివి కావు. పైగా ఈ కాలంలో జీర్ణ వ్యవస్థ వేగం మందగిస్తుంది కాబట్టి.. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా అజీర్తి, గ్యాస్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవు. మరి, ఈ తిప్పలన్నీ తప్పాలంటే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను మించిన ప్రత్యామ్నాయాలు మరొకటి లేవంటున్నారు పోషకాహార నిపుణులు. అలాంటి హెల్దీ స్నాక్స్‌ని ఈ వర్షాకాలంలో భాగం చేసుకున్నామంటే అటు ఆరోగ్యంతో పాటు ఇటు బరువూ అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు.
పండ్లే.. కానీ ఇలా!
బయట వర్షం పడుతుంటే.. పండ్లు తినడమేంటి అని చెప్పిన వాళ్ల వైపు ఎగాదిగా చూస్తాం.. కానీ ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ పండ్లను మించినవి మరొకటి లేదంటున్నారు నిపుణులు. అయితే వాటినీ వేడివేడిగా తీసుకోవచ్చంటున్నారు. ఇందుకోసం.. మీకు నచ్చిన పండ్లు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. వాటిపై కాస్త ఉప్పు-కారం చల్లుకొని, నిమ్మరసం పిండుకొని గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ ఆప్షన్ లేని వారు క్యాస్టర్ ఐరన్ కడాయిలో వేపుకోవచ్చు. ఇక వీటిని వేడివేడిగా తిన్నామంటే అటు తియ్యతియ్యగా.. ఇటు వగరుగా భలే రుచిగా ఉంటాయి.. పైగా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా! ఇలా పండ్లకు బదులు మీకు నచ్చిన కాయగూరల్ని సైతం ఇలా గ్రిల్ చేసుకొని లాగించేయచ్చు.
‘కార్న్’పై అపోహలు వద్దే వద్దు!
వర్షాకాలంలో ఎక్కువగా నోరూరించే మరో స్నాక్ ఐటమ్ స్వీట్‌కార్న్. అయితే వీటిలో చక్కెర ఎక్కువ మోతాదులో ఉంటుంది.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన స్నాక్ కానే కాదు.. అన్న భ్రమలో ఉంటారు కొంతమంది. అయితే ఇలాంటి అపోహల్ని వీడమంటున్నారు నిపుణులు. శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో నిండి ఉండే మొక్కజొన్న పొత్తుల్ని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయట! అందుకే వీటిని ఉడికించి లేదంటే సన్నని సెగపై కాల్చుకొని తీసుకోవడం మంచిదంటున్నారు.
పాప్‌కార్న్.. తనివి తీరేలా!
ఇది ఎంత తిన్నా తనివే తీరదు. అందుకే ఈ వర్షాకాలంలో మీకు నచ్చినంత తినమంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తీసుకున్నా క్యాలరీల సంఖ్య అదుపులోనే ఉంటుందట! అది కూడా ఏ ఫ్లేవర్ కలపని, నూనె లేకుండా తయారుచేసిన పాప్‌కార్న్ అయితేనే మంచిదట! తద్వారా ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా శరీరానికి అందుతాయి. ఈ పీచు గుండె జబ్బులు, డయాబెటిస్, పలు రకాల క్యాన్సర్లు.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.. అలాగే ప్రొటీన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇక ఈ సాధారణ పాప్‌కార్న్ వల్ల బరువు పెరుగుతామన్న భయమూ అక్కర్లేదు.
ఇమ్యూనిటీ స్నాక్!
ఈ వర్షాల వేళ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మరమరాలతో చేసిన చాట్‌ని స్నాక్‌గా తీసుకోమంటున్నారు నిపుణులు. మరమరాలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చట్నీ, రెడ్ చట్నీ (ఎర్ర మిరపకాయలతో చేసిన చట్నీ).. ఇవన్నీ కొద్ది మోతాదుల్లో తీసుకొని కలుపుకుంటే మరమరాల చాట్ రడీ అవుతుంది. మరమరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు.. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి సహకరిస్తాయి. ఇక ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇక వర్షాకాలంలో తలెత్తే దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికీ ఈ స్నాక్ చక్కగా ఉపయోగపడుతుందట!
వేడివేడిగా ఇవి ట్రై చేయండి!
❖ బరువు అదుపులో ఉంచుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా.. డ్రైఫ్రూట్స్‌ని మించిన స్నాక్ ఐటమ్ లేదు. కాబట్టి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు.. వంటివన్నీ కొద్ది మోతాదులో తీసుకొని నూనె లేకుండా వేయించుకుని తీసుకోవచ్చు.
❖ వర్షాకాలంలో ఎక్కువగా దొరికే వేరుశెనక్కాయలను ఉడికించుకొని తీసుకోవచ్చు.. లేదంటే వేయించుకొని బెల్లంతో కలిపి తీసుకున్నా శరీరానికి ఐరన్ ఎక్కువ మొత్తంలో అందుతుంది.
❖ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని కూడా ఈ వర్షాకాలంలో కొంతమంది తినాలని ఇష్టపడుతుంటారు. అయితే వాటికి బదులు చిలగడదుంప, బంగాళాదుంపల్ని స్ట్రిప్స్‌లా కట్ చేసి ఉప్పు-కారం, చాట్ మసాలా చల్లి.. నూనె లేకుండా బేక్ చేసుకోవచ్చు.. నూనె వేసుకోవాలనుకునే వారు ఆలివ్ ఆయిల్ వాడచ్చు.. అది కూడా మోతాదులోనే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.